రావణుడ్ని సంహరించి రాములోరు సీతమ్మను గెలుచుకున్నది విజయ దశమి నాడే! అర్జునుడు గాంఢీవం ధరించి.. కురు సేనలను తరిమికొట్టి కురుక్షేత్ర సంగ్రామ విజయానికి నాంది పలికిందీ విజయ దశమి రోజే! ఇదే విజయ దశమి సందర్భంగా ఈ ఆడబిడ్డ గొప్ప గెలుపును అందుకుంది. ఈ విజయ తీరానికి
ఆమె అలవోకగా చేరుకోలేదు! ఎదురైన ప్రతి ఆటంకాన్నీ దీక్షగా దాటింది. అవకాశం వచ్చిన ప్రతిసారీ పట్టుదలతో ప్రయత్నించింది. అవరోధాలను నిరోధించి, అపరాజితగా నిలిచి.. డీఎస్పీగా గెలిచిన అల్లెపు మౌనిక విజయగాథ ఇది..
ములుగుకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మల్లంపల్లి. మౌనిక అదే ఊళ్లో ఓ ప్రైవేట్ బడిలో పది దాకా చదివింది. ఆమె తండ్రి సమ్మయ్య పంక్చర్ షాప్ నడుపుకొంటాడు. తల్లి సరోజన సాధారణ గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. తాము ఎంత కష్టపడ్డా పిల్లలు బాగా చదువుకోవాలని వాళ్ల ఆరాటం. అందుకు తగ్గట్టే మౌనిక, ఆమె చెల్లెలు మానస చక్కగా చదివేవారు. టెన్త్ తర్వాత హనుమకొండలో ఇంటర్ ఎంపీసీలో చేరింది మౌనిక. 985 మార్కులతోని కాలేజ్ టాపర్‌గా నిలిచింది. ‘మా మేనమామలు సాఫ్ట్వేర్ ఫీల్డులో పని చేస్తున్నరు. వాళ్ల పనిగంటలు, టార్గెట్లు తెలుసు. జీతం ఎక్కువే! కానీ, సంతోషం తక్కువ. గవర్నమెంట్ జాబ్‌లో ఒత్తిడి ఉన్నా సంతృప్తి ఉంటుంది. నాకు గుర్తింపు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మార్గం అనుకున్నా! అదే చెబితే.. ఇంట్లోవాళ్లూ అందుకు ఒప్పుకొన్నారు’ అని నేడు తాను అందుకున్న విజయానికి భూమికను చెప్పుకొచ్చింది మౌనిక.
సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న మౌనిక.. డిగ్రీలో ఆర్ట్స్ తీసుకోవాలనుకుంది. ఆ విషయం తెలిసి.. ‘అందరూ ఇంజినీర్లు అయితుంటే.. ఆర్ట్స్ చదివి ఏం చేస్తవ్?’ అని ఎందరో వింతగా చూశారు. అర్జునుడు పక్షి కన్నునే గురి చూసినట్టు.. మౌనిక తన దృష్టంతా సివిల్స్‌పైనే సారించింది. మేనమామ సలహాతో డిగ్రీ కోసం హైదరాబాద్ బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో జాయిన్ అయ్యింది. నగరంలో చదువంటే.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అమ్మానాన్నకు భారమవుతానా అనుకుంది. బిడ్డ దిగులు చూసి.. భరోసా ఇచ్చారు తల్లిదండ్రులు. ‘మా రెక్కలు ఆడినంత కాలం.. నువ్వు ఎగురుతూనే ఉంటావు తల్లి’ అన్నారు. ఈ ఆటంకాన్నీ అధిగమించింది. హాస్టల్లో ఉంటూ.. కాలేజీకి వెళ్లేది మౌనిక. బిడ్డకు ఏనాడూ కష్టం రావొద్దని.. రెక్కలు ముక్కలు చేసుకునేవాడు సమ్మయ్య. ఎకరం కన్నా తక్కువ ఉన్న చెలకలో సరోజన చెమట చిందించేది. బిడ్డ చదువు ఆగిపోవద్దనే ఆరాటంతో పోరాటమే చేశారిద్దరూ! ‘బిడ్డల కోసం చానా కష్టపడేది. ఏదైనా ఇబ్బందైతే నా అన్నలు, తమ్ముళ్లు ఆదుకునేటోళ్లు. ఈ అక్కకే కాదు.. అక్క బిడ్డలకూ అండైనరు’ అంటుంది సరోజన. ఆ సాయం చేసిన తన అక్క, చెల్లె బిడ్డలే సరోజనకు ఆదర్శం. చక్కగ చదువుకోవడం వల్లనే కదా.. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అనుకునేది. తన బిడ్డ కూడా వాళ్లలా ఉన్నతంగా ఎదగాలని ఆశపడేది.
