కాలం ఎంత మారినా.. నేటికీ అతివ గడప దాటాలంటే తల్లిదండ్రుల అనుమతి కావాలి. భర్త తోడుగా ఉంటేనే విహారయాత్ర! కుటుంబం వెంట ఉంటే తీర్థయాత్ర! అంతేకానీ, ఆమె తన స్నేహితులతో ఊరు దాటడమూ గగనమే! ఇలాంటి ఒంటరిగా విహారయాత్రలకు వెళ్లే ఆడవాళ్లు సాహస వనితల్లాగానే కనిపిస్తారు. కుటుంబ సమేతంగా పర్యాటక ప్రాంతాలు చుట్టిరావడం తప్ప.. ఫ్యామిలీ లేకుండా విహరించాలనే ఆలోచన కూడా చాలామంది మహిళలకు రాదు! కానీ, సుమిత్ర సేనాపతి రంగప్రవేశం తర్వాత సీన్ మారింది. మగువలంతా మనసైన పర్యటనలకు సై అంటున్నారు. ఆమె ప్రారంభించిన ‘వావ్ క్లబ్’తో గుంపులు గుంపులుగా అతివలంతా విహార యాత్రలకు వెళ్లొస్తున్నారు. సోలో పర్యటనలూ చేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రపంచాన్ని చూసి రావాలనే కోరికతో ఉన్న మహిళల కోరిక నెరవేరాలంటే చాలా ఆటంకాలు దాటాలి. ప్రయాణ మార్గంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. చదును చేసి రహదారి వేస్తే జర్నీ సాఫీగా సాగిపోతుంది. లోతైన నదులను వారధులు దాటిస్తాయి. అలాగే ట్రావెల్ చేయాలనుకునే మహిళలకూ ఎదురయ్యే అవరోధాలను వావ్ క్లబ్ దాటిస్తుంది. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయలేని పరిస్థితులు. భద్రతకు భరోసా లేకపోవడం, మగతోడు ఉంటేనే ట్రావెల్ అనే పాత మాటలు కట్టిపెట్టి, చేయిచేయి కలిపి సాహస యాత్రలు చేసొద్దామని వావ్ క్లబ్ కొత్త హామీ ఇస్తున్నది. 2005లో సుమిత్ర సేనాపతి ఈ క్లబ్‌ను ప్రారంభించారు. ఇరవై ఏళ్లుగా వేల సంఖ్యలో మహిళా బృందాలకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తున్నారు. సాధారణ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కూడా మహిళలు పర్యటనకు సిద్ధం కావొచ్చు. కానీ, ఆ బృందంలో ఉండే మగవాళ్లతో సమస్యలు రావొచ్చనే భయం. పదిమంది పురుషుల మధ్య నలుగురు మహిళలు ప్రయాణం అంటే ఆలోచించాల్సిందే! ఇక కుటుంబ సభ్యులు లేకుండా ప్రయాణం అంటే ఆగిపోవాల్సిందే! ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళలు వావ్ క్లబ్‌ని ఎంచుకుంటే ప్రపంచంలోని 52 అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు తేలిగ్గా వెళ్లి, సంతోషంగా చూసి రావొచ్చు.
ట్రావెలర్‌గా ఎన్నో దేశాలు చూసొచ్చిన సుమిత్ర సేనాపతికి ప్రపంచ పర్యాటకం కొట్టిన పిండి. ప్రపంచాన్ని చుట్టి రావడం కోసం 50 పర్యాటక ప్రదేశాలతో నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుని ఆమె వావ్ క్లబ్‌ని నిర్వహిస్తున్నారు. లడఖ్ ప్రాంతంలో ఎత్తయిన పర్వతాల మధ్య ఉన్న లేహ్‌లో విమానం దిగి ‘ఆడవాళ్లం ఎక్కడికైనా వెళ్లొస్తాం. ఏదైనా చూసొస్తాం’ అని చాటే ప్రయాణం 2005లో మొదలైంది. ఇక అప్పటినుంచి ఆమె ఆగింది లేదు. ఏడాది తర్వాత విదేశీ విహారాలు మొదలుపెట్టారు. ఈజిప్ట్‌లో దిగి నైలు నది నాగరికత వెంట నడిచివచ్చారు. మూడో ఏడాదిలో ఆనందాల రాజ్యం భూటాన్‌కు బయలుదేరారు. పులుల అభయారణ్యంలో విహరించారు. సుమిత్ర నాయకత్వంలో ఆసియా, ఆఫ్రికా, ఐరోపాతోపాటు మంచు ఖండం అంటార్కిటికానూ మహిళలు చుట్టొచ్చారు. మగవాళ్ల తోడు, సహకారం లేకుండా మహిళల నిర్వహణ, మహిళల మార్గదర్శనంలో సంతోషంగా విహరించడం విదేశీ పర్యాటకులకూ ఆశ్చర్యం కలిగిస్తున్నది.
