‘అతి’ అనేక అనర్థాలు తెచ్చిపెడుతుంది. పిల్లల పెంపకం విషయంలోనూ ఈ సూత్రం వర్తిస్తుంది. బిడ్డలను అతిగారాబం చేయడం, మరీ జాగ్రత్తగా చూసుకోవడం కూడా మంచిదికాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. కష్టం తెలియకుండా పెరిగే పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ‘ఈగిల్ పేరెంటింగ్’కి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
పిల్లల్ని సుకుమారంగా పెంచడమే ‘ఈగిల్ పేరెంటింగ్’. ఏది అడిగినా కొనివ్వడం, తప్పు చేసినా వెనకేసుకు రావడం.. ఈ పెంపకంలోని లక్షణాలు. ఈ రకమైన తల్లిదండ్రుల సంరక్షణలో బాల్యం అద్భుతంగా సాగుతుంది. కానీ, చిన్నారుల భవిష్యత్ మాత్రం అగమ్యగోచరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్లో ఏవైనా సమస్యలు ఎదురైనా.. వారంతట వారు పరిష్కరించుకోలేరట. అన్నిటికీ ఇతరులపైనే ఆధారపడుతుంటారు. తాము తప్పుడు దారిలో వెళ్తున్నట్లు కూడా గుర్తించలేరని నిపుణులు చెబుతున్నారు. అలాకాకుండా.. పిల్లలకు బాల్యం నుంచే అన్ని పనులూ నేర్పించాలని సూచిస్తున్నారు. కష్టమైన పనులైనా.. పూర్తి చేసేలా ప్రోత్సహించాలి. అర్థంకాని విషయాలను విడమర్చి చెప్పాలి. పిల్లలు అడిగిన ప్రతిదాన్నీ అందివ్వడం ఉత్తమ పేరెంటింగ్ లక్షణం మాత్రం కాదని నిపుణులు అంటున్నారు. పిల్లలకు ఊరికే డబ్బులు ఇవ్వకూడదని చెబుతున్నారు. ఎందుకంటే.. ఉచితంగా వచ్చే డబ్బు సోమరితనాన్ని పెంచుతుందట. కాబట్టి, వారికి ఏదో ఒక పని అప్పగించి.. పూర్తి చేసిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని చెబుతున్నారు.
ఈ అలవాటు.. డబ్బులు సులభంగా రావనే విషయాన్ని నేర్పుతుంది. ఇక మరికొందరు పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. ఇలాంటివారి విషయంలో కాస్త కటువుగా వ్యవహరించాల్సిందే! అదే సమయంలో పెద్దరికం పేరుతో ప్రతి విషయానికీ వారిని బాధించడం కూడా మంచి పద్ధతికాదు. పిల్లలకు నచ్చచెప్పడం, వారికి నచ్చేలా చెప్పడం, నచ్చేవరకు చెప్పడం పెద్దలు అలవాటు చేసుకోవాలి.