ముంబైకర్లు తెగ ఇష్టపడి తినేవాటిలో వడపావ్ ఒకటి. అందులోనూ ముంబయిలోని ‘అశోక వడపావ్’ దగ్గర తినాలని ఉవ్విళ్లూరుతారు. అంత బాగుంటుందక్కడ! ఎంత బాగుంటుందంటే… టేస్ట్ అట్లాస్ నిర్వహించిన సర్వేలో ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన శాండ్‌విచ్‌లలో ‘అశోక వడపావ్’ 25వ స్థానాన్ని దక్కించుకుంది. దాదర్‌లోని కృతి ఎం.డోంగ్రీస్ కాలేజీ సమీపంలో ఉన్న అశోక వడపావ్ ముంబైకర్లకు సుపరిచితం. ఎనిమిది దశాబ్దాలుగా తాజా రుచులు పంచుతూనే ఉంది. ఎప్పుడు చూసినా ఈ కొట్టు రుచులు ఆస్వాదిస్తున్న విద్యార్థులు, యాత్రికులు, ఫుడ్ లవర్స్‌తో కిటకిటలాడుతూనే కనిపిస్తుంది. 1960 ప్రాంతంలో అశోక వైద్య అనే వ్యక్తి దాదర్ రైల్వే స్టేషన్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ సెంటర్ నడిపేవాడు.
ప్రయాణికులు, మిల్లు కార్మికులు, స్థానికులు ఇష్టపడే స్థానిక వంటకమైన బటాటా వడ (ఉడికించిన ఆలుగడ్డలతో చేసే వడ)ని బన్‌తో చేయడం మొదలుపెట్టాడు. ఆలూతో చేస్తే చాలా సమయం పడుతుంది. మిల్లు కార్మికులకు, స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు అంత సమయం ఉండేది కాదు. అందుకే, వేగంగా అయిపోతుందని బన్‌తో చేయడం ప్రారంభించాడు. ఆయన చేసిన వడపావ్ రుచిగా అందరినీ అలరించింది. ఈ సంగతి ఆ నోటా.. ఈ నోటా ముంబయి అంతా పాకింది. కొన్ని రోజులకే దాదర్‌లో వడపావ్ సెంటర్ ఓపెన్ చేశాడు అశోక వైద్య. నాటి ఆదరణ నేటికీ కొనసాగుతుండటం విశేషం. యూత్‌లో ఈ వెరైటీకి క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా టేస్ట్ అట్లాస్ గుర్తింపుతో చిన్న బడ్డీ కొట్టులో వండి, వడ్డించే ఆశోక వడపావ్ స్ట్రీట్ ఫుడ్ సెంటర్ ఇప్పుడు దేశమంతా పాపులర్ అయింది. ఈసారి ముంబయికి వెళ్లినప్పుడు మీరూ ఓ పట్టు పట్టేయండి.