ఆర్కిమిడీస్కు నీటి తొట్టెలో పుట్టింది. న్యూటన్‌కు యాపిల్ పడ్డప్పుడు తట్టింది. ఐడియా ఎప్పుడైనాపుట్టొచ్చు. ఆలోచన ఎవరికైనా రావొచ్చు. నగరంలోనే అంకురించాలన్న నియమేం లేదు. పట్టణానికే పరిమితం కావాలన్న పరిధీ లేదు. పల్లెలోనూ యురేకా… కేక వినిపించవచ్చు. ఇంటింటా ఇన్నొవేటర్ ఉండొచ్చు. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు. తెలంగాణ ప్రభుత్వం ఇదే మాట నమ్మింది. పల్లె ప్రజలను ఇన్నొవేటర్లుగా దిద్దే పండుగ చేస్తున్నది. ‘టీ- ఇన్నొవేషన్ మహోత్సవం’… ప్రపంచ ఆవిష్కరణ దినోత్సవాన్ని పల్లెబాట పట్టిస్తున్నది. ఆ వేడుకల ఉద్దేశాలు, లక్ష్యాలను తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్(టీఎస్ఐసీ) చీఫ్ ఇన్నొవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌటం వివరించారిలా…
తెలంగాణ అంటే ఇప్పుడు ఎన్నో రాష్ర్టాలకు రోల్ మాడల్. అభివృద్ధిలోనే కాదు… ఆలోచనల్లో, సంపద సృష్టిలో, ఆవిష్కరణల్లో కూడా! ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 21వ తేదీని ప్రపంచ సృజనాత్మకత-ఆవిష్కరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా ఈ తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి సరికొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ‘టీ-ఇన్నొవేషన్ మహోత్సవం’ పేరుతో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 21న ‘అవర్ ఫర్ ఇన్నొవేషన్’ కార్యక్రమాన్ని చేపడుతున్నది. గ్రామీణ స్థాయిలో ఆవిష్కరణల మీద అవగాహన కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్ (టీఎస్ఐసీ), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ప్రతిగ్రామం ఒక ఆవిష్కరణకు వేదిక కావడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఊరూరికీ..
గతేడాది ఏప్రిల్ 21న రాష్ట్రంలో మొదటిసారి ‘వరల్డ్ క్రియేటివ్ డే’ని ‘ఇన్నొవేషన్ డే’ పేరిట నిర్వహించింది టీఎస్ఐసీ. దీనికి విద్యార్థుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘తెలంగాణ యువతలో ఫైర్ ఉంది. సాధించాలన్న కసి ఉంది. వారికి కావాల్సిందల్లా ఒక అవకాశం.. ఒక ప్లాట్‌ఫామ్ మాత్రమే. అది ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉంది’ అంటారు మంత్రి కేటీఆర్. యువత ఆలోచనలను సమస్యల వైపు నుంచి ఆవిష్కరణల దిశగా మళ్లించాలన్న ప్రయత్నమే ‘టీ-ఇన్నొవేషన్ మహోత్సవం’ లక్ష్యం. గతేడాది కేవలం విద్యార్థులు, యువతకే పరిమితమైన ఈ బృహత్ కార్యాన్ని.. ఈ ఏడాది పల్లె తెలంగాణకూ విస్తరింపజేస్తున్నది ప్రభుత్వం. స్థానికంగా ఉన్న సమస్యలకు అక్కడి ప్రజలే పరిష్కార మార్గాలు వెతకాలి. వారి ఆలోచనలే ఆవిష్కరణలై కొత్త ఒరవడికి శ్రీకారం చుడతాయి. అందుకే గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి సైతం ఇందులో భాగమయ్యేలా కార్యాచరణ రూపొందించింది టీఎస్ఐసీ.
పరిష్కారం దిశగా..
