తెలుగు సినిమాను ఆసాంతం పరిశీలిస్తే, తెలుగు హీరోలు.. ఇతర భాషల్లో విజయాలను సాధించడం తక్కువ. ఇతర భాషలకు చెందిన హీరోలను తెలుగు ప్రేక్షకులు ఆదరించడం ఎక్కువ. కారణం తెలుగు ప్రేక్షకులు కంటెంట్ నిగౌరవిస్తారు. సినిమాలో విషయం ఉంటే హీరోలు ఎక్కడి వారన్నది పట్టించుకోరు. ఇది దశాబ్దాల నుంచీ జరుగుతున్న తంతే. బయటి హీరోలను తెలుగు ప్రేక్షకులు స్వాగతించినట్టుగా ఏ ఇతర భాషా ప్రేక్షకులు కూడా ఆదరించరనేది జగమెరిగిన సత్యం.
మిగతా భాషలతో పోల్చుకుంటే తమిళ సినిమాను ఇక్కడి ప్రేక్షకులు ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ ప్రేమకు పునాది వేసింది తమిళ దర్శకుడు కె.బాలచందర్. నిజానికి ఎమ్జీయార్, శివాజీ, జెమినీ గణేశన్లు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే అయినా.. వారికి ఇక్కడ మార్కెట్ అంతంతమాత్రమే ఉండేది. వారు తమిళంలో చేసిన సినిమాలు ఇక్కడ రీమేక్ అయితే.. ఇక్కడ ఎన్టీయార్, ఏఎన్నార్ చేసిన సినిమాలు అక్కడ రీమేక్ అయ్యేవి. అయితే.. తమిళ సినిమాను తెలుగుతో మమేకం చేసింది మాత్రం కె.బాలచందరే! ‘భలే కోడళ్లు’ చిత్రం ద్వారా తెలుగులో తొలిసారి దర్శకత్వం వహించిన బాలచందర్..
ఆ తర్వాత సత్తెకాలపు సత్తయ్య, బొమ్మా బొరుసా చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ‘అంతులేని కథ’ (1976)తో కమల్‌హాసన్, రజనీకాంత్‌లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. తెలుగు సినిమాలో తమిళ నటుల హవాకు బీజం పడింది అప్పుడే. మరో అడుగు ముందుకేసి , కేవలం తెలుగులోనే ‘మరోచరిత్ర’ (1978) సినిమా తీసి, టాలీవుడ్లో ప్రేమకథలకు కొత్త భాష్యం చెప్పారు బాలచందర్. ఆ సినిమాతో కమల్‌హాసన్ ఇక్కడ కూడా స్టారై కూర్చున్నాడు. అప్పటివరకూ తమిళ, కన్నడ సినిమాల్లో విలన్‌గా నటిస్తున్న రజనీకాంత్ తెలుగు సినిమా ‘చిలకమ్మ చెప్పింది’ (1977)తో తొలిసారి హీరో అయ్యారు. అలా ఇక్కడి ప్రేక్షకులకు చేరువైన కమల్‌హాసన్, రజనీకాంత్‌లు కొన్నేళ్లపాటు డైరెక్ట్ తెలుగు సినిమాలు ఎన్నో చేశారు.
ముఖ్యంగా కమల్‌హాసన్‌ని అయితే.. తెలుగు హీరోగానే భావిస్తారు ఇక్కడి ప్రేక్షకులు. ఆయన తెలుగులో చేసిన సినిమాలు అలాంటివి. ఆకలిరాజ్యం, సాగర సంగమం, స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు, ఒకరాధా ఇద్దరు కృష్ణులు, ద్రోహి, శుభ సంకల్పం.. ఇలా ఆయన తెలుగులో డైరెక్ట్‌గా చేసిన సినిమాలన్నీ ఆణిముత్యాలే. అందుకే.. ఆయన నటించిన తమిళ సినిమాలు కూడా ఇక్కడ విరివిగా విడుదలై విజయాలను అందుకున్నాయి.
