ఒక తెలుగు మహిళ విదేశాల్లో ఉద్యోగం చేయడమే గొప్పని అనుకుంటాం. కానీ, ఆమె 20 ఏండ్ల క్రితమే అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించారు. వందల మందికి ఉపాధి కల్పించారు. సమాజహితాన్ని, మహిళా సాధికారతను కూడా తన బాధ్యతగా తీసుకున్నారు. ‘టచ్ ఎ లైఫ్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి జీవితాలను మారుస్తున్నారు. హైదరాబాదీ ఆంత్రప్రెన్యూర్ వీణ గుండవెల్లి.. అమెరికాలోని టెక్నాలజీ ఇన్నొవేటర్స్ సంస్థ విడుదల చేసిన ‘టాప్ 50 సీయీవోస్’ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా ‘జిందగీ’తో ఆమె పంచుకున్న అభిప్రాయాలు..
నేను పుట్టిందీ పెరిగిందీ హైదరాబాద్‌లోనే. ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్ చదివాను. పెండ్లయ్యాక భర్తతో కలిసి అమెరికా వెళ్లిపోయా. అక్కడే మాస్టర్స్ పట్టా అందుకున్నాను. పదేండ్లపాటు పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేశాను. సిలికాన్ వ్యాలీలోనే ఉండటంతో అక్కడ కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలను నిశితంగా గమనించేదాన్ని. ఉద్యోగరీత్యా చాలామంది మేనేజ్మెంట్ నిపుణులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్లందర్నీ చూశాకే ఒక కంపెనీ పెట్టాలన్న ఆలోచన వచ్చింది. అలా, 2003లో ‘ఇమజియా’ అనే ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించాను. డిజిటల్ పేమెంట్స్ గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ, మేం ఆ రోజుల్లోనే డిజిటల్ ఫైనాన్స్ సెక్టార్లో పేమెంట్స్‌పై ప్రాజెక్ట్స్ చేశాం.
ఆటోమేషన్ మొదలు..
అప్పట్లో పెద్దపెద్ద కంపెనీలన్నీ చెల్లింపుల విషయంలో అకౌంటెంట్లు, బీపీవో కంపెనీలపై ఆధారపడేవి. ప్రత్యామ్నాయంగా మేం ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేశాం. మా ‘ఇమజియా’ ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. మొదట్లో కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి నిధులను స్వాగతించాం. అప్పట్లో టెక్ బిజినెస్‌లో మహిళా ఆంత్రప్రెన్యూర్లు, ముఖ్యంగా భారతీయులు చాలా తక్కువ. గత కొన్నేండ్లలో అనేక ఆవిష్కరణలు తీసుకొచ్చాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆటోమొబైల్ లో సెల్ఫ్ లెర్నింగ్ కార్ల లాగా, ఫైనాన్స్ విభాగంలో వాటంతట అవే చిట్టాపద్దులు రాసుకునే సాఫ్ట్వేర్లను తీసుకొచ్చాం. టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ మా సాఫ్ట్వేర్ వాడుతున్నాయి.
సేవలో ‘జియా’..
ఇటీవలే ‘జియా’ అనే డిజిటల్ అసిస్టెంట్‌ను తీసుకొచ్చాం. దానికి ఫైనాన్స్ పాఠాలన్నీ నేర్పించాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో జియాను కంపెనీలకు, కస్టమర్లకు ఉపయోగపడేలా డిజైన్ చేశాం. ఇది యాపిల్ సిరి, అమెజాన్ అలెక్సా లాంటిది. ఫైనాన్స్‌కు సంబంధించి కస్టమర్లతో అన్నిరకాల సంప్రదింపులూ చేస్తుంది. పేమెంట్స్ విషయంలో ప్రతి అప్డేట్ను ఆడియో, మెయిల్, మెసేజ్ ద్వారా అందిస్తుంది. వివిధ పేమెంట్ ఆప్షన్లు, స్టేట్మెంట్లు పంపిస్తుంది. ఒకవేళ కంపెనీ సర్వీస్‌తో కస్టమర్ ఇబ్బందిపడితే, వాళ్లిచ్చే ఫీడ్‌బ్యాక్‌ను పూర్తి స్థాయిలో విశ్లేషిస్తుంది.
టచ్ ఎ లైఫ్..
సమాజానికి అన్నిరకాలుగా మేలు జరగాలన్న ఉద్దేశంతో సిలికాన్ వ్యాలీ కేంద్రంగా 2012లో ‘టచ్ ఎ లైఫ్’ సంస్థను ప్రారంభించాం. మా సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నది. సృజనాత్మక సాంకేతికతను ఉపయోగించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాతలు, బాధితులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చాం. మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే.. రూపాయి కమీషన్ తీసుకోకుండానే దాతల సాయం నేరుగా బాధితులకు అందేలా చూస్తున్నాం. మా బృందంలో చేయితిరిగిన సాంకేతిక నిపుణులు, స్ఫూర్తిమంతమైన కథనాలు రాసే రచయితలు, అహర్నిశలు కష్టించే వలంటీర్లు వందలమంది ఉన్నారు. బాధితుల పక్షాన నిలబడగలిగే మనసున్న మనుషులు మాతో కలిసి పని చేస్తున్నారు. టచ్ ఎ లైఫ్ వేదికగా.. టీఏఎల్ గివింగ్, టీఏఎల్ రేడియో, టీఏఎల్ లీడర్స్ మొదలైన విభాగాల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాం. టచ్ ఎ లైఫ్ -గివింగ్లో దాతల సహకారంతో బాధితులకు ఆర్థిక సాయం అందిస్తాం, రేడియో మాధ్యమంలో శ్రోతలకు స్ఫూర్తిదాయక కథనాలు వినిపిస్తాం. దేశవిదేశాల్లో ఈ కార్యక్రమాలు నిర్విరామంగా సాగుతున్నాయి. టచ్ ఎ లైఫ్ ద్వారా పేద విద్యార్థులకు రకరకాల అంశాలపై ఉచిత వర్క్‌షాపులు నిర్వహిస్తుంటాం. ఇదంతా నేను, నా కుటుంబసభ్యులు, మా పరివారం సమాజం పట్ల బాధ్యతతో చేస్తున్నాం.
మహిళా సాధికారతే లక్ష్యం..
కంపెనీ, సేవా సంస్థ ఒక ఎత్తయితే.. మహిళా సాధికారత కోసం చేసే కృషి మరో ఎత్తు. ఒక మహిళగా నేను ఈ స్థాయికి రావడానికి చాలా శ్రమించాను. అప్పట్లో ఇంత నెట్వర్కింగ్ లేదు. మెంటర్షిప్ కూడా లేదు. అందుకే, స్టార్టప్స్‌తో ముందుకొస్తున్న మహిళలకు నేను మెంటర్‌గా ఉంటున్నాను. మా ఇమజియా నియామకాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. చాలామంది కీలక స్థానాల్లో ఉన్నారు. నిరుపేద ఆడపిల్లలకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఓ కార్యక్రమం ప్రారంభించాం. స్త్రీ నాయకత్వ స్థానానికి చేరుకోగలిగితే సమాజంలో లింగ వివక్షను దూరం చేయవచ్చు. మహిళా సాధికారత పూర్తిస్థాయిలో సాధ్యం అవుతుంది. జీవితాలను స్పృశించడం అంటే.. సమాజాన్నీ స్పృశించడమే. టచ్ ఎ లైఫ్ అంతిమ లక్ష్యమూ ఇదే.