Lovers day | నవతరం.. తమ భాగస్వామి ఎంపికలో ‘ప్రేమ’కే తొలి ప్రాధాన్యం ఇస్తున్నది. అందం, ఆస్తి కన్నా.. అనురాగానికే ఓటేస్తున్నది. ఆన్లైన్ పెళ్లి సంబంధాల వేదిక.. జీవన్సాథీ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దేశంలో 29 శాతం మహిళలు, 47 శాతం పురుషులు.. కాబోయే జీవిత భాగస్వామిలో కేవలం ప్రేమను మాత్రమే కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇక ఒంటరి వ్యక్తుల్లో 40 శాతం మంది.. ప్రేమ కోసం మకాం మార్చడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అయితే, ఈ విషయంలో తల్లిదండ్రులు కొంచెం కోపంగా ఉన్నారు. వారు మాత్రం.. తమ పిల్లలు తమతోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ముంబయి, పూణె, బెంగళూరువాసులు.. ఎన్ఆర్ఐలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. విదేశాల్లో స్థిరపడినవారినే వివాహం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, రాజధాని ఢిల్లీ పిల్లగాళ్లు మాత్రం.. దేశంలో స్థిరపడిన వ్యక్తులకే తమ ఓటు అంటున్నారు. 39 శాతం మంది మహిళలు.. తమ భాగస్వామి తమకు అనుకూలంగా ఉంటే చాలని చెబుతున్నారు.
అయితే, 11 శాతం మంది మాత్రం.. ఆర్థిక స్థిరత్వం కూడా ఉండాలని ఆశిస్తున్నారు. జీవిత భాగస్వామి ఎంపికలో తమ నిర్ణయమే ఫైనల్ అని 96 శాతం మంది అబ్బాయిలు అంటుండగా.. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాలను చేసుకుంటామని నాలుగు శాతం మంది చెబుతున్నారు. ఇక వివాహ వయసు విషయానికి వస్తే.. చాలామంది 27-30 ఏళ్ల మధ్య వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట. అదే.. పెళ్లికి అనువైన వయసని నమ్ముతున్నారు. ఇక పెళ్లి ఖర్చులోనూ భాగస్వామి కూడా భాగం కావాలని 72 శాతం మంది భావిస్తున్నారు. 17 శాతం మంది మాత్రమే.. వివాహ వేడుకను ఆడంబరంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ.. సరైన భాగస్వామి దొరికినప్పుడు ఆలస్యం చేయకుండా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు సూచిస్తున్నారు. వైవాహిక బంధానికి సౌకర్యమే ముఖ్యమని, సమయపాలన అవసరం లేదని చెబుతున్నారు.