Non Stick Cookware | నాన్‌స్టిక్ పాత్రల వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరం అని ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్)లాంటి సంస్థలతో పాటు ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగని అడుగంటని వంట ఇంట లేదనుకోనక్కర్లేదు. దీనికి గుజరాత్‌లోని ఓ ఆదివాసీ తెగ వాళ్లు సంప్రదాయ పరిష్కారాన్ని చూపుతున్నారు. ఆ సంగతేంటో చూద్దాం!
గత కొన్నేండ్లుగా చాలా ఇండ్లలోని వంటపాత్రల్లో తప్పకుండా ఉంటున్న వస్తువు నాన్‌స్టిక్ ప్యాన్. వంట చేసినప్పుడు అడుగు అంటకుండా ఉండే ఈ పాత్రలు ఆడవాళ్లను అమితంగా ఆకట్టుకున్నాయి. సులభంగా దోశలు వేయడానికి, పాత్రకు అంటకుండా కూరలు చేయడానికి వాళ్లకిది ఫేవరెట్ అయిపోయింది. అంతేకాదు, కడగడం కూడా చిటికెలో అయిపోతుంది కాబట్టి మరింత నచ్చింది. ఇంకేం, నాన్‌స్టిక్ ప్యాన్లు ఎంచక్కా వంటింట్లో తిష్ఠ వేశాయి. అయితే, ఇన్నాళ్ల నుంచి మనం వాడుతున్న ఈ పాత్రలు విషపూరిత వాయువుల్ని విడుదల చేస్తాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే నాన్స్టిక్ను దూరం పెట్టమని సలహా ఇస్తున్నాయి.
పెనం లేదా మూకుడు లోపల టెఫ్లాన్ అనే ప్లాస్టిక్ తరహా రసాయన పదార్థాన్ని పూసి దీన్ని తయారుచేస్తారు. కార్బన్ ఫ్లోరిన్ల సమ్మేళనమైన ఇది 300 డిగ్రీల ఉష్ణోగ్రత కన్నా వేడి అయితే, ఇందులోంచి వచ్చే పొగ విషపూరితం అవుతుంది. దీన్ని పీల్చడం వల్ల టెఫ్లాన్ ఫ్లూ… అని పిలిచే ఒక రకం జ్వరం వస్తుందట. చలి, గొంతునొప్పి, నీరసంలాంటివి దీని లక్షణాలు. అంతేకాదు, ఇందులోని రసాయనాలు ఆహారంలోనూ కలుస్తున్నాయట. ఇవి థైరాయిడ్ సమస్యతోపాటు శ్వాస సంబంధిత ఇబ్బందులు, కొన్ని రకాల క్యాన్సర్లకు కారణం అవుతున్నాయట. మరి నాన్‌స్టిక్ వంటకు సరైన సాటి ఇంకేదీ లేదా… అన్న ప్రశ్నకు తప్పకుండా ఉంది అన్నదే సమాధానం అవుతుంది. అది కూడా ప్రకృతి వనరుల నుంచి తయారుచేసింది కావడం మరింత విశేషం.
మట్టితో…
గుజరాత్‌లోని ధనక్ తెగకు చెందిన ఆదివాసీలు తమ వంటల కోసం మట్టిపాత్రలు తయారు చేసుకుంటారు. చేతితో చేసిన వీటిని ఎండలో ఆరబెట్టాక దానిపైన జాజు (ఎర్రమట్టి)తో పూత పూస్తారు. దాని పైన లక్క కోట్ వేస్తారు. ఈ పాత్రలు పొయ్యి మీద పెద్ద మంట పెట్టినా నెర్రెలివ్వవు. లోపలి లక్క కోట్ ఆహారంలో కలవడంలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు, ఈ కోట్ వల్ల పాత్ర నూనె పీల్చుకోవడంలాంటి సమస్య ఉండదు. కాబట్టి తక్కువ నూనెతోనే వంట పూర్తి చేసేయొచ్చు. పాత్ర మట్టిది కాబట్టి వంటకం చాలాసేపు వేడిగా ఉంటుంది. ఇక, ప్రస్తుతం కొందరు ఔత్సాహికులు ఈ పాత రకం పాత్రలకు కొత్త లుక్ ఇస్తున్నారు. బూర్లె మూకుడుతోపాటు మూత పెట్టే గిన్నెలు, పెనం లాంటివీ చేస్తున్నారు. కూరల్లాంటివి వండేందుకు, ఉడకబెట్టడానికి, వేడి చేసుకోవడానికి, ఫ్రైలు చేసుకోవడానికి కూడా ఇవి పనికొస్తాయి. వీటిని తయారుచేసే ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఈ తెగవారు మధ్య గుజరాత్‌లోని చోటా ఉదయ్‌పూర్, అలీరాజ్‌పూర్ జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు. వీటికి జీఐ ట్యాగ్ కోసమూ ప్రయత్నిస్తున్నారట. ఏదేమైనా ఈ పాత్రలు కొత్త తరం అవసరాలకు సరిపడా రూపుదిద్దుకొని అందుబాటులోకి వస్తే మాత్రం… నాన్స్టిక్కు త్వరలోనే బై చెప్పేయొచ్చు!