ఆండ్రాయిడ్ ఫోన్లు, వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లు లేని రోజుల్లో కాగితాలపై రాసిన ప్రేమ లేఖలు.. ఇంట్లో అమ్మానాన్నలు పెట్టే చీవాట్లు.. వీటన్నిటికీ వెల కట్టలేం. 70sలో పుట్టినవాళ్లకు ఎన్టీయార్ బెల్‌బాటమ్ ప్యాంట్లు.. 80sలో పుట్టినవాళ్లకు చిరంజీవి ‘గ్యాంగ్ లీడర్’ షర్ట్స్.. నిజంగా ఆ క్రేజే వేరు. వాటన్నిటినీ తెరపై
చూపించడం ఇప్పుడు ఓ ట్రెండ్‌గా మారింది. వాటికి ‘పీరియాడిక్ ఫిల్మ్స్’ అనే పేరు పెట్టేసి నిర్మాణంలో
ఉండగానే సినిమాలపై అంచనాలు పెంచేస్తున్నారు మూవీ మేకర్స్. ఆ రోజుల్నీ, ఆ ఫ్యాషన్స్నీ, ఆ పోకడల్నీ తెరపై చూపిస్తూ క్రేజ్ పెంచుతున్నారు.
అనుభవాల చక్ర భ్రమణంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది సమాజం. ఈ రోజున ప్యాషన్ అనిపించింది రేపు రొటీన్‌గా మారిపోతుంది. అప్పుడెప్పుడో రొటీన్ అనుకున్నది కొన్నాళ్లకు ప్యాషన్ ట్రెండ్‌గా రాజ్యమేలుతుంది. పెరిగిన సాంకేతికత వల్ల మారిన జీవన శైలికీ, గడిచిపోయిన స్మృతులకూ మధ్య మనిషి ఆలోచనలు వెనక్కీ ముందుకీ గుంజుతూ ఉంటాయి. మొత్తంగా భవిష్యత్తుకు బరువెక్కువ.. గడిచిన కాలానికి విలువెక్కువ. అందుకే ఆలోచనలతో అప్పుడప్పుడు వెనక్కెళ్లి వస్తుంటాడు మనిషి.
రేడియోలో తెల్లారుజామున సూర్యాష్టకం.. మధ్యాహ్నం జనరంజని.. ఇండ్లపైన టీవీ యాంటిన్నాలు.. వాటిపై వాలే కాకులు.. తద్వారా టీవీల్లో ఎదురయ్యే అంతరాయాలు.. రామానందసాగర్ రామాయణం.. రాత్రి వేళ చిత్రలహరి.. ఇవన్నీ ఓ నోస్టాలజిక్ మూమెంట్స్. పాత సినిమాల్లో ఎన్టీయార్, ఏయన్నార్, సావిత్రి, అంజలీదేవి, ఎస్వీ రంగారావు లాంటి వాళ్లను చూసి, ‘మా ముందు తరాల వాళ్లు ఇలా ఉండేవారా?’ అంటూ ముచ్చటపడి సినిమాలు చూసే ప్రేక్షకులు కూడా నేడు లేకపోలేదు.
నిజానికి సినీ స్వర్ణయుగంలోనే ఈ పీరియాడిక్ ట్రెండ్ మొదలైంది. అయితే మొదట్లో ఈ తరహా సినిమాలు బ్రిటిష్ కాలం, పెత్తందారీ వ్యవస్థల నేపథ్యంలో సాగేవి. ఇప్పట్లో అయితే.. బ్రిటిష్, నిజాం కాలాలతోపాటు, 70s, 80s, 90s రోజుల్ని కూడా చూపించేస్తున్నారు మేకర్స్. ఎన్టీయార్ ‘అగ్గిరాముడు’(1954), ‘విమల’ (1960) ‘మనుషులంతా ఒక్కటే’ (1976) ‘సర్దార్ పాపారాయుడు’ (1980) ఇవన్నీ పీరియాడిక్ డ్రామాలే. వీటిలో మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపారాయుడు సినిమాలు కొంతభాగం సమకాలీనంగా కూడా సాగుతాయి. వీటిలో ‘విమల’ మినహా మిగతా మూడూ పెద్ద హిట్స్.
చిరంజీవి నటించిన ‘శివుడు శివుడు శివుడు’ (1983), ‘వేట’ (1986) సినిమాలు కూడా పీరియాడిక్ డ్రామాలే. బ్రిటిష్, పెత్తందారీ వ్యవస్థ నేపథ్యాలతో ఈ సినిమాలు సాగుతాయి. రెండిటికీ కోదండరామిరెడ్డే దర్శకుడు. రెండు సినిమాలు ఆడలేదు. అయితే… ‘వేట’ సినిమాలో అండమాన్ జైలు ఎపిసోడ్‌ని ఇప్పటికీ చాలామంది మరిచిపోలేదు. బ్రిటిష్ కాలంలో అండమాన్ జైల్ ఎంత భయంకరంగా ఉండేదో.. అందులోని ఖైదీల జీవితం ఎంత దుర్భరంగా గడిచేదో ఆ సినిమాలో కళ్లకు కట్టారు. ఈ కారణంగా ఇప్పటికీ ఈ సినిమాను ఇష్టపడేవాళ్లున్నారు.
