బాల్యం అంటేనే.. అందమైనది. జీవితంలో ఎన్నో మధుర స్మృతులను అందించేది. ఒకప్పుడు బాల్యం.. సంతోషం, అమాయకత్వం, ఆటపాటలతో సాగిపోయేది. అయితే.. నేటితరం బాల్యం మాత్రం నిరాస-నిస్పృహలతో సహవాసం చేస్తున్నది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తాజాగా నిర్వహించిన సర్వే.. ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా, సోషల్ మీడియా వినియోగం.. పిల్లల్లో డిప్రెషన్ లక్షణాలను పెంచుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయం పెరిగేకొద్దీ.. వారిలో డిప్రెషన్ కూడా పెరుగుతున్నదని తేల్చింది.
సర్వేలో భాగంగా.. దాదాపు పన్నెండు వేల మంది పిల్లల డేటాను పరిశీలించారు. వీరంతా 9 నుంచి 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి.. మూడేళ్లపాటు వారి అలవాట్లను అనుసరించారు. ఇందులో భాగంగా.. పిల్లల్లో నిరాశ పెరగడానికి సోషల్ మీడియా కారణమని గుర్తించారు. పిల్లల సోషల్ మీడియా వినియోగం రోజుకు ఏడు నిమిషాల నుంచి 73 నిమిషాలకు పెరిగినట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఫలితంగా వారిలో నిరాశపూరితమైన లక్షణాలు 35 శాతం పెరిగినట్టు వెల్లడించారు.
ఇందుకు గల కారణాలు చెబుతూ.. సైబర్ బెదిరింపులు టీనేజర్లలో డిప్రెషన్‌కు కారణం అవుతున్నాయట. సైబర్ బెదిరింపులకు గురైన 11 – 12 ఏళ్ల పిల్లల్లో.. ఒక సంవత్సరం తర్వాత ఆత్మహత్య ఆలోచనలు రావడం, ఆత్మహత్యాయత్నం చేసుకునే అవకాశం 2.62 రెట్లు అధికంగా గుర్తించామని అధ్యయనకారులు చెప్పుకొచ్చారు. అలాగే, ఆ పిల్లలు తర్వాతి సంవత్సరంలో మాదకద్రవ్యాలకు అలవాటుపడే ప్రమాదం 2.31 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. ఇక చాలామంది పిల్లలు సోషల్ మీడియాలో ఇతరులను చూసి, తమ జీవితాలతో పోల్చుకుంటున్నారట. దాంతో వారిలో అసంతృప్తితోపాటు నిరాశ గూడుకట్టుకుంటున్నది.
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపడం వల్ల.. నిద్రకు దూరం అవుతున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. స్మార్ట్‌ఫోన్‌కు బానిసై.. చదువు అటకెక్కడం, పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం కూడా పిల్లల్లో నిరాశను పెంచుతున్నది. అయితే.. పిల్లల్లో నిస్పృహను పారదోలేందుకు ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్’ కొన్ని సలహాలు అందించింది. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను అలవర్చుకోవాలని సూచించింది. స్క్రీన్ టైమ్ తగ్గించుకోవాలనీ, ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, నిద్రకు ముందు స్మార్ట్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని పేర్కొన్నది.