కేశ సౌందర్యం, కేశ సంరక్షణ అంటే.. జుట్టు గురించి మాత్రమే అనుకుంటారు. పంటకు నేల ఎంత ప్రధానమో జుట్టుకు మాడు అంత ముఖ్యం. ఎక్కువ రోజులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం తీరని నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. జుట్టు మరమ్మతులో మాడుదే కీలకపాత్ర. జీవనశైలి లోపాలు, పర్యావరణ ప్రభావాలు మాడును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మాడు ఎంత ఆరోగ్యంగా ఉంటే కేశాలూ అంత బలంగా ఉంటాయి.
చిన్నవయసులోనే జుట్టు తెల్లబడకుండా అడ్డుకునేశక్తి మాడుకు ఉంది. తగిన సంరక్షణతోనే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలం. అసలే సున్నితమైన భాగం కాబట్టి, రసాయన షాంపూలను సాధ్యమైనంత వరకూ పరిహరించాలి. తలస్నానం చేస్తున్నప్పుడు.. షాంపూ నురగను అడ్డదిడ్డంగా రుద్దుకోకూడదు. సుతారంగా మర్దన చేసుకోవాలి. డాక్టరు సలహాతో ఒమేగా 3 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్, ప్రొబయాటిక్స్ అధికంగా ఉన్న ఆహారం తినాలి. దురద, దద్దుర్లు, చుండ్రు, తీవ్రమైన జిడ్డు, జుట్టు రాలిపోవడం మొదలైన సమస్యలు మాడు అనారోగ్యానికి సంకేతాలు. వెంటనే, డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.