డైపర్స్… ఒకప్పుడు విలాసం, ఆ తర్వాత సౌకర్యం, ఇప్పుడు అవసరం. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో వీటిని వాడుతూనే ఉంటారు. అయితే వీటిలో ఉండే కెమికల్స్ వల్ల రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి పిల్లలకు ఇన్ఫెక్షన్లు లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. రెండు అవి నేలలో కలవకపోవడం వల్ల పర్యావరణానికి కూడా హాని కలగవచ్చు. దీనికి ఓ పరిష్కారాన్ని తన జీవనోపాధిగా మార్చుకున్నారు సురభి బఫ్నా గుప్తా. ఆల్టర్ పేరుతో పర్యావరణహిత డైపర్లను ఉత్పత్తి చేస్తున్నారామె.
తన బ్రాండ్‌ను జనంలోకి తీసుకువెళ్లడం అంత తేలికగా జరగలేదు. అడుగడుగునా అనుమానాలు ఎదురయ్యాయి. ఒకవైపు తన కుటుంబాన్ని, మరోవైపు తన సంస్థను గమనించుకోవడం మరో సవాలు. ఇంతాచేసి తను నిలదొక్కుకునే సమయంలో కొవిడ్ ఉత్పాతం వచ్చింది. వీటన్నిటినీ దాటుకుని తన బ్రాండ్‌కి ఓ ఉనికి ఏర్పరుచుకోగలిగారు సురభి. ఇప్పటిదాకా 45 లక్షల డైపర్లను అమ్మిందీ సంస్థ. గతేడాది పదికోట్ల రూపాయల ఆదాయంతో మంచి వృద్ధినే సాధించింది. ఈ బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలన్నదే తన తర్వాతి లక్ష్యం అంటారు సురభి!