జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: కాజోల్, జిషూ సేన్‌గుప్తా, అలీ ఖాన్, సుభ్రాసేత్, షీబా చద్ధా తదితరులు, దర్శకత్వం: ఉమేశ్ బిస్త్
ఇటీవలి కాలంలో ‘లీగల్ డ్రామాలు’ విరివిగా తెరకెక్కుతున్నాయి. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగానే కనెక్ట్ అవుతున్నాయి. ఎక్కువగా నేరాలు, మూఢ నమ్మకాల నేపథ్యంలోనే ఈ తరహా సినిమాలు వచ్చాయి. అందుకు భిన్నంగా కోర్ట్వార్కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను టచ్ చేస్తూ.. ‘ది ట్రయల్’ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించాడు దర్శకుడు సుప్రాన్ వర్మ. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ప్రధాన పాత్రలో.. 2023లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ హిట్ టాక్ తెచ్చుకున్నది.
దానికి కొనసాగింపుగా ‘ది ట్రయల్’ సీజన్-2 ఇటీవలే జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. కథ విషయానికి వస్తే.. రాజీవ్ మేనన్ (జిషుసేన్ గుప్తా)-నయోనిక (కాజోల్) భార్యాభర్తలు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రాజీవ్.. అవినీతి, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటాడు. జైలుకు వెళ్తాడు. ఆ సమయంలో పిల్లలకు అండగా నిలుస్తుంది నయోనిక. కుటుంబ పరువును నిలబెట్టడానికి మళ్లీ నల్లకోటు వేసుకొని.. కోర్టులోకి అడుగుపెడుతుంది. రాజీవ్ ఆ కేసు నుంచి బయట పడినప్పటికీ, భార్యతో దూరం మాత్రం పెరుగుతుంది. ఇటు నయోనిక.. రాజీవ్‌కి దూరంగా ఉండలేక, పిల్లల కోసం అతనికి దగ్గర కాలేక మనోవేదనకు గురవుతుంటుంది. తమ వల్ల పిల్లల మనసు దెబ్బతినకుండా చూస్తుంటుంది.
ఇక.. రాజీవ్ రాజకీయాలలో నిలదొక్కుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. ఈ నేపథ్యంలోనే నయోనిక దగ్గరికి ఓ డ్రగ్స్ కేసు వస్తుంది. అదే సమయంలో రాజకీయంగా రాజీవ్‌కి సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ రెండు సమస్యలూ.. నయోనికకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అసలు.. ఆ డ్రగ్స్ కేసుకు-నయోనిక కుటుంబానికి ఏం సంబంధం? తన ఫ్యామిలీ పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడానికి ప్రయత్నించిన వారిని ఆమె ఎలా ఎదుర్కొన్నది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నది? అనేది మిగతా కథ!