మనసుకేదో బాధ. మందు వేసుకుంటే తగ్గదు. మర్చిపోదామంటే కుదరదు. నోరు పెగల్చలేని పరిస్థితి. బాధ చెప్పుకోలేని దుస్థితి. కన్నీరు మాత్రం కట్టలు తెంచుకుంటుంది. వెల్లువలా పొంగి, చెక్కిలిని దాటి గుండెలను తాకుతుంది. ఆ తడిలో ఏదో సాంత్వన దాగుంది. నిమిషాలు గడిచేకొద్దీ మనసు
ఊరడిల్లుతుంది. సరేలే ఊరుకో… అని తనకు తానే నెమ్మదిస్తుంది. హా… తెలిసింది! బాధకు మందు దొరికింది. కన్నీరే కష్టానికి మందు! ఇదే సూత్రాన్ని చెబుతుంది జపనీస్ వెల్నెస్ టెక్నిక్ ‘రూయికాట్సు’. ఒత్తిడి, వేదనలో ఉన్నవారికి హాయిగా ఏడ్చే అవకాశాన్ని కల్పించే వర్క్‌షాప్‌లు దీని
ఆధారంగా జరుగుతున్నాయా దేశంలో. గుండెనిండా ఏడ్చేస్తే మనసు తేలికపడి మళ్లీ మామూలు మనిషవ్వడమే ఇందులోని ప్రత్యేకత!
నిప్పు వెంటే నీరునూ, బాధ వెంటే కన్నీరునూ దేవుడే సృష్టించి ఉంటాడు. అందుకే కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దుఃఖం పొంగుకొస్తుంది. అయితే ఏడ్వడానికి మనమేమైనా చిన్నపిల్లలమా! ఎవరైనా చూస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఏమిటా ఏడుపు… అని మనకే అనిపిస్తుంది. కానీ, గుండె బండలా మారడం కంటే ద్రవించి కరిగిపోవడమే మేలని చెబుతుంది రూయికాట్సు సూత్రం. అందుకోసం పరిస్థితుల్ని కల్పించి మరీ ఈ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తున్నారు. సాధారణంగానే పనిభారం ఎక్కువగా ఉండే జపాన్ ప్రజలు వీటికి మొగ్గు చూపుతున్నారు. ఈ ట్రెండు 2013 నుంచి జపాన్‌లో నడుస్తున్నది. దీనికోసమే ప్రత్యేకంగా ట్రైనర్లూ ఉన్నారు. అయితే కన్నీరు ఎలా పెట్టుకున్నామన్నదీ ముఖ్యమే అంటుంది రూయికాట్సు. ఇంతకీ రూయికాట్సు అంటే కన్నీరును తెప్పించే ప్రక్రియ అని అర్థం. నలుగురూ కూర్చుని మాట్లాడుకోవడం కాదు, నలుగురూ కూర్చుని ఏడ్వండి… ఏం ఫర్వాలేదు అని చెబుతుంది ఇది.
ఎంత ఒత్తిడి, ఆందోళన, భయం, బాధ ఉన్నాసరే… ఓ చోటుకు వెళ్లి పదిమందిలో కూర్చున్నప్పుడు గబుక్కున ఏడ్వమంటే ఏడుపు రాదు. అవతలి వాళ్లు ఏమనుకుంటారో, జాలి పడతారా, చిత్రంగా చూస్తారా, పరువు సంగతేంటి… ఇలా ఎన్నో భయాలు మన మెదళ్లలో నాటుకుపోయి ఉంటాయి. అందుకే రూయికాట్సులో కళ్లనీళ్లు పెట్టుకునే సందర్భాలను కల్పిస్తారు. అంటే హృదయాన్ని కదిలించే చిత్రం చూపించడమో, కన్నీరు పెట్టించే కవితలు, ఉత్తరాలు చదివించడమో, మనసును కదిలించే కథలు వినిపించడమో ఉంటుంది ఇక్కడ. వీటివల్ల మనకు తెలియకుండానే దుఃఖం తన్నుకొస్తుంది. అలాంటప్పుడే మన బాధా గుర్తొస్తుంది. అన్నీ కలుపుకొని బోరున ఏడ్వమని చెబుతుంది ఈ థెరపీ.