టీ-ఇన్నొవేషన్ మహోత్సవంలో భాగంగా తెలంగాణ అభివృద్ధిలో భాగమైన ఆవిష్కర్తల కథనాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కృతమైన అద్భుతాలను పల్లెల్లో ప్రదర్శించనున్నారు. స్థానిక సమస్యలకు స్థానికంగానే పరిష్కారం చూపే ఆవిష్కరణల గురించి అధికారులు అవగాహన కల్పిస్తారు. సమస్యను గుర్తించడం, దానికి పరిష్కారం చూపే ఆవిష్కరణను కనుగొనేలా గ్రామ పౌరులను తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ఉద్దేశం అంటారు శాంత తౌటం. ప్రభుత్వం తరపున గ్రామాల స్థాయిలో ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు టీఎస్ఐసీ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని ఆమె చెబుతారు. ఈ ఏడాది మొత్తం 15వేల గ్రామాల్లో టీ-ఇన్నొవేషన్ మహోత్సవం నిర్వహించనున్నారు. ‘ఇంటింటా ఇన్నొవేటర్’ అన్న మంత్రి కేటీఆర్ మాటను నిజం చేసే దిశగా టీఎస్ఐసీ కార్యాచరణ అమలుచేస్తున్నది.
నడిపించే శక్తి
ఏదైనా కార్యక్రమం ఫలవంతం కావాలంటే.. దాన్ని విజయవంతంగా నడిపే వ్యక్తి, శక్తి కావాలి. టీ హబ్, టీ వర్క్స్, టీఎస్ఐసీని నడిపించే శక్తి తెలంగాణ ప్రభుత్వం అయితే, దాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి డాక్టర్ శాంత తౌటం. వరంగల్‌లో పుట్టి పెరిగిన శాంత కిట్స్‌లో ఇంజినీరింగ్ చేశారు. తర్వాత అమెరికాలో మాస్టర్స్ చదివి ఐదేండ్లపాటు అక్కడే ఉద్యోగం చేశారు. ఒకవైపు పీహెచ్డీ చేస్తూనే ఆంత్ర ప్రెన్యూర్ రియల్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగిగా సేవలందించారు. ఆమె న్యూయార్క్‌లో పనిచేస్తున్న రోజుల్లో టీ-హబ్ గురించి మంత్రి కేటీఆర్ చెప్పిన మాటలు విని స్ఫూర్తి పొందారు. టీ హబ్‌లో పనిచేసేందుకు అమెరికాలో ఉద్యోగం వదిలేసి హైదరాబాద్ వచ్చారు. తనకు అవకాశమిస్తే సంస్థ బలోపేతానికి ఏం చేయగలరో వివరించారు. అలా టీ-హబ్‌లో ఉద్యోగిగా చేరిన శాంత అనతికాలంలోనే తానేంటో నిరూపించుకున్నారు.
సుమారు మూడున్నరేండ్లు అక్కడ సేవలు అందించారు. తన పనితనంతో అందరి మన్ననలు అందుకు న్నారు. 2021లో టీఎస్ఐసీ చీఫ్ ఇన్నొవేషన్ అధికారిగా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు శాంత సారథ్యంలో టీఎస్ఐసీలో వెయ్యికి పైగా ఇన్నొవేటర్లను రిక్రూట్ చేసుకున్నారు. వందలాది మంది ఉపాధ్యాయులకు, వేలాది మంది విద్యార్థులకు ఇన్నొవేషన్ మీద అవగాహన కల్పించేలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ‘స్కూల్ ఇన్నొవేషన్ ఛాలెంజ్’ పేరుతో ప్రతి పాఠశాలలో విద్యార్థుల్లో ఇన్నొవేటివ్ ఆలోచనలు రేకెత్తించారు. యాభై మంది ఇన్నొవేటర్లు చేసిన ఆవిష్కరణలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ నోడల్ ఏజెన్సీగా ఇప్పటివరకు రూ.4 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ఇన్నొవేటర్లకు అందించారు.
ఇలా పంపొచ్చు..
గ్రామంలో ఎవరికైనా ఒక సమస్యను పరిష్కరించే ఇన్నొవేటివ్ ఐడియా వస్తే దాన్ని పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయిలో డీఎస్వో, డీఈవో, కలెక్టర్, ఈ-డిస్ట్రిక్ మేనేజర్లకు చెప్పొచ్చు. లేదంటే 9100678543 నెంబర్‌కి ఫోన్‌గానీ, వాట్సాప్ గానీ చేయొచ్చు. tsic@telangana.gov.in ఐడీకి మెయిల్ చేయొచ్చు. ఎవరైనా, ఎక్కడివారైనా టీ-ఇన్నొవేషన్ మహోత్సవంలో పాల్గొనవచ్చు.