టీచర్స్ డే సందర్భంగా.. నటనలో తన తొలి గురువు గురించి చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ తమన్నా! 13 ఏళ్లకే నటనలో ఓనమాలు దిద్దుకున్నాననీ, బాలీవుడ్ నటుడు నీరజ్ కబీ తనకు శిక్షణ ఇచ్చాడని వెల్లడించింది. అందుకోసం ఆయన తననుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని గుర్తుచేసుకున్నది. తన తాజా వెబ్‌సిరీస్ ‘డూ యు వన్నా పార్టనర్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నది తమన్నా. ఈ సందర్భంగా తన గురువు, తన సినీ కెరీర్ గురించిన ముచ్చట్లు పంచుకున్నది.
“నటనారంగంలో నీరజ్ కబీ నా మొదటి గురువు. ఆయన మార్గదర్శకత్వంతోనే సినీరంగంలో రాణిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. “నీరజ్ సర్ దగ్గర చేరినప్పుడు నాకు పదమూడేళ్లే! నాతోపాటు మరో 12 మందికి ఎలాంటి ఫీజు తీసుకోకుండానే.. ఆయన శిక్షణ ఇచ్చాడు. అలాంటి గొప్పవ్యక్తితో స్క్రీన్ పంచుకోవడం.. నిజంగా నా అదృష్టం!” అంటూ భావోద్వేగానికి గురైంది. ఇక తమన్నా ప్రశంసలకు నీరజ్ స్పందిస్తూ.. “ఆ రోజుల్లోనే ఆ పదమూడేళ్ల అమ్మాయి.. ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకొనేది. పనిలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించేది. అదే తన చివరి పనిగా భావించి.. చాలా కష్టపడి పూర్తిచేసేది” అంటూ పాత రోజులను గుర్తుచేసుకున్నాడు.
ఇప్పటికీ తమన్నాలో పనిమీద అంతే శ్రద్ధ ఉన్నదనీ, నైపుణ్యాలకు సానబెట్టుకుంటూ అద్భుతమైన వ్యక్తిగా ఎదిగిందనీ ఆకాశానికి ఎత్తేశాడు. సేక్రెడ్ గేమ్స్, పాతాల్ లోక్ లాంటి వెబ్ సిరీస్‌లతోపాటు, తల్వార్, సామ్ బహదూర్ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించాడు నీరజ్ కబీ. తెలుగు సినిమా ‘సీతారామం’లో లాయర్‌గా కనిపించాడు. ఇక తమన్నా, డయానా పెంటీ ప్రధాన పాత్రలు పోషించిన ‘డూ యు వాన్నా పార్టనర్’లో.. నీరజ్ కూడా నటించాడు. ఇక 35 ఏళ్ల తమన్నా భాటియా.. 20 ఏళ్లుగా చిత్రసీమలో రాణిస్తున్నది. దక్షిణాదిలో అగ్రతారగా వెలుగొందింది. హిందీతోపాటు ఇతర భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్నది. ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో తీరికలేకుండా బిజీగా ఉంటున్నది ఈ మిల్కీబ్యూటీ.