ఏదో ఊరికే ఓ కన్నీటి చుక్క కంటి నుంచి రావడం కాదు, గట్టిగా ఏడిస్తేనే మంచిదంటుంది. ‘ఓరి బాబూ మషాయో… నా జీవితాన్ని బుగ్గిపాలు చేశావు కదరా… నీ జిమ్మడి పోను’ అన్న లెవెల్లో పెద్ద పెద్దగా వెక్కిళ్లు పెట్టి ఏడిస్తే మరింత ఊరట పొందుతారని చెబుతుంది. వినేందుకు చిత్రంగా ఉన్నా నిజంగా ఇది మేలు చేస్తుందని అంటున్నారు వెళ్లిన వాళ్లు, శిక్షకులు. మసక వెలుతురు, మంద్రమైన సంగీతం, చేతిలో కర్చీఫ్ దీనికి నేపథ్యం అన్నమాట. ఇక, బాలానాం రోదనం బలం అన్నట్టు ఏడుపు పెద్దలకూ బలమే. శోకం ఇమ్యూనిటీని పెంచుతుంది అని చెబుతున్నారు. అయితే ఇలా చటుక్కున వచ్చే ఏడుపు మాత్రమే మనసును సేదతీరుస్తుంది. దగ్గరి వారిని పోగొట్టుకున్న దుఃఖం మాత్రం సుదీర్ఘకాలం ఇబ్బంది పెడుతుంది.
ఆ కన్నీరును, ఈ కన్నీరుతో పోల్చకూడదు అంటారు వీళ్లు. హిడేఫుమి యోషిదా అనే ప్రముఖ రూయికాట్సు శిక్షకుడైతే కొన్ని వేలమందికి ఇలాంటి ఎమోషనల్ రిలీజ్ థెరపీ ఇచ్చారట. అంటే అంతమందితో ఆయన కళ్లనీళ్లు పెట్టించారన్నమాట! ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరి కష్టం వారిది. ఒక్కరుగా కూర్చుని చింతించడం మరింత ఒత్తిడిని పెంచుతుంది. అందుకే మనమెవరో తెలియని చోట, మనలాంటి వాళ్లే నలుగురున్న చోట, మనసును తేలికపరచుకునే ఈ ఏర్పాటు చాలామందినే ఆకట్టుకోవడం వింతేం కాదు కదూ!
కన్నీరు కార్చడం వల్ల మానసిక, శారీరక మార్పులెన్నో జరుగుతాయని పరిశోధనలూ చెబుతున్నాయి. జపాన్‌లోని తోహో యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం ఏడ్వడం వల్ల ఆందోళన (యాంగ్జయిటీ) తగ్గుముఖం పట్టి, గుండె కొట్టుకునే వేగం నెమ్మదిస్తుంది. తద్వారా ప్రశాంతమైన నిద్ర పడుతుందట. ఉద్వేగం వల్ల వచ్చే కన్నీళ్లలో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది.
ఒత్తిడికి కారణమయ్యే ఇది బయటికి పోవడం అన్నది శరీరానికి మేలు చేసే విషయం. ఈ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్లు నొప్పులను తగ్గించి, మూడ్‌ను స్థిమిత పరుస్తాయి. తాను తరచూ జలుబు బారిన పడేదాన్ని అని, రూయికాట్సు పద్ధతి ద్వారా ఇలా వారానికి ఒకసారి ఏడ్వడం వల్ల ఆ బాధ నుంచి బయట పడ్డాననీ ఈ తరహా వర్క్‌షాప్‌కి వెళ్లిన ఓ మహిళ సోషల్ మీడియాలో పంచుకున్నారు.