కాలేజీలో అయితే చేరింది.. కానీ, ఇక్కడ మౌనికకు పెద్ద అవరోధమే ఎదురైంది. చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివిన ఆమెకు.. ఇంగ్లిష్‌లో పాఠాలు బోధిస్తుంటే అర్థం కాక దుఃఖమొచ్చేది. క్లాస్‌మేట్స్‌తో కలవడానికీ మొహమాటపడేది. వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి.. తనూ అలా మాట్లాడాలనుకునేది. కానీ, ఇంగ్లిష్ అంతగా రాకపోవడంతో ఆత్మనూన్యతకు లోనయ్యేది. పాఠంలో ఏదైనా డౌట్ వచ్చినా.. వచ్చీరాని ఇంగ్లిష్తో క్లాస్‌లో అడగలేక, అర్థమైందన్నట్టుగా తలూపేది. ఓ ఆరు నెలలు పుస్తకాలతో కుస్తీ పట్టింది. అర్థం కాని విషయాలను హాస్టల్మేట్స్ని అడిగి తెలుసుకునేది. క్లాస్‌లో కాకుండా.. లెక్చరర్ ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్లి తన సందేహాన్ని వెలిబుచ్చేది. చదువుపై మౌనిక కనబరిచే శ్రద్ధ చూసి అధ్యాపకులూ ప్రోత్సహించేవారు. ‘మా ఎకనామిక్స్ లెక్చరర్ ఆలిస్ మేడం నాలో సబ్జెక్ట్ ఉందని ఎంతగానో ఎంకరేజ్ చేసేది. ఎన్నాళ్లని ఇంగ్లిష్‌కు భయపడటం అనుకున్నా. హాస్టల్ ఫ్రెండ్స్‌తో మాట్లాడి ఇంగ్లిష్ నేర్చుకున్నా. ఆ భాష మీద గ్రిప్ వచ్చాక… సబ్జెక్టులపై పట్టు సాధించగలిగాను. ఓ ఏడాదిపాటు కష్టపడ్డాను’ అని తన వెనుకుబాటుని గెలిచిన తీరును చెప్పుకొచ్చింది మౌనిక.
Monika
విజయవంతంగా డిగ్రీ పూర్తి చేసిన మౌనిక ఇంటికి వచ్చింది. అప్పుడే కరోనా లాక్డౌన్ మొదలైంది. సివిల్స్ కోసం కోచింగ్‌కు వెళ్లే పరిస్థితులు లేవు. ఇంట్లోనే ఉంటూ చదవడం మొదలుపెట్టింది. ఎదిగిన ఆడపిల్ల ఇంటి దగ్గర కనిపించగానే.. ‘పెండ్లి ఎప్పుడు చేస్తరు? ఇంకో బిడ్డ కూడా ఎదుగుతున్నది.. తొందరపడండి’ అన్న మాటలు మొదలయ్యాయి. వారికి సరోజన మంచి సమాధానం చెప్పేది. ‘నా బిడ్డలకు ఉద్యోగాలొచ్చినాంకనే పెండ్లి చేస్తా! అది సదువుకుంటాంది. మంచి ఉద్యోగం చేస్తనంటాంది. అది ఏదో సాధించాలని కలలు కంటాంది. నా బిడ్డ గెలిచిన తర్వాతనే పెండ్లి సంగతి’ అని అందరి నోళ్లూ మూయించింది. తండ్రి కూడా అదే మాటమీదున్నడు. తల్లిదండ్రుల అండదండలు మౌనికకు వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాయి. సివిల్స్ అనే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటే.. ముందుగా గ్రూప్స్ సాధించాలని నిశ్చయించుకుంది.
హైదరాబాద్‌లో కోచింగ్ సెంటర్లు మళ్లీ తెరిచేదాకా ఇంట్లోనే ప్రిపేర్ అయింది మౌనిక. 2022లో గ్రూప్స్ నోటిఫికేషన్ వచ్చింది. పట్టుదలతో చదివి గ్రూప్స్‌ని సాధించింది. ‘మేం చదువుకోలే. మీరైనా మా కలలు నెరవేర్చండి’ అన్న సరోజన మాటను ఇద్దరు బిడ్డలు నిజం చేశారు. మౌనిక గ్రూప్స్‌లో విజయం సాధించింది. డీఎస్పీగా ఎంపికైంది. ఎంబీఏ చదివిన చిన్న బిడ్డ ఐటీ కంపెనీలో కొలువు సాధించింది. ఇక్కడితో నా విజయం పరిపూర్ణం కాలేదంటున్నది మౌనిక. సివిల్స్ సాధించి.. కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యం అని నిండు విశ్వాసంతో చెబుతున్నది. ‘ఆడపిల్ల చదువుకి కావాల్సింది డబ్బు కాదు. పట్టుదల ముఖ్యం. అమ్మానాన్నల అండదండలతోనే ఈ విజయం సాధ్యమైంది. వాళ్ల కండ్లల్లో ఆనందం చూసి గర్వంగా ఫీలవుతున్నా’అంటున్న మౌనికను ఎన్నెన్నో ఆటంకాలు పలకరించాయి. అన్నిటినీ అధిగమించి ఆమె సాధించిన గెలుపు మరెందరో ఆడబిడ్డలకు విజయ దిశను చూపిస్తుంది అనడంలో సందేహం లేదు!
– నాగవర్ధన్ రాయల
– కోరె అరవింద్