మా అన్నయ్య పాపకు తొమ్మిది నెలలు. వారం రోజుల క్రితం బాగా దగ్గు, జలుబు, జ్వరం వచ్చింది. మూడు రోజుల తర్వాత ఎగపోత మొదలైంది. న్యుమోనియా అనుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. వైద్యులు న్యుమోనియా కాదన్నారు. అయిదు రోజులు హాస్పిటల్లో ఉన్నాం. ఆర్ఎస్వీ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా అవుతున్నదని చెప్పారు. అసలు ఆర్ఎస్వీ అంటే ఏమిటి? దానిని టీకాలతో నివారించలేమా?
రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘బ్రాంకియోలైటిస్’ అంటారు. ఇది ఏడాదిలోపు చిన్న పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పెద్దలకూ రావొచ్చు. కానీ, సాధారణ జలుబులాగా ఉంటుంది. వయసు ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒకటి, రెండేళ్ల పిల్లల్లో దాదాపు పది రోజులు ఇన్ఫెక్షన్ ఉంటుంది. మూడు నాలుగు రోజుల తర్వాత దీని లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగు ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వస్తుంది. ఆక్సిజన్ లెవెల్ తగ్గుతుంది. మూడు నాలుగు రోజులు అలా ఉండి తగ్గుతుంది. ఇంకో మూడు, నాలుగు రోజుల తర్వాత మళ్లీ తీవ్రమవుతుంది. మూడు, నాలుగు రోజులకు తగ్గుతుంది. ఇలా వస్తూ, పోతూ కొన్ని రోజులకు దానంతట అదే తగ్గిపోతుంది. కాకపోతే ఆ లక్షణాల తీవ్రత వల్ల బిడ్డ ఆయాసపడుతుంది. పాలు తాగలేకపోవచ్చు. ఈ రెండు సమస్యలు ఉంటే పిల్లల్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. ఆక్సిజన్ తగ్గిపోయినా, విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్లో ఉంచే వైద్యం చేయాలి. ఈ సీజన్లో ఆర్ఎస్వీ ప్రభావం ఎక్కువగా ఉంది. దీనికి వ్యాక్సిన్ ఉంది.
కానీ, యాక్టివ్ వ్యాక్సిన్ లేదు. పాసివ్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉంది. అది చాలా ఖరీదైనది. ఆర్ఎస్వీ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ ఇబ్బందిపడి హాస్పిటల్లో చేర్చాల్సిన అవసరం పడ్డ పిల్లలు, శ్వాస సమస్య ఎక్కువై వెంటిలేటర్ మీద ఉంచిన పిల్లలకు, నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు, గుండె జబ్బులున్న పిల్లలకు, సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు ఆర్ఎస్వీ ఇమ్యూనోగ్లోబ్యులిన్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. సీజన్ మొదలుకాగానే వైద్యుడి సూచన మేరకు నెలవారీగా ఇంజెక్షన్ చేయించుకోవచ్చు. లేదా మూడు, నాలుగు నెలల సీజన్‌కి పనిచేసే వ్యాక్సిన్ ఒకేసారి తీసుకోవచ్చు. ఇది అందరికీ అవసరం లేదు. ఎక్కువ రిస్క్ ఉన్న పిల్లలకు ఇవ్వాలి. వర్షాకాలం, చలికాలంలో ఇన్ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లడం సరికాదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. స్కూల్‌కి వెళ్లే పిల్లలు ఉంటే, వారి నుంచి ఇంట్లో ఉన్న నెలల శిశువుకు సోకే ప్రమాదం ఉంటుంది. కానీ, స్కూల్ ఏజ్ పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉండదని గమనించాలి. ఆర్ఎస్వీ ఇన్ఫెక్షన్ ఉంటే మంచి ఆహారం ఇవ్వాలి.