ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఆ ఉల్లి నాణ్యతను బట్టే… మేలు ఉంటుందని గ్రహించాలి. ఉల్లి ధర మితిమీరి పెరిగినప్పుడు.. చౌకగా దొరికే నాసిరకం సరుకు కొనుగోలు చేస్తుంటారు కొందరు. నల్లని చారలతో, మచ్చలతో ఉండే ఈ ఉల్లి మేలు చేయకపోగా.. కీడు తలపెడతాయి. ఉల్లిలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఈ రెండూ శరీరానికి అవసరమైనవే.
లివర్ ఆరోగ్యానికి ఇవి దోహదం చేస్తాయి. ఉల్లిలో ఐరన్, మరికొన్ని పోషకాలుంటాయి. అయితే, ఉల్లి మీద నల్లని చారలు, మచ్చలు ఉన్నాయంటే.. ఆ ఉల్లిగడ్డలపై ఫంగస్ చేరిందని అర్థం చేసుకోవాలి. ఉల్లి సాగు, రవాణా, నిల్వ చేసేప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకున్నా, తేమ ఉండే చోట ఉంచినా ఇలా ఫంగస్ బారినపడతాయి.
ఇలా నల్లగా ఉన్న ఉల్లిగడ్డల్లో ఎక్కువగా ఆస్పర్జిల్లస్ నైగర్ అనే ఫంగస్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంగస్ నుంచి కొన్ని రకాల విషపు సమ్మేళనాలు విడుదలవుతాయి. ఇవి కాలేయంలోని కణాలకు నష్టం కలుగజేస్తాయి. అందువల్ల శరీరంలోని విషపదార్థాలను తొలగించే లివర్ పనితీరు తగ్గిపోతుంది. ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. ఉల్లిగడ్డలు కొనేటప్పుడు, వాటిని కోసేటప్పుడు అవి ఎలా ఉన్నాయో పరిశీలించడం చాలా అవసరం. లేకపోతే.. కట్ చేసేటప్పుడే కాదు.. తిన్న తర్వాత కూడా కన్నీళ్లు తప్పవు.