ఇక పీరియాడిక్ టచ్ ఉన్న మరో మరిచిపోలేని సినిమా శంకర్ ‘భారతీయుడు’. లంచగొండితనం, దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్వాత్రంత్య్ర సమరం నేపథ్యంలో సాగే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు హృదయం లాంటిది. ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే సినిమా ఇది. వెంకటేశ్, నాగార్జునలు కూడా సుభాష్‌చంద్రబోస్ (2005), ‘రాజన్న’(2011) అంటూ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలు చేశారు. రెండూ డిజాస్టర్లుగా నిలిచాయి.
పోనుపోనూ దర్శకుల అభిరుచి మారింది. దేశభక్తి, ప్రాంతీయవాదం తదితర అంశాలను పక్కన పెట్టేశారు. గత కాలాన్నీ, జ్ఞాపకాలకూ, భావోద్వేగాలకూ పెద్దపీట వేసే కథలపై దృష్టిపెట్టారు. దానికి నాంది పలికింది
‘మహానటి’ సినిమానే. ఇది బయోపిక్ అయినా.. దర్శకుడు నాగ్ అశ్విన్ నేటి తరాన్ని సైతం ఓ 70ఏండ్ల వెనక్కి తీసుకెళ్లి, మన పూర్వికుల్ని మనకు పరిచయం చేశారు. వారి కదలికలు, కట్టుబాట్లు, వేషభాషలు ఇవన్నీ ఇప్పుడున్న యువతకు కూడా విపరీతంగా నచ్చేశాయి.
వందకోట్ల విజయాన్ని అందుకోవడంతోపాటు పలు జాతీయ అవార్డులు కూడా వరించాయి. ఆ వెంటనే.. ఆ ప్రేరణతోనే ఎన్టీయార్ ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ సినిమాలొచ్చాయి. అవి పెద్దగా ఆడకపోయినా.. ఈ ట్రెండ్‌ను ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఆ కోవలో వచ్చిన మరో అందమైన పీరియాడిక్ లవ్ డ్రామా ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఆడియన్స్‌కి తెగ నచ్చేయడమే కాక వందకోట్ల విజయాన్ని అందుకున్నది. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నది.
రామ్‌చరణ్ ‘రంగస్థలం’, అల్లు అర్జన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ, నాని శ్యామ్‌సింగరాయ్, దసరా.. ఇవన్నీ గతకాలానికి మెచ్చు తునకలే. త్వరలో రాబోతున్న ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాను కూడా పీరియాడిక్ బ్యాక్డ్రాప్తోనే తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ సైన్యంలో పనిచేసే సైనికుడి పాత్రలో కనిపిస్తారు. ఈ కథలో అంతర్లీనంగా అద్భుతమైన ప్రేమకథ కూడా ఉంటుందని తెలుస్తున్నది. అలాగే రాహుల్ సాంకృత్యాయ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న ‘రణబాలి’ సినిమా కూడా పీరియాడిక్ డ్రామానే. మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదారి’, వరుణ్‌తేజ్ ‘కంచె’, ‘మట్కా’ సినిమాలు, రానా, సాయిపల్లవి నటించిన ‘విరాటపర్వం’, శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రీసెంట్గా వచ్చిన ‘ఛాంపియన్’ ఇలా చెప్పుకొంటూపోతే పీరియాడిక్ సినిమాలు చాలానే ఉన్నాయి.
అయితే.. ఇలాంటి సినిమాలను తెరకెక్కించడం నిజంగా కత్తిమీద సామే అని చెప్పాలి. బ్రిటిష్ కాలం నాటి కథలైతే ఫర్వలేదు కానీ.. 50 ఏండ్ల లోపు కథలైతేనే చిక్కులొచ్చి పడతాయ్. ఆనాటి కాలంపై, నాటి జీవన విధానంపై, ఫ్యాషన్లపై, అప్పట్లో విడుదలైన సినిమాలపై, వాడిన వస్తువులపై అటు దర్శకుడికీ, ఇటు కళా దర్శకుడికీ పూర్తి అవగాహన ఉండాలి. లేకపోతే ప్రేక్షకుల నుంచి విమర్శలెదురయ్యే ప్రమాదం ఉంది. 90sలో జరిగే కథ అని చెబుతూ బేబీ కాలర్ షర్ట్స్, బెల్‌బాటమ్ ప్యాంట్స్ చూపించడం, ‘2022’ అంటూ.. ఇంకు పెన్నుల్ని చూపించడం.. 80s లో జరిగే కథ అని చెబుతూ చిరంజీవి ‘ఘరానామొగుడు’ పోస్టర్లు చూపించడం.. ఇలాంటి తప్పులు ఈ మధ్య చాలా సినిమాల్లో కనిపిస్తున్నాయి.
మొత్తంగా చెప్పొచ్చేదేంటంటే.. కథల్లో భావోద్వేగాలు బావుండాలి. తెరపై కనిపించే దృశ్యం కాలానికి తగ్గట్టుగా ఉండాలి. టైం మెషిన్ ఎక్కి గతంలో విహరించిన మధురానుభూతికి ఆడియన్స్ లోనవ్వాలి.. అప్పుడే
అది అసలైన పీరియాడిక్ సినిమా అనిపించుకుంటుంది. ముందు ముందు ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలని ఆశిద్దాం.
-బుర్రా నరసింహ