శారీరకంగా, మానసికంగా ఎంతో బలవంతులైతేనే ఇంగ్లిష్ చానెల్ ఈదాలని కలలుకంటారు. ఆ సాహసానికి పూనుకుంటారు. సముద్రంలో 33 కిలోమీటర్ల దూరం ఈదడం అంటే మాటలా? మహారాష్ట్రలోని నాసిక్‌లో నివసిస్తున్న 33 ఏండ్ల తన్వీ దేవ్రె ఇంగ్లిష్ చానెల్ ఈది అబ్బురపరిచింది. తన్వికి చిన్నప్పటి నుంచి స్విమ్మింగ్ అంటే ఇష్టం. పొద్దునే లేచి అలసిపోయేదాకా స్విమ్మింగ్ చేసిన తర్వాతే బడికి వెళ్లేది. బడి నుంచి వచ్చాక కూడా మళ్లీ ఈత కొలనులోనే కాలక్షేపం చేసేది. ఎంత ఈతకొట్టినా ఆనందం తప్ప అలసట అనిపించేది కాదు. తన్వి తొమ్మిదో తరగతిలో ఉండగా ‘ఇక ఈత చాలు.. చదువుపై దృష్టి పెట్టు’ అని ఆమె తల్లిదండ్రులు హుకుం జారీ చేశారు. ఇంకేముంది ఈతకు బై చెప్పింది. చదువు, ఉద్యోగం, సంసారం, పిల్లలు ఇలా వరుస బాధ్యతలతో ఆమె జీవితం క్షణం తీరిక లేకుండా మారిపోయింది.
ఓరోజు కోల్పోయిన సంతోషాలు, దూరమైన ఈత కొలను ఆమెకు గుర్తుకొచ్చాయి. భర్తతో మాట్లాడుతూ ‘నాకు ఇంగ్లిష్ చానెల్ని ఈదాలన్నది చిన్నప్పటి కోరిక. ఇంగ్లిష్ చానెల్ని ఈదిన ఓ వ్యక్తి విజయగాథ పేపర్లో చదివిన తర్వాత నేనూ దానిని ఈదాలనుకున్నాను’ అని చెప్పింది. ‘ఇంగ్లండ్ నుంచి ఫ్రాన్స్‌కి ఈదడం ఆషామాషీ వ్యవహారం కాదు. 33 కిలోమీటర్లు ఈదాలంటే ఎంత సామర్థ్యం ఉండాలి!? అంత ఈజీ అనుకున్నావా!?’ అంటూ ఆశ్చర్యపోయాడు. తన్వి మాత్రం పట్టు వదల్లేదు. ఆయనా మెత్తబడ్డాడు. ప్రాక్టీస్ మొదలుపెట్టింది. తెల్లవారుజామున 3 గంటలకే నిద్రలేచేది. నాలుగయ్యేసరికి ఈత కొలనుకు వెళ్లేది. మొదటి రోజు 20 నిమిషాలు ఈతకొట్టింది. రోజులు గడిచే కొద్దీ స్విమ్మింగ్‌పూల్‌లో గడిపే సమయం పెరుగుతూ పోయింది. ఏకంగా ఏడెనిమిది గంటలపాటు ఈత కొలనులోనే గడిపే స్థాయికి చేరుకుంది. రెండేండ్లపాటు తన సాధన కొనసాగించింది తన్వి. శారీరక సామర్థ్యాన్ని పెంచుకొని తన లక్ష్యాన్ని ఈదగలనన్న నమ్మకాన్ని సాధించింది.
ఆ రోజు రానే వచ్చింది. ఇంగ్లిష్ చానెల్లో ఈతకు ఉపక్రమించింది. ప్రశాంతంగా ఈదసాగింది. ఇంతలో వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. అలలు ఎగిసిపడటం మొదలైంది. కెరటాలు వెనక్కి నెట్టేయడం వల్ల ఫ్రాన్స్ తీరాన్ని చేరుకోవడానికి మరో పది కిలోమీటర్లు అదనంగా ఈదాల్సి వచ్చింది. ఇంగ్లిష్ చానెల్ వెడల్పు 33 కిలోమీటర్లు అయినా 42 కిలోమీటర్లూ ఈదడం ఆమెకు అనివార్యమైంది. 17 గంటల 42 నిమిషాలపాటు సుదీర్ఘంగా స్విమ్మింగ్ చేసి తీరాన్ని చేరి వారెవ్వా! అనిపించుకుంది తన్వి. కలలు కనడం సహజమే! కాలం దాటిపోయిందని వాటిని విస్మరిస్తారు చాలామంది. జీవిత కాలంలో ఎప్పుడైనా వాటిని సాధించొచ్చని నిరూపించిన తన్వి దేవ్రె అందరికీ ఆదర్శం!