నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన
తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున!
(భగవద్గీత 8-27)
‘పార్థా! జీవిత గమనంలో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి పునర్జన్మను పొందేది, మరొకటి జన్మరహితమైనది. భారతీయ సనాతన ధర్మంలో మరణించిన వ్యక్తిని కాల్చి బూడిదచేయడం.. ఆ బూడిదను నదులలో కలపడం ఆచారంగా ఉన్నది. అగ్ని, ప్రవహించే నీరు రెండు మార్గాలకు ప్రతీకలుగా తీసుకోవచ్చు. ఒకటి ముక్తికి మరొకటి పునర్జన్మకు ప్రతీకలుగా భావించవచ్చు. ఈ రెండు మార్గాల తత్త్వాలను తెలుసుకున్న యోగి వాటి భేదాలను అవగాహన చేసుకొని అవసరమైన దానిని పొందేందుకు ప్రయత్నిస్తాడే కాని మోహితుడు కాడు. ఇష్టమైన దానికోసం అవసరమైన దానిని వదిలివేయడం మోహంగా చెబుతారు. మోహం తానేమిటో మరిచే మార్గంలో నడుపుతుంది. తానేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ మార్గంలో నడవడమే ఆత్మజ్ఞానంగా చెప్పుకోవాలి. మోహాన్ని వదిలితే సమత్వబుద్ధి కలుగుతుంది. కాబట్టి అన్ని కాలాల్లోనూ సమత్వబుద్ధితో యోగయుక్తుడవు కావాలి’ అంటున్నాడు కృష్ణపరమాత్మ.
నిస్సహాయత మానవత్వాన్ని కబళించివేయగా.. పరిపూర్ణంగా జీవించాల్సిన మనిషి.. గుడ్డిగా బతికేస్తున్నాడు. జీవితమంటే సుఖాలవెంట పరుగులు తీయడం కాదు.. దుఃఖాల కారణాలను ఛేదించుకుంటూ, గందరగోళాన్ని సృష్టించే సమస్యలను పరిష్కరించుకుంటూ, నిర్భయంగా, నిర్మోహంగా ముందుకు సాగడమే. ఆధ్యాత్మిక తత్త్వ సాధన.. మానసిక కాలుష్యాన్ని తొలగించుకొని ముందుకు సాగే ధైర్యాన్ని ఇవ్వాలే కానీ, పలాయనవాదంలోనికి నెట్టివేయకూడదు. మెదడు ‘బీటా‘ స్థాయులలో ఉన్నప్పుడు స్థిరతను కోల్పోయి వ్యగ్రతను ఆశ్రయిస్తుంది. దానిని ‘డెల్టా’ స్థాయికి తీసుకువస్తే.. సరైన నిర్ణయాలు తీసుకొని స్థిరతను సాధిస్తుంది. డెల్టా స్థాయిలో మెదడు సుషుప్త్యావస్థలో ఉంటూ.. నాలుగుకన్నా తక్కువ తరంగాలను వెలువరిస్తే, బీటా స్థాయిలో 13 నుంచి 30 వరకు తరంగాలను వెలువరిస్తుంది.
‘శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతః’ అంటుంది కఠోపనిషత్తు. మనిషికి అవసరమైనది.. శ్రేయస్సు. ఇది సుగతిని ఇస్తుంది. ఇష్టమైనది.. ప్రేయస్సు. ఇది ప్రగతి నిస్తుంది. ఒకదాన్ని ఆదరిస్తే మరొకదానిని వదిలేసుకోవాలి. ఎవరైతే ఈ రెండిటి తత్త్వాలను అవగాహన చేసుకుంటారో వారు సమత్వమైన బుద్ధితో రెండిటినీ సమన్వయం చేసుకుంటూ రసమయమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు.. ఆదర్శప్రాయం చేసుకుంటారు. భౌతిక ఆధ్యాత్మిక జీవన యాత్రలో మార్పు అనివార్యమైనది. మార్పులేని చోట అభ్యుదయం లేదు. భగవద్గీత కూడా కృష్ణ పక్ష, శుక్ల పక్షాల గురించి చెబుతుంది. అంతరంగంలోని ప్రజ్ఞను జాగృతం చేసుకొని, ఆత్మతత్త్వాన్ని అవగాహన చేసుకొని, కష్ట సుఖాలను సమంగా తీసుకోవడం శుక్ల పక్షంగానూ దానికి విరుద్ధమైన దానిని కృష్ణ పక్షంగానూ తెలియజేస్తుంది. నిజానికి ఈ రెండు మార్గాలూ మానవులు తప్పనిసరిగా అనుభవించవలసినవే. ఒకదాని నుంచి తప్పుకొని మరొకదానిని మాత్రమే ఆశ్రయిస్తాననడం అసాధ్యమైన ప్రక్రియ.జగత్తనే పక్షికి సుఖదుఃఖాలనే రెండు రెక్కలు ఉంటేనే
ఎగరగలుగుతుంది.
ఎప్పుడైతే మానవుడు తాను చేసే పనిని ఉపాసనగా భావించి.. భగవదర్పితంగా, ప్రక్రియ ఆధారితంగా నిర్వహిస్తాడో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. చేసేపనిలో ఫలితానికి అతుక్కుపోకుండా కర్మలను ఆచరించడం వల్ల ఒత్తిడి తగ్గి సామర్థ్యం, నైపుణ్యం పెరుగుతుంది. అయితే చేసేపనిలో శ్రద్ధ, ఆసక్తి, నిష్ఠ అవసరం. హృదయ పూర్వకంగా పూర్తిగా శక్తిసామర్థ్యాలను వినియోగించి ప్రక్రియ ఆధారంగా కర్తవ్యాన్ని నిర్వహించినా ఫలితం రాకపోతే చింతించవలసిన అవసరంలేదు. లభించిన ప్రతిఫలాన్ని కృతజ్ఞతా భావనతో స్వీకరించడం వల్ల హృదయం తేలికవుతుంది. నిస్వార్థమైన సేవాభావన ఒత్తిడిలేని పని విధానానికి మార్గం చూపుతుంది. ఎప్పుడైతే మన పనుల వల్ల ఇతరులు లాభపడతారో వారి ఆశీస్సులు అయాచితంగానే మనకు లభిస్తాయి. అది ఎప్పుడైనా మనకు ఉపకరించేదే. ముఖ్యంగా అహంకార మమకారాదులకు దూరంగా కర్మఫలాన్ని త్యాగం చేయడం వల్ల ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరుకునే ప్రయాణం సులువవుతుంది.
-పాలకుర్తి రామమూర్తి