నాన్‌స్టిక్ కడాయి, పాన్లు లేని వంటిల్లు లేదిప్పుడు. ఈ పాత్రల అతి వినియోగం అనారోగ్యానికి హేతువని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రతి రోజూ నాన్‌స్టిక్ పాన్‌లో వండుకున్న ఆహారం తినడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్ర రుగ్మతలు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. వీటికి బదులు స్టీల్ పాన్, ఇనుప కడాయిలో వండుకోవడం శ్రేయస్కరమన్నది నిపుణుల మాట. అయితే స్టీలు, ఐరన్ పాత్రల్లో వండినప్పుడు అడుగు పేరుకుపోతుంటుంది. వాటిని శుభ్రం చేయడం కష్టంగా భావించి.. నాన్‌స్టిక్ పాన్‌లో వండుకొని రోగాలు కొని తెచ్చుకుంటామా చెప్పండి! ఈ సమస్యకు పరిష్కారం… స్టీలు పాత్రలు వాడినప్పుడు అడుగు మాడు పేరుకుపోకుండా చూసుకోవడమే! అందుకోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
స్టీలు కడాయి, పాన్ వాడినప్పుడు అది సరిగ్గా వేడెక్కాలి. పాత్ర మరీ వేడెక్కితే.. నూనెలో పదార్థాలు వేయగానే వాటిలోని తేమ బయటికి వచ్చి ఆహారం అడుగున అంటుకోవడం మొదలవుతుంది. అయితే, కడాయి సరైన మోతాదులో వేడెక్కిందని నిర్ధారించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. పాన్ బాగా వేడెక్కినప్పుడు దానిపై కొన్ని చుక్కల నీళ్లు చిలకరించాలి. పెద్ద శబ్దంతో నీళ్లు ఆవిరైతే పాన్ అతిగా వేడెక్కిందని గుర్తుంచుకోండి. నీరు బుడగలుగా మసిలినట్లయితే.. మోతాదు వేడిగా ఉందని అంచనాకు రావొచ్చు. అంటే సరైన వేడితో ఉందన్నమాట. ఈ ఉష్ణోగ్రత వద్ద నూనె వేసి.. వంట కొనసాగించాలి.
స్టీల్ పాన్ వేడిని వెన్న ద్వారా కూడా నిర్ణయించొచ్చు. పాన్ వేడెక్కిన తర్వాత దానిపై వెన్న వేయాలి. వెన్న కొద్దిగా కరిగి.. మిగిలినది నెమ్మదిగా జారిపోతే… పాన్ ఉష్ణోగ్రత కచ్చితంగా ఉన్నట్టు నిర్ధారించుకోవాలి.
స్టీలు, ఉక్కుపాత్రల అడుగున పదార్థాలు అంటుకుపోవద్దంటే.. పాత్ర వేడెక్కిన తర్వాత మొదట కొద్దిగా నూనె వేసి.. శుభ్రమైన వస్త్రంతో తుడవాలి. తర్వాత కొన్ని నీళ్లు చిలకరించాలి. అప్పుడు నీటి బిందువులు ముత్యాల్లా గుండ్రంగా మారి పాత్రంతా వ్యాపిస్తాయి. ఆ సమయంలో కొద్దిగా నూనె వేసుకుని.. పాకయాగం ప్రారంభిస్తే, పదార్థం అడుగున అంటుకోకుండా ఉంటుంది.