స్నేహం.. అద్భుతమైనది, అపురూపమైనది, అమూల్యమైనది. అన్ని బంధాల్లోనూ గొప్పది! అలాంటి స్నేహం.. దాదాపు ప్రతిఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. అలాగని, జీవితంలో తారసపడే వాళ్లంతా స్నేహితులు కాలేరు. కొందరు.. తొలి పరిచయంతోనే ప్రాణస్నేహితులుగా మారిపోతారు. ఇంకొందరు.. పరిచయస్తులతోనూ మాట్లాడటానికి మొహమాటపడుతుంటారు. అయితే, ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం చిగురించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని సైకాలజిస్టులు అంటున్నారు. అవి కుదిరితేనే.. ఆ స్నేహబంధం కలకాలం నిలుస్తుందని చెబుతున్నారు.
ఎదుటివారితో నిజాయతీగా వ్యవహరించాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. వారు చెప్పే విషయాల పట్ల మీరు ఆసక్తి కనబరుస్తున్నారన్న నమ్మకం కుదిరితే మీపట్ల ఆకర్షితులవుతారు. అంతేకాదు వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నారన్న భావన కలగజేయడం ప్రధానం. అలాంటి వ్యక్తులను స్నేహితులుగా అంగీకరిస్తారు.
ఎవరిమీదైనా దయ చూపించినప్పుడు.. వారు మీ గురించి సానుకూలంగా స్పందిస్తారు. కాబట్టి, ఎదుటివారి భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. ఆపదలో, కష్టాల్లో ఉన్నవారిపట్ల దయతో ఉండాలి. ఆ ప్రవర్తన.. వారు మిమ్మల్ని ఇష్టపడేలా చేస్తుంది. సహానుభూతితో చేసే చిన్నచిన్న పనులు కూడా.. ఇతరులపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. వారిని మీ స్నేహితులుగా మార్చేస్తాయి.
ఒక చిరునవ్వు.. చుట్టూ ఉన్నవారిని మీకు చేరువ చేస్తుంది. వారి దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి, కొత్త వ్యక్తులైనా చూడగానే చిరుదరహాసంతో పలకరించండి. దాంతో, వాళ్లూ మీతో మాట్లాడటానికి ఆసక్తి చూపుతారు. మీ శరీర భాషకూడా.. ఎదుటివారిని మీకు దగ్గర చేస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారికి ఎక్కువమంది స్నేహితులు అవుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి కూడా.
సాధారణంగా ఒకే అభిరుచి కలిగిన వ్యక్తులు.. మంచి స్నేహితులుగా మారుతారు. పెంపుడు జంతువులు, ప్రకృతి, సినిమాలు, ఆటలు, పాటలు.. ఇలా ఏ విషయంలోనైనా ఇద్దరి అభిప్రాయాలు కలిస్తే.. వారి మధ్య స్నేహం బలపడుతుంది. ఆయా విషయాలపై కలిసి చర్చించుకోవడం వల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. ఎక్కువ సమయం కలిసి గడపడం వల్ల మంచి స్నేహితులయ్యే అవకాశం ఉంటుంది.