మంచి ఆహారం తీసుకున్న రోజు మనసూ ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇష్టమైన పదార్థం ఆరగించినప్పుడు తృప్తిగా ఉంటుంది. ఇలా ఏదో ఒక రోజని కాకుండా, కస్టమైజ్డ్ డైట్ ఫాలో అయితే జీవనశైలితోపాటు మానసిక ప్రవర్తనలోనూ మార్పులు ఉంటాయని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది. సాధారణంగా ఒక్కొక్కరికి ఒక్కో విధమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. దానికి తగ్గట్టే వారి డైట్ ఉంటుంది.
సర్వేలో మితాహారం, వ్యాయామం చేసే వివిధ వయసుల వారి జీవనశైలిని పరిశీలించారు పరిశోధకులు. ముఖ్యంగా యువత మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ఆహార నియమాలు పాటించడం, కెఫిన్ తక్కువగా తీసుకోవడంతోపాటు ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉంటున్నారని తేలింది. మహిళల విషయానికి వస్తే మానసిక ఆరోగ్యం కోసం తమ డైట్లో పండ్లకు ఎక్కువగా చోటిస్తున్నారని వెల్లడైంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించే యువకులు పాలు, మాంసానికి డైట్లో చోటిస్తున్నారట. తీసుకున్న ఆహారానికి తగ్గట్టుగా కసరత్తులు చేస్తున్నారట.
అయితే, నాణ్యతలేని ఆహారం తీసుకొని పోషక లోపాలను అనుభవించే వాళ్లు అధికస్థాయిలో మానసిక క్షోభకు గురవుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. కెఫిన్ అధిక వినియోగంతో చాలామంది మానసిక ఆందోళనకు గురవుతున్నారని సర్వేలో తేలింది. ఎక్కువ మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల అది శరీరంలో చాలా సమయం వరకు ఉండి, నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తుందట. ఇది ఒత్తిడికి దారితీస్తుందని, చివరికి ఆందోళన కలిగిస్తుందని సర్వేకారులు చెబుతున్నారు.