సినీ నిర్మాతలకు ప్రతి శుక్రవారం పరీక్షే! కోట్ల పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందో, కాదో తేలేది ఆ రోజే! ఒక్క ఆట పూర్తయ్యేసరికి సినిమాలోఎంత సరుకుందో తేలిపోతుంది. ప్రేక్షకులు పెదవి విరిస్తే సినిమా కథ కంచికే. బాగుందని టాక్ వచ్చిందా.. నిర్మాతసేఫ్! ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోతే మంచి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోర్లాపడతాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. ప్రేక్షకుల మెప్పు పొందగలిగితే నిర్మాతకు కాసుల పంటే! ఈ ఏడాది అలా సైలెంట్‌గా విడుదలై ప్రేక్షకులకు వినోదాన్ని, నిర్మాతకు లక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించిన సినిమాలు ఇవే..
‘అంటే నేను ఒక్క నైట్‌లో ఒక్క సర్ప్రైజే హ్యాండిల్ చేయగల్గుత రాధిక. ఇట్ల మల్టిపుల్ అంటే నాతోనిగాదు. అసలే డెలికేట్ మైండ్ నాది’ డీజే టిల్లు సినిమాలో డైలాగ్ ఇది. సర్ప్రైజ్ హ్యాండిల్ చేయనంటూనే.. మల్టిపుల్ కలెక్షన్లు కొల్లగొట్టాడు టిల్లు. ఈ ఏడాది ఫిబ్రవరి 12న విడుదలైన ఈ చిత్రం మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. మొదటి ఆట పూర్తయ్యేసరికి టిల్లు డీజే హోరెత్తడం మొదలైంది. నాలుగు ఆటలు పూర్తయ్యేసరికి ‘డీజే టిల్లూ గాడు.. వీడి ైస్టెలే వేరు..’ అని ప్రేక్షకులకు అర్థమై పోయింది. రికార్డు కలెక్షన్లు వసూలయ్యాయి. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా టిల్లూగా సిద్ధు జొన్నలగడ్డ నటన సినిమాకు హైలైట్. వెరసి రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.27 కోట్లు వసూళ్లు చేసి ‘అట్లుంటది మనతోని ముచ్చట’ అనిపించుకుంది. ఓటీటీలోనూ అదే రేంజ్లో అలరించింది.
ఈ ఏడాది వేసవిలో చల్లని నవ్వుల జల్లు కురిపించిన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైంది. రెండు ఆటలు పూర్తయ్యేసరికి ఈ బాజాల్లేని పెండ్లి సందడి అందరికీ తెగ నచ్చేసింది. నిదానంగా సాగినా.. కామెడీ ప్రధానంగా పండటంతో థియేటర్లలో ‘..అర్జున కళ్యాణం’ చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. సీరియస్ అంశాన్ని సున్నితమైన హాస్యం మేళవించి తెరకెక్కించిన తీరు ఆకట్టుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో కథ అల్లుకోవడం కలిసొచ్చింది. విశ్వక్సేన్, రుక్సార్ ధిల్లాన్, రితికా నాయక్ పెర్ఫార్మెన్స్ విజయానికి దోహదం చేసింది. మొత్తంగా లిమిటెడ్ బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ ఏడాది విడుదలైన తక్కువ బడ్జెట్ చిత్రాల్లో భారీ విజయాన్ని సాధించిన సినిమా ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్, రష్మిక నటించిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఎవరూ లేని ఒక సైనికుడు, ఒక రాకుమారి ప్రేమ కథను అద్భుతమైన కావ్యంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హను రాఘవపూడి. సినిమా విషాదాంతమే అయినా.. ప్రేక్షకులు ఆదరించారు. హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు నిర్మలమైన ప్రేమకు ప్రతీకలుగా నిలిచాయి. దీనికితోడు పాటలు, నేపథ్య సంగీతం విజయానికి దోహదం చేశాయి. మొత్తంగా రూ. పదికోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సీతారామం’ ఏకంగా రూ.90 కోట్ల వరకు వసూలు చేసింది. ఓటీటీలోనూ ‘సీతారామం’ సూపర్‌హిట్ అయింది.
ఒక సీరియస్ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా సరదాగా చెప్పగలగడం సినిమాతోనే సాధ్యం. అలాంటి చిత్రమే ‘స్వాతిముత్యం’. బెల్లంకొండ సురేశ్ మరో తనయుడు గణేశ్ ఈ చిత్రంతోనే తెరంగేట్రం చేశాడు. విడుదలకు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. అయితే, రెండు రోజులు గడిచేసరికి ప్రేక్షకుల పాజిటివ్ టాక్ సినిమాను విజయపథంలో నడిపించింది. దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ కథను చూపించిన తీరు ప్రేక్షకులకు నచ్చింది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ‘స్వాతిముత్యం’ ఓటీటీలోనూ మంచి టాక్ సొంతం చేసుకుంది.
హీరో నిఖిల్ కెరీర్లో ‘కార్తికేయ’ ప్రత్యేక సినిమా. నమ్మకాలు, సైన్స్ నేపథ్యంలో 2014లో వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఎనిమిదేండ్ల తర్వాత వచ్చిన ‘కార్తికేయ-2’ అంచనాలకు మించి వసూళ్లు సాధించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘కార్తికేయ-2’ను యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు చందు మొండేటి సఫలమయ్యాడు. కృష్ణతత్తాన్ని ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది.