HomeZindagiTharun Bhascker Opens Up About The Habits That Bring Out The Be
నేను..నాలా ఉంటాను అంటున్నా తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ తీర్మానాల చిట్టా
తరుణ్ భాస్కర్.. యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలే ఎక్కువగా తీస్తుంటాడు. పెద్ద పెద్ద సందేశాల జోలికి అస్సలు వెళ్లడు. నిరాడంబరంగా ఓ మూలన కూర్చుని తన పని తాను చేసుకుపోయే రకం. నూతన సంవత్సరంలోనూ అదే జీవనశైలిని కొనసాగిస్తానని అంటున్నాడు.
‘రాయడం మాచెడ్డ మంచి అలవాటు. రోజూ ఏదో ఒకటి రాయకపోతే నిద్రపట్టదు. నేను ఎక్కడున్నా.. ఏం చేస్తున్నా.. రాతకోసం కొంత సమయం కేటాయించుకుంటా. రోజూ బ్రష్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, రాయడమూ అంతే ముఖ్యం. రైటింగ్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఇప్పటివరకూ రాయడం ఆపింది లేదు. ఆపను కూడా. ఈ మంచి అలవాటును ఈ ఏడాది కూడా కొనసాగిస్తా.
మనం ఏం తింటున్నామో, ఎందుకు తింటున్నామో? తెలుసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా కష్టం. నేను కొంతకాలంగా ‘ఫుడ్లాగ్’ నిర్వహిస్తున్నా. ఏం తింటున్నానో? ఎంత తింటున్నానో? నోట్ చేసుకుంటున్నా. దీనివల్ల నా ఆహారంలో భారీగానే మార్పులు జరిగాయి. టైమ్ ప్రకారం తినడం మొదలుపెట్టాను. వృథా తగ్గింది. ఈ పద్ధతిని కొత్త ఏడాదిలోనూ పాటిస్తా.
కాలంతోపాటు పరుగెత్తాలంటే మనం ఫిట్‌గా ఉండాలి. అందుకే రోజూ జిమ్ చేస్తా. బరువు పెరగకుండా.. తగ్గకుండా జాగ్రత్త పడుతున్నా. దీనివల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగం. పని ఒత్తిళ్ల నుంచి, ఇతర ఆందోళనల నుంచి త్వరగా రిఫ్రెష్ కావడానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. జిమ్‌ను కూడా వదిలిపెట్టేది లేదు. కొత్త ఏడాది కూడా ఇదే నా ఫార్ములా.
వివిధ ప్రదేశాలకు వెళ్లినప్పుడు కొన్ని కోట్స్ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆలోచింపజేస్తాయి. అలాంటిది ఒకటి.. ‘మీకు వచ్చే ఆదాయంలో 20 శాతం మాత్రమే ఖర్చు చేయాలి. మీరు చేసే పొదుపులో 50 శాతం మాత్రమే పెట్టుబడికి ఉపయోగించాలి’ అనేది. ఈ వాక్యం ఎక్కడో చదివాను. అప్పటినుంచి ఈ సూత్రాన్ని ఆచరించడం మొదలు పెట్టాను. దీనివల్ల వృథా ఖర్చులు తగ్గాయి. కొంచెం ఎక్కువగా పొదుపు చేయడం ప్రారంభించా. అందులో కొంతమొత్తాన్నే పెట్టుబడిగా పెడుతున్నా. దీనిని జీవితాంతం పాటించడం కొంత కష్టమే అయినా, నా వంతు ప్రయత్నంలో లోపం ఉండదు.
నాకు ఒంటరిగా ఉండటం చాలా ఇష్టం. ఏకాంతంలోనే సృజనాత్మక ఆలోచనలు వస్తాయి. ఇప్పటికీ ఇదే మాట నమ్ముతున్నా. అందుకే పార్టీల్లో తక్కువగా కనిపిస్తాను. కొన్నిరకాల సమావేశాలకు వెళ్లడం కూడా ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నాకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి. నాతో కలిసి తిరిగేవారికి వాటిని కనిపించనివ్వను. సోషల్ మీటింగ్స్‌కు ఇటీవలే నో చెప్పడం నేర్చుకున్నా. భవిష్యత్తులోనూ ఈ నిర్ణయంలో మార్పు ఉండదు.
రెండు వైపులా పదునుదేలిన కత్తి లాంటిది.. సోషల్ మీడియా. అక్కడ ఒక్కోసారి అనారోగ్యకరమైన పోటీ ఉంటుంది. దేనినీ సమర్థించలేని పరిస్థితులు ఏర్పడతాయి. నిత్యం సోషల్ మీడియాలో మునిగి తేలుతూ ఉంటే, మనం దానికి బానిసలయ్యే ప్రమాదం ఉంది. అందుకే డిజిటల్ డిటాక్స్‌కు వెళ్తాను. పని మొదలైతే ఫోన్ పక్కనపెట్టేస్తాను. అనవసర చాటింగ్‌లతో కాలక్షేపం చెయ్యను. వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లను తక్కువగా ఉపయోగిస్తుంటా. స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులకు ఏదైనా చెప్పాల్సి వస్తే మెసేజ్ చేయను. నేరుగా కాల్ చేస్తాను. అదీ పరిమితంగానే మాట్లాడతాను. ఆ సరిహద్దు రేఖను ఈ ఏడాది కూడా దాటను.