ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్
నెట్‌ఫ్లిక్స్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్, చాందిని, శ్యామ హరిణి, బాల హసన్, సుభాష్ తదితరులు
దర్శకత్వం: రాజేశ్ ఎం.సెల్వ
ఆధునిక సాంకేతికత.. రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. మనిషికి ఎన్ని ప్రయోజనాలు అందిస్తున్నదో.. అంతకుమించి దుర్వినియోగం అవుతున్నది. ఏఐ ద్వారా ఫొటోల మార్ఫింగ్, అసభ్యకరమైన వీడియోలు రూపొందించడం.. చెప్పుకొంటూ పోతే నయా టెక్నాలజీ చేస్తున్న మాయలెన్నో! అరాచకాలెన్నో! తమ స్వార్థం కోసం సాంకేతికతను వాడుకుంటూ.. సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నవారు ఎందరో! ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన వెబ్‌సిరీస్ ‘ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్’. తెలుగులో మంచి నటిగా పేరు తెచ్చుకున్న శ్రద్ధా శ్రీనాథ్ కీలకపాత్రలో వచ్చిన ఈ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్నది.
గేమ్‌లోకి ఎంటరైతే.. కావ్య రాజారామ్ (శ్రద్ధా శ్రీనాథ్) చుట్టూ కథ తిరుగుతుంది. ఓ యానిమేషన్ సంస్థలో పనిచేసే కావ్యకు తెలివితోపాటు ధైర్యంకూడా ఎక్కువే! గేమ్ డెవలపర్‌గానూ అనేక విజయాలు సొంతం చేసుకుంటుంది. అదే సంస్థలో పనిచేస్తున్న అనూప్ (సంతోష్ ప్రతాప్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని కారణాల వల్ల.. తన అక్క కూతురు ‘తార’ బాధ్యత కూడా తనే చూసుకుంటూ ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కావ్యను.. కొందరు తరచూ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆమె డిజైన్ చేసిన ఓ గేమ్‌కు అవార్డు వస్తుంది.
అవార్డు తీసుకొన్న రోజు రాత్రి.. స్నేహితురాలిని కలవడానికి వెళ్లిన కావ్యపై కొందరు ముసుగు వ్యక్తులు దాడి చేస్తారు. తీవ్ర గాయాలపాలైన ఆమె దగ్గరి నుంచి పర్స్, ఫోన్, అవార్డును తీసుకొని వెళ్లిపోతారు. దీంతో ఇన్స్పెక్టర్ భానుమతి (చాందిని) రంగంలోకి దిగి.. కేసు విచారణ ప్రారంభిస్తుంది. మరోవైపు తన ఆఫీస్‌లోని టెక్ టీమ్ సాయంతో.. కావ్య కూడా ఆ ఆగంతకులను వెతుకుతూ ఉంటుంది. ఈలోగా సోషల్ మీడియా ద్వారా కూడా కావ్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఆ ముసుగు వ్యక్తులు ప్రయత్నిస్తారు. ఈక్రమంలో కావ్యకు-అనూప్‌కి మధ్య మనస్పర్ధలు వచ్చి.. ఇద్దరూ విడిపోయే పరిస్థితి వస్తుంది.
మరోవైపు తార.. దేవ్ అనే యువకుడి ట్రాప్‌లో పడుతుంది. అతను కూడా తారను బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో.. కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? తన సమస్యల్లోంచి తాను బయట పడటానికి, తారను కాపాడుకోవడానికి కావ్య ఏం చేస్తుంది? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ఇంతకూ కావ్యపై దాడి చేసింది ఎవరు? వారిని ఎలా కనిపెట్టారు? అన్నది మిగతా కథ.