సుమిత్రకు పర్యాటక ప్రాంతాల ఆనుపానులే కాదు చారిత్రక విశేషాలు, సాంస్కృతిక ప్రత్యేకతలన్నీ తెలుసు. ఆ విశేషాలను చెబుతూ ఆమె తనతో వచ్చిన మహిళలనూ నడిపిస్తున్నారు. ఇలా వావ్ క్లబ్ ద్వారా ట్రావెల్ చేసే మహిళలు జోధ్‌పూర్ సూఫీ ఫెస్టివల్‌ని ఎంజాయ్ చేసి, వియత్నాంలో విందారగించి, బోర్డెక్స్ (ఫ్రాన్స్)లో వైన్ సేవించి, అర్జెంటీనాలో టాంగో డ్యాన్స్ ఆడి.. భారత్‌కు వస్తారు. సీజన్ సీజన్‌కు పర్యాటక ప్రాంతాలు మారతాయి. సీజన్‌కి తగ్గ ఫెస్టివల్స్, ఆహారం, మరెన్నో విశేషాలు తెలుసుకుని వాటిని చేరుకునే తారీఖుల్లో ప్రయాణాలు చేస్తుంటారు. విహార పర్వంలో సాంస్కృతిక పర్యాటకం ఎక్కువమందిని ఆకట్టుకుంటుంది. ఈ మహిళల బృందం ఆయా దేశాల్లో మహిళల అలంకరణ, కట్టుబొట్టుని చూసిరాదు. వాళ్ల ఆహార్యాన్ని ధరించి వస్తుంది. పర్యటనకు వచ్చిన మహిళలు కుటుంబాలకు దూరంగా ఉన్నామనే భావన రాకుండా యాత్రికులంతా ఒక కుటుబంలా కలిసిపోయేలా ఎన్నో ప్రత్యేకమైన కార్యక్రమాలను వావ్ క్లబ్ నిర్వహిస్తుంది. మహిళలకు ఉండే అభిరుచులను బట్టి మహిళలే ఇవి నిర్వహించడం వల్ల వాళ్ల మధ్య స్నేహభావమూ పెరుగుతుంది.
వావ్ క్లబ్లో చేరడం వల్ల పర్యాటకం పట్ల ఆసక్తి ఉన్న మహిళలతో కలిసి ప్రపంచాన్ని చుట్టి రావడమే కాకుండా తోటి ట్రావెలర్స్‌తో స్నేహం ఏర్పడుతుంది. ఆ స్నేహంతో భవిష్యత్‌లోనూ మళ్లీ మళ్లీ వావ్ క్లబ్ ద్వారా కలుసుకుని మరికొన్ని రోజులు మరో ప్రాంతానికి వెళ్తుంటారు. తమ పర్యటన ఇంట్లో వాళ్లకు భారం కాకుండా మళ్లీ ట్రావెల్ చేయదలుచుకున్న మహిళలు ఈ వావ్ క్లబ్‌తో కొనసాగుతున్నారు. పర్యాటక బృందాలనే కాదు సోలో ట్రావెల్‌ని కూడా వావ్ క్లబ్ నిర్వహిస్తున్నది. ఒంటరిగా ప్రకృతి అందాలను చూసిరావాలనుకునే మహిళల భద్రతకు కావాల్సిన ఏర్పాట్లు, జాగ్రత్తలన్నీ సంస్థే చూసుకుంటుంది. టూర్ డిజైన్, ట్రావెల్, హాస్పిటాలిటీ అంతా వాళ్ల బాధ్యతే! మొత్తంగా మహిళల్లో నిద్రాణమై ఉన్న విహార వాంఛను తట్టి లేపడమే కాదు, మది కోరిన మధుసీమలను చుట్టివచ్చేలా వావ్ క్లబ్ చేస్తున్నది కదూ!