ఆ తల్లి పుట్టిన పాలకడలి.. నవరత్నాలకు నిలయం. ఆమె మెట్టిన వైకుంఠం నవనిధులకూ ఆలవాలం. ఆమె ఎక్కడ ఉంటే.. అక్కడ సిరిసంపదలు తులతూగుతాయి. సాధారణ మనుషులే కాదు.. దేవతలూ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పరితపిస్తారు. అటువంటి శ్రీదేవి వరాలిచ్చి అనుగ్రహించే పర్వం శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీదేవి మన ఇంట్లో కొలువు దీరాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే.. లక్ష్మీ తత్వం అవగతం అవుతుంది.
‘అగ్నిహోత్రా! బంగారంతో నిండివుండే లక్ష్మీదేవిని నాలోకి ఆవాహన చేయి’ అంటుంది శ్రీసూక్తం. ఆదిశంకరులు కనకధారా స్తోత్రం లక్ష్మీదేవిని మంగళదేవతగా అభివర్ణించింది. ఆమె కడగంటి చూపులే సకల వైభవాలనూ ప్రసాదిస్తాయని చెప్పింది. అయితే ఆమె మన నెలవులో కొలువుండాలంటే.. ధర్మవర్తన కలిగి ఉండాలి. తాను ఏ చోట స్థిరంగా ఉంటానో లక్ష్మీదేవి స్వయంగా ఇంద్రుడికి సెలవిచ్చింది. ఒకసారి గంగాతీరంలో అనుష్ఠానంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి నారదుడు వస్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా.. ఆకాశం నుంచి ఓ విమానం అక్కడ దిగుతుంది.
అందులోంచి సూర్యకాంతితో వెలుగొందుతున్న ఒక దేవకాంత బయటికి వస్తుంది. వచ్చి ఇంద్రుడికి నమస్కరిస్తుంది. ఆ దివ్యమంగళ మూర్తిని చూసిన ఇంద్రుడు ఆమెకు నమస్కరిస్తూ.. ‘అమ్మా! ఎవరు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవతా స్త్రీ.. ‘దేవేంద్రా! నేను పద్మం నుంచి పుట్టాను. శ్రీ లక్ష్మి నా పేరు. ఇదివరకు నేను స్వాహా, స్వధా, మతి, శ్రద్ధ, ధృతి, స్మృతి, మేధ అనే ఏడు గుణాలు కలిగి ఉన్న రాక్షసుల దగ్గర ఉండేదానిని. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చేశాను’ అన్నది.
‘వాళ్లను ఎందుకు వదిలిపెట్టావు తల్లి? నీ మెప్పు పొందాలంటే మేమేం చేయాలి?’ అని అడిగాడు ఇంద్రుడు.
‘మునుపు రాక్షసులు.. దానం, అధ్యయనం, అతిథి పూజ మొదలైన సద్గుణాలతో ఉండేవారు. కాబట్టి నేను వారి దగ్గర ఉన్నాను. కానీ, వారు గర్వంతో ఆ సద్గుణాలను విడిచిపెట్టారు. దాంతో నేను వారిని విడిచిపెట్టాను. నీవు సత్యధర్మ పరుడవై ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చాను. గురుభక్తి కలవారు, దేవతలను, పితృదేవతలను పూజించేవారి దగ్గరే నేనుంటాను. సత్యం పలికేవారు. దానశీలురు, పర ధనాన్ని, పర స్త్రీలను కోరని వారు అంటేనే నాకు ఇష్టం. పగలు నిద్రపోనివారు, వృద్ధులు, బలహీనులు, దీనులు, స్త్రీలయందు దయగలవారు, శుచి శుభ్రతలను పాటించేవారు, అతిథులు భుజించగా మిగిలినది తినేవారు అయివుంటే వారిని నేను మెచ్చుకుని వారి దగ్గర ఉంటాను.
ధర్మాన్ని వదిలి కామక్రోధాలతో, అతిగర్వంతో ఎవరికీ భిక్ష పెట్టకుండా, పరుష వాక్కులతో, క్రూర చరిత్రతో మెలిగే వారి వద్ద నేను క్షణం ఉండను. వారిని వదిలి వేగంగా వచ్చేస్తాను. బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నుతి, క్షమ, శాంతి అనే ఏడుగురు దేవతలు నాకు ఇష్టమైనవారు. వారు ఉన్నచోటికి ఎనిమిదో దానిగా నేను వెళతాను. రాక్షసులు వాటికి దూరమయ్యారు.. నేను వారిని వదిలిపెట్టాను’ అని పలుకుతుంది. ఈ కథను బట్టి లక్ష్మీదేవి సజ్జనులకు అండగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ఆర్భాటంగా పూజలు చేయడమే లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణం అవుతుందని భావించొద్దు. ఉన్నదాంట్లో నలుగురికి పంచుతూ, మంచిని పెంచే వారి లోగిలే అమ్మవారికి నిత్య నివాసం అవుతందని గ్రహించాలి.