మృదువైన భాష. చూడచక్కని రూపం. తెలుగుదనం ఉట్టిపడే బొట్టు,కట్టు. తను మాట్లాడుతుంటే కృష్ణా, గోదారమ్మ కలిసి గలగలా పారుతున్నట్టు ఉంటుంది. కష్టాలు ఎదురైనా, వివాదాలు చుట్టుముట్టినా.. చిరునవ్వుతో ఎదిరించింది. చాలాకాలం తర్వాత మళ్లీ బుల్లితెరపై ‘స్టార్ మా పరివార్ లీగ్-3’తో సందడి చేయనున్నది నటి, యాంకర్ ఝాన్సీ. చిన్నతెర నుంచి వన్నెచిన్నెల వెండితెర వరకూ అనేక విషయాలను ఆమె ‘జిందగీ’తో పంచుకున్నది ..
‘స్టార్ మా పరివార్’తో అలరిస్తూ.. మూడో సీజన్‌తో హ్యాట్రిక్ కొట్టారు. ఎలా ఉండబోతున్నదీ సరికొత్త వార్?
(చిరునవ్వుతో..) నన్ను ఇంటి బిడ్డలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈసారి ఎంటర్టైన్మెంట్ విషయంలో.. తగ్గేదే లే! భావోద్వేగాలతో కూడిన వినోదభరితమైన ప్రయాణాన్ని మీకు చూపించబోతున్నాం. స్టార్ మా పరివార్ సీజన్-3 వేదికపైకి వచ్చిన వారంతా విజేతలే. వాళ్ల ప్రదర్శన కూడా వేరే లెవల్. స్టార్ మాలోని 16 సీరియళ్ల కుటుంబాలూ విజయాన్ని సాధించేందుకు పడుతున్న తపన మీరే చూస్తారు. ఇదో వినోదాల విందే.
చాలాకాలం తర్వాత బుల్లితెరపై అలరిస్తున్నారు. గ్యాప్ మీరే తీసుకున్నారా? వచ్చిందా?
గతంలో వరుస సినిమాల వల్ల కావచ్చు, కొన్ని కుటుంబ కారణాల వల్లా కావచ్చు. మొత్తానికి గ్యాప్ అంటూ వచ్చింది. నేనూ కొంత గ్యాప్ తీసుకోవలసి వచ్చింది. కరోనా కూడా కొంత గ్యాప్ ఇచ్చింది (నవ్వుతూ).
మీరు తెలంగాణ చేనేత ప్రచారంలో భాగస్వామి అయ్యారు.
‘మల్లేశం’ సినిమా ద్వారా చేనేత కార్మికుల కష్టాలను దగ్గరినుంచి చూశారు. నేతన్నలకు మన రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎలా ఉంది?
తెలంగాణలో చేనేతను బతికించుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే మనవారి పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రభుత్వమే ఆర్డర్లు ఇవ్వడం శుభపరిణామం. నిజమే, మల్లేశం సినిమా షూటింగ్ సమయంలో నేత కార్మికుల కష్టాలను దగ్గరినుంచి చూశాను. ఆ అనుభవం తర్వాతే చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా మారాను. నా ప్రతి ఈవెంట్లో నేత చీరలే కడుతున్నాను. చేనేతను ప్రపంచానికి సరికొత్తగా చూపేందుకు ప్రయత్నిస్తున్నా. మనం కొన్న ప్రతి చేనేత వస్త్రం ఒక కుటుంబాన్ని బతికిస్తుంది. మన
నేతన్నల వస్ర్తాలనే కొందాం.
మీ ఆరోగ్య రహస్యం? భోజన అలవాట్ల గురించి చెప్పండి.
రాగి సంకటి, జొన్నన్నం, చద్దన్నం, పచ్చి పులుసు, పచ్చిమిర్చి, ఉల్లిపాయతో ఉదయాన్ని మొదలుపెట్టడం అలవాటు. సూర్యునితోపాటు లేస్తాను. వ్యాయామం, యోగా చేస్తాను. గట్టిగా ఏం తినాలన్నా మధ్యాహ్నమే. రాత్రిళ్లు చాలా వరకు పానీయాలు, పండ్లరసాలతోనే గడిపేస్తాను. నా స్నేహితులైన డాక్టర్ సత్యలక్ష్మి, డాక్టర్ నాగలక్ష్మి గైడెన్స్‌లో ప్రకృతి జీవనానికి దగ్గరగా బతుకుతున్నా. రాత్రిళ్లు బిర్యానీ, వేపుళ్లు, మాంసాహారాలు తినడం ఎప్పుడో మానేశా.
శాటిలైట్ చానెళ్లు పుట్టిన దగ్గరినుంచీ యాంకరింగ్‌లో ఉన్నారు. ఎలా మొదలైందీ ప్రయాణం. ఈ తరం ప్రేక్షకుల కోసం..?
(ఆశ్చర్యంగా..) అంటే భూమి చుట్టూ శాటిలైట్లు తిరుగుతున్న దగ్గరినుంచా? (బిగ్గరగా నవ్వుతూ) దాదాపు 28 ఏండ్ల ప్రయాణం నాది. 1994లో దూరదర్శన్‌లో ‘విజేత’ అనే సింగిల్ ఎపిసోడ్‌తో నా కెరీర్ మొదలైంది. అక్కడే రెండేండ్లు చేశాను. వెంటనే ఈటీవీ మొదలైంది. అప్పుడే, నేను పలు రకాల యాసలు మాట్లాడతానని గుర్తించారు. జెమినీలోని ‘టాక్ ఆఫ్ ది టౌన్’లో కొందరు నా కోసమే నెల్లూరు, తెలంగాణ, శ్రీకాకుళం యాసల్లో స్క్రిప్ట్ రాశారు. ఎలక్ట్రానిక్ మీడియాలో నవీన, చేతన వంటి షోలు నెలల తరబడి చేశాను. వాటికి ప్రతిష్టాత్మక అవార్డులూ వచ్చాయి.
ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు?
దాదాపు 70 సినిమాల్లో. ‘ఎగిరే పావురమా’ నుంచి మొన్నటి ‘బంగార్రాజు’ వరకు గుర్తింపును, సంతృప్తిని ఇచ్చిన చిత్రాలు అనేకం. నాకు తొమ్మిది నంది అవార్డులు వచ్చాయి. ఆహా ఓటీటీలో ‘ది బేకర్ అండ్ ది బ్యూటీ’ చేశాను. మరో ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వెబ్‌సిరీస్ ఆఫర్లు
వస్తున్నాయి. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నా.
అనగనగా ఓ ఎద్దు. దానికొక పుండు. పుండులో పురుగులు, ఏంటీ కాకుల గోల?.. సోషల్ మీడియాలో ఈ కామెంట్ ఎవరి గురించి?
(కొంచెం ఆలోచిస్తూ…) దీని గురించి చెప్పాలని లేకపోయినా చెబుతున్నాను. ఈ మధ్య ప్రతి విషయంలోనూ మీడియా అతి ఎక్కువైంది. ప్రజల సమస్యలు పక్కనపెట్టి సెలబ్రిటీల జీవితాల్లోకి తొంగిచూస్తూ నానా యాగీ చేస్తున్నారు. ‘మా’ ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో పుండు ఉన్నదని, దానిలో పురుగులు ఉన్నాయని చెప్పకుండా.. కాకుల్లా మీదపడి ఆ పురుగులను ఏరుకొని తిన్నారు. అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టు చేశాను. నాది ‘మొండోడు రాజుకంటే గొప్పోడు’ టైప్ ఆలోచనా ధోరణి.
రవీంద్ర భారతిలో ప్రదర్శించిన ఓ నాటకంలో నటించారు. దర్శకత్వమూ చేసినట్లున్నారు?
నాకు రంగస్థలంపై పట్టుంది. తెలంగాణ ప్రభుత్వం మహిళా రంగస్థల దర్శకులను ప్రోత్సహిస్తుండటంతో ‘పురుష సూక్తం’ అనే నాటకాన్ని రాసి, డైరెక్ట్ చేశాను. అందులో నేను కూడా నటించాను. ‘ప్రాజెక్ట్ 22’ అనే కథనూ సిద్ధం చేశాను. నా గురువు దీక్షితులు మాస్టర్. ‘కన్యాశుల్కం’ నాటకంలో మధురవాణి పాత్ర పోషించాను. ‘మోహం’ అనే నాటకంలోనూ నటించాను.
కొన్నేండ్ల క్రితం ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు వాళ్లెలా ఉన్నారు?
పేర్లు చెప్పను కానీ ఇద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. అబ్బాయి క్రీడాకారుడు, అమ్మాయి కాలేజ్ టాపర్. వాళ్లకు సంబంధించి సర్వం చూసుకున్నా. వాళ్లు జీవితంలో స్థిరపడిన తర్వాత నాకు ఆత్మసంతృప్తి దొరికింది.
‘తెరవెనుక కథలు’ ఎలా చెప్పాలనుకుంటున్నారు?
నా షో ప్రారంభానికి ముందైనా చివర్లో అయినా ఒక చిన్నమాట చెప్పడం నా అలవాటు. ఈసారి ‘స్టార్ మా పరివార్-3’లో ఆర్టిస్టుల నిజ జీవితంలో జరిగిన ‘తెర వెనుక కథలు’ చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకు.. ఓ అమ్మాయి ఇప్పుడో స్టార్ ఆర్టిస్టు. ఆమె ఈ స్థాయికి రావడానికి తండ్రి త్యాగాలు.. మెహిందీ పెడుతూ వచ్చిన డబ్బును బిడ్డ కాస్ట్యూమ్స్ కోసం ఖర్చుచేసిన తల్లి కష్టాలు.. పట్టుదలతో ఎదిగిన ఆ ఆర్టిస్టు విజయాలు.. ఇలా అనేకం చెప్పాలనుకుంటున్నా. ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా ఈ షోను రక్తికట్టిస్తున్నా. ఎప్పటిలానే ఆదరిస్తారని ఆశిస్తున్నా.
మీ కూతురిని మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంచుతున్నారు. కారణం?
అలా అని ఏమీ లేదు. తన పేరు ధన్య. ప్రస్తుతం ఢిల్లీలో చదువుతున్నది. బయోటెక్‌లో రీసెర్చర్. తన ప్రపంచం వేరు. వయొలిన్, భరతనాట్యం నేర్చుకున్నది. శాస్త్రవేత్త అవ్వాలని లక్ష్యం. మా ఇంట్లో అంతా స్వతంత్రంగా ఉంటాం. నా కష్టాల్లో, సంతోషాల్లో అమ్మానాన్న, స్నేహితులు తోడున్నారు. నేను కూడా నా బిడ్డకు అలాంటి స్వేచ్ఛనే ఇస్తాను. తను సినిమాలవైపు రావాలనుకుంటే వద్దని చెప్పను.
– డప్పు రవి