మనిషి సంఘజీవి. అలాంటి మనిషి.. సమాజంలో ఎలా బతకాలి? అసలు ఓ సగటు మనిషి జీవితం ఎలా ఉండాలి? తోటివారితో కలిసి ఎలా జీవించాలి? ఒకరికి ఒకరు ఎలా అండగా నిలవాలి? అనే అంశాల్ని స్పృశిస్తూ సాగే చిత్రం.. టూరిస్ట్ ఫ్యామిలీ.
కథలోకి వెళ్తే.. శ్రీలంకకు చెందిన తమిళ దంపతులు.. ధర్మదాస్ (శశి కుమార్) – వాసంతి దాస్ (సిమ్రన్). వీరికి ఇద్దరు కొడుకులు. అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి.. స్థానికులకు కష్టాలు, సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో మెరుగైన భవిష్యత్ కోసం ధర్మదాస్ తన కుటుంబంతో భారత్‌కు అక్రమంగా వలస వస్తాడు. వాసంతి అన్న అయిన ప్రకాశ్ (యోగి బాబు) ప్రోత్సాహంతో.. చెన్నైలోని ఒక కాలనీలో అద్దె ఇంట్లో దిగుతాడు.
అయితే, ఆ కాలనీవాళ్లంతా ఉరుకులు – పరుగుల జీవితానికి అలవాటు పడిపోయిన వాళ్లే! రకరకాల సమస్యలతో జీవితం వెళ్లదీస్తూ, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి కాలనీ అయితేనే తన బావ కుటుంబం సురక్షితంగా ఉంటుందని ప్రకాశ్ భావిస్తాడు. అంతేకాదు.. చుట్టుపక్కల వారు ఎవరు పలకరించినా మాట్లాడవద్దని తనవాళ్లకు చెబుతాడు. అయితే.. ధర్మదాస్ కుటుంబ సభ్యులు అందుకు భిన్నంగా ప్రవర్తిస్తారు. ఆ కాలనీవాళ్లతో బాగా కలిసిపోతారు.
మరి.. ధర్మదాస్ కుటుంబం కారణంగా ఆ కాలనీలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? కాలనీవాసులు మర్చిపోతున్న మానవత్వాన్ని.. దాస్ ఎలా గుర్తు చేశాడు? బాంబ్ బ్లాస్ట్‌కు కారణమంటూ.. పోలీసులు దాస్ కుటుంబాన్ని ఎందుకు వెతుకుతుంటారు? నిజంగానే వీళ్లు బాంబ్ బ్లాస్ట్‌కు కారణమా? పోలీసులకు దొరికారా? చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!
కేవలం రూ.8 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తగా రూ.80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
తమిళ ఇండస్ట్రీకి ఓ మంచి కమ్‌బ్యాక్‌గా నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి, నాని, సూర్య లాంటి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నది. అలాంటి సినిమా.. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ చిత్రంలోని ప్రతీ సన్నివేశం మనసును హత్తుకుంటుంది. చూస్తున్నంతసేపూ గుండెను బరువెక్కిస్తుంది. నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, మనసుల్ని తడిమేస్తూ, గుండెల్ని తడిచేస్తూ సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా.. ‘అప్పుడే అయిపోయిందా!?’ అనే ఫీల్‌గుడ్ సినిమా ఇది. రొడ్డ కొట్టుడు సినిమాలతో మొహం వాచిపోయిన అభిమానులకు ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ కొత్త అనుభూతిని పంచుతుంది.