ముత్యం అనగానే పాలకన్నా తెలుపు తలపులోకి వస్తుంది. కానీ, గులాబీ, ఊదా, నీలంతోపాటు రకరకాల రంగుల్లోనూ ముత్యాలు ఉంటాయని తెలుసా? ఈ పంచవన్నెల ముత్యాలను సహజ పద్ధతుల్లో తయారుచేసి ట్రెండ్‌కి తగినట్టు ఆభరణాలు తయారు చేస్తున్నారు డిజైనర్లు. మ్యాచింగ్‌కి అనుకూలంగా ఎలాంటి దుస్తులపై అయినా చక్కగా అమరిపోతూ ఆధునిక అతివలను ఆకట్టుకుంటున్న కలర్‌ఫుల్ ముత్యాల ఆభరణాల విశేషాలే ఇవి..
కడలి సమర్పించిన కానుకల్లో ముత్యం ఒకటి. ఆభరణాలకు అతికినట్టు సరిపోయే ముత్యాన్ని అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. రంగు, ఆకారం, మెరుపు ఆధారంగా వీటిలో వివిధ రకాలు ఉంటాయి. సముద్రంలో దొరికే స్వాతిముత్యాలకు తెగ ఆదరణ ఉంటుందన్న సంగతి తెలిసిందే! సాగు చేసిన ముత్యాలు ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి. కృత్రిమంగా తయారు చేసినవీ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కాస్త అందుబాటులో ఉంటుంది. సాధారణంగా ముత్యాలు తెలుపు, నలుపు, గులాబీ, లేత నీలం, బంగారు రంగు, ఆకుపచ్చ తదితర రంగుల్లో ఉంటాయి. తహితీ ముత్యాలు నలుపు రంగులో ఉంటాయి. సముద్ర ముత్యాలు బంగారం, తెల్లని రంగులో మెరుస్తాయి. ఈ రంగులు ముత్యాల ఆకర్షణను మరింత పెంచుతాయి.
ముత్యాలతో తయారుచేసే ఆభరణాలు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటాయి. హారాలు, చెవి రింగులు, బ్రేస్లెట్లు, కంఠాభరణాలు, పట్టీలు, ఉంగరాలు, పెండెంట్లు.. ఏ నగల్లో అయినా ముత్యాలు మురిపెంగా మెరిసిపోతాయి. రెగ్యులర్‌గా కాకుండా రంగురంగుల ముత్యాలు పొదిగిన నగలకు గిరాకీ ఎక్కువే! బంగారం, వెండి, ప్లాటినమ్ లాంటి లోహాలతో తయారుచేసిన ముత్యాల ఆభరణాలు కొనడానికి ఈతరం యువతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గొలుసులు, బ్రేస్లెట్లు, చెవిపోగులు, పెండెంట్లు అన్నిటా ముత్యాలు పొదిగిన వాటిని రోజువారీ అలంకరణ కోసం కొనుగోలు చేస్తున్నారు. డిజైనర్ సెట్లను స్పెషల్ ఈవెంట్ల కోసం కొంటున్నారు. ముత్యాలు సున్నితమైనవి, వాటిని జాగ్రత్తగా భద్రపరచాలి. రసాయనాలు, పెర్ఫ్యూమ్లు, సౌందర్య సాధనాలు ముత్యాల ఉపరితలంపై ప్రభావం చూపుతాయి. అందుకే వాటిని మృదువైన వస్త్రంతో శుభ్రపరచాలి. ముత్యాల నగలను ఇతర ఆభరణాలతో కాకుండా వేరుగా భద్రపరచడం మంచిది.