చపాతీలు లేదా పూరీలు చేసినప్పుడు వాటిని వడ్డించుకునేందుకు వీలుగా మూత ఉండే గిన్నెల్లో లేదా హాట్ బాక్సుల్లో పెడతాం. అయితే ఇప్పుడు పాతకాలం వస్తువుల్ని పోలిన వాటిని బాగా ఇష్టపడుతున్నారు జనాలు. రాగి బిందెలు, ఇత్తడి గిన్నెల్లాంటివి విరివిగా వాడేస్తున్నారు.
ఈ ట్రెండ్‌కు తగ్గట్టు చూడగానే ప్రత్యేకంగా కనిపించేలా కొత్తరకం చపాతీ డబ్బాలు మార్కెట్లోకి వస్తున్నాయి. వీటి పైభాగం పూర్తిగా చెక్కతోనే చేస్తారు. పైన లతలు, పూల నగిషీలు అందంగా చెక్కుతారు. లోపలి భాగం మాత్రం ఆహారం వెచ్చగా ఉంచేలా ఇన్సులేటెడ్ స్టీల్ వాడతారు. డైనింగ్ టేబుల్‌కు కొత్త అందాన్ని తీసుకొచ్చే ఈ హాట్‌బాక్సులు అతిథుల కళ్లను కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదు. ఇంకేం, ఇక చపాతీలనూ అందంగా వడ్డించేయొచ్చు!