ఇప్పటి తరం పిల్లలకు కళ్లద్దాలు త్వరగా వచ్చేస్తున్నాయి. వయసు పెరిగే కొద్దీ అద్దాల వాడకం సహజమే. కానీ, చిన్నతనంలోనే మందపాటి అద్దాలు వాడాల్సి రావడం ఆలోచించాల్సిన విషయం. ఈ పరిస్థితికి ఎన్నో కారణాలు కనిపిస్తాయి.
స్క్రీన్లకు అతుక్కుపోవడం: ఇప్పటి పిల్లలు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీలకు తమ కళ్లు అప్పగించేస్తున్నారు. వీటి తెరల నుంచి వచ్చే నీలపు కాంతి కళ్లను దెబ్బతీస్తుంది. కంటిచూపును తగ్గిస్తుంది.
ఆటలు లేని జీవితం: ఆరు బయట ఆడుకోవడం వల్ల సహజ కాంతి అందేది. అది కళ్లను ఆరోగ్యంగా ఉంచేది. ఈ తరం పిల్లలేమో ఇంటి గోడలకే పరిమితమై పోతున్నారు. దీంతో కళ్ల కండరాలు బలహీనపడి పోతున్నాయి.
చెడు తిళ్లు: కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఎ, సి, ఇ విటమిన్లు తప్పనిసరి. ఆకుకూరలు, క్యారెట్, టమాటా, నారింజతోపాటు రకరకాల గింజలు కళ్లకు మంచి చేస్తాయి. ఇప్పటి పిల్లలు జంక్‌ఫుడ్ వెంట పరిగెడుతున్నారు. కంటిచూపు తగ్గడానికి పోషకాహారం తినకపోవడమూ ఓ కారణమే.
చదవడంలో ఇబ్బందులు: తక్కువ కాంతిలో, సరిగ్గా కూర్చోకుండా, పుస్తకాలను కళ్లకు బాగా దగ్గరగా పెట్టుకుని చదవడం లాంటి పొరపాట్లు కూడా కళ్ల ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపుతున్నాయి.