‘ఏక్ దూజే కేలియే’ సినిమాతో కమల్ని బాలీవుడ్‌కి కూడా పరిచయం చేశారు కె.బాలచందర్. అక్కడ కూడా అఖండ విజయాన్ని అందుకున్నారు కమల్. ఓ విధంగా ఇండియాలో తొలి పాన్ ఇండియా స్టార్ అంటే కమల్‌హాసనే అనాలి. కమల్‌హాసన్ దారిలోనే అర్జున్, కార్తిక్, మోహన్ ఇలా చాలామంది ఇతర భాషానటులు తెలుగులో డైరెక్ట్‌గా సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. అలాగే బాలచందర్ దారిలో భారతీరాజా, మణిరత్నం, సెల్వమణి, శంకర్ తదితర తమిళ దర్శకులు తెలుగులో విజయబావుటాలు ఎగురవేశారు.
అలా తమిళ సినిమా ఖ్యాతిని బాలచందర్ దేశవ్యాప్తం చేస్తే.. తెలుగు సినిమా పవర్‌ను ఖండాంతరాలు దాటించడానికి ఒకరొచ్చారు. ఆయనే ఎస్ ఎస్.రాజమౌళి. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్, మాలీవుడ్, బాలీవుడ్.. ఇలా విడివిడిగా పడున్న భారతీయ సినిమాను ఏకం చేసి, పాన్ ఇండియా కల్చర్‌కి నాంది పలికారాయన. ఇతర భాషల్లో పెద్దగా మార్కెట్ లేని తెలుగు హీరోలను పాన్ ఇండియా స్టార్లను చేశారు. ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేశారు.
ఆ సినిమాలో హీరోగా నటించిన తెలుగు హీరో ప్రభాస్ ఈ రోజున ఆలిండియా సూపర్‌స్టార్. ప్రభాస్ సినిమా వస్తుందంటే దేశం మొత్తం ఎదురు చూస్తున్న పరిస్థితి నేడు నెలకొని ఉంది. ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను కూడా పాన్ ఇండియన్ స్టార్లుగా మార్చేశారు రాజమౌళి. ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా జేజేలు అందుకున్నదంటే అదంతా రాజమౌళి ఘనతే. త్వరలో రానున్న ‘SSMB 29’తో మహేశ్‌బాబు కూడా పాన్ ఇండియా స్టార్ కావడం పక్కా అని అభిప్రాయాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాజమౌళి ఆగమనంతో తెలుగు సినిమా ఖ్యాతి జగద్విఖ్యాతమైంది.
ప్రస్తుతం దేశంలో ఉన్న దర్శకులందరిదీ రాజమౌళి బాటే. ఆ బాటలో ప్రయాణించే సుకుమార్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ తీశారు. ఆ సినిమా రెండో పార్ట్ ‘పుష్ప 2’ రూ.2,000 కోట్లు వసూలు చేసిందని అంచనా. ఆ సినిమాతో బన్నీ రూపంలో మరో పాన్ ఇండియా స్టార్ పుట్టుకొచ్చారు. దర్శకుడు ప్రశాంత్‌వర్మ పానిండియా స్థాయిలో ‘హను-మాన్’ తీస్తే.. ఆ సినిమా దేశవ్యాప్తంగా 350కోట్లు కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్‌తో దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898ఏడీ’ తీస్తే ఆ సినిమా దేశ్యాప్తంగా రూ.1,200కోట్లు వసూలు చేసింది. మొత్తంగా తెలుగు సినిమా మార్కెట్ వేలకోట్లకు చేరింది. ఆ విధంగా తెలుగు సినిమాకు గేమ్‌చేంజర్‌గా నిలిచారు ఎస్.ఎస్.రాజమౌళి.
చెరిగిపోయాయి. భాషలకు అతీతంగా ప్రతిభను చాటుకునే పనిలో బిజీ అయిపోయారు హీరోలంతా. తెలుగు హీరోలకు ఇతర రాష్ర్టాల్లోనూ గౌరవం పెరిగింది. బాలీవుడ్ హీరోలు సౌత్‌లో నటించేందుకు ఇష్టం చూపుతున్నారు. ఇతర రాష్ర్టాలకు చెందిన హీరోలు తెలుగులో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చివరిగా చెప్పొచ్చేదేంటంటే.. గొప్ప దర్శకులుగా చాలామంది ఉంటారు. కానీ తామున్న పరిశ్రమ స్థితిగతుల్నే మార్చేసేవాళ్లు మాత్రం అరుదుగా ఉంటారు. అలాంటి వారే కె.బాలచందర్, ఎస్.ఎస్.రాజమౌళి.