ఆటల్లో రాణించాలంటే అన్నీ కుదరాలి. అమ్మాయిలకైతే ఎన్నెన్నో కలిసిరావాలి. సాదాసీదా ఆటలైతే ఓకే కానీ, స్విమ్మింగ్ నేర్చుకుంటా మంటేనే ఇంట్లోవాళ్లు ‘గమ్మునుండూ’ అంటారు! అదే ఈతలో పోటీలకు వెళ్తామంటే.. ససేమిరా అంటారు! కానీ, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈఇందూరు ఆడబిడ్డలకు కలిసొచ్చింది.వేసవి సెలవుల్లో సరదాగా నేర్చుకున్న ఈతపై గట్టి పట్టు సాధించి సొరచేపల్లా దూసుకుపోతున్నారు.నిజామాబాద్ స్విమ్మింగ్ క్వీన్స్ అనిపించుకున్న నవీపేట మండలంబినోలకు చెందిన మిట్టపల్లి రిషిక,మిట్టపల్లి రుత్విక ‘ఈత’రం సెలెబ్రిటీలు.
మిట్టపల్లి ప్రకాశ్‌రావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి రిషిక బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నది. చిన్నప్పటినుంచీ ఈత కొలనులో చేపలా దూసుకుపోయేది. జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొని ఎన్నో పథకాలు సాధించింది. అక్కను చూస్తూ ఈత కొలనులో దిగిన రుత్విక ఇప్పుడు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నది. అక్క బాటలోనే ఈదుతూ అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకుంది. అలా ఈ ఇందూరు సిస్టర్స్ జాతీయ స్థాయి స్విమ్మర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిజామాబాద్ పేరు చెప్పగానే బాక్సర్ నిఖత్ జరీన్, హుసాముద్దీన్ గుర్తురాకుండా ఉండరు. ఇప్పుడు వీరి సరసన స్విమ్మింగ్‌లో రిషిక, రుత్విక పేర్లు వచ్చి చేరాయి. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించిన రిషిక చదువు కారణంగా కాస్త వెనక్కి తగ్గింది. అయితే, అక్క ఇచ్చిన స్ఫూర్తితో రుత్విక మాత్రం ఈతలో మరింత రాటుదేలింది. జాతీయ ఈవెంట్లలో రికార్డులు సృష్టిస్తున్నది.
భయంగా అడుగుపెట్టి..చాలామందికి నీళ్లను చూస్తే సహజంగా భయం కలుగుతుంది. నీళ్లలోకి దిగాలంటే వణకు పుడుతుంది. బాల్యంలో రిషిక, రుత్విక కూడా నీళ్లంటే ఆమడ దూరం పరిగెత్తేవారు. అయితే, ఆడపిల్లలకు అన్ని విద్యలూ తెలిసి ఉండాలని భావించారు వీరి తండ్రి ప్రకాశ్‌రావు. అందుకే వేసవిలో ఇద్దరు పిల్లలనూ నిజామాబాద్‌లోని స్విమ్మింగ్‌పూల్‌కి తీసుకెళ్లేవారు. అక్కడ ఈత కొలనులో భయం భయంగా అడుగుపెట్టిన ఇద్దరూ.. ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అమ్మాయిలకు స్విమ్మింగ్ సరిపడదు అనే భావనను మార్చేశారు. కృషి, పట్టుదల ఉంటే.. ఏ రంగంలో అయినా బాలికలు రాణించవచ్చని నిరూపించారు. రిషిక పదికి పైగా జాతీయ స్థాయి ఈవెంట్లలో పాల్గొని మెడల్స్ దక్కించుకున్నది. ఇక రుత్విక విషయానికి వస్తే అక్కను మించిన క్రీడాకారిణి అనిపించుకున్నది. 2023లో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో 50 మీటర్ల బ్రెస్ట్స్ట్రోక్ను కేవలం 34.65 సెకండ్లలో పూర్తిచేసి కాంస్య పతకం గెలిచింది.
47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్- 2021లో 4X100 మెడ్లీ రిలేని 4.57 నిమిషాల్లోపూర్తిచేసి కాంస్యం అందుకుంది. అంతకుముందు నార్త్ ఈస్ట్ ఇంటర్ యూనివర్సిటీ నేషనల్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో మెడ్లీ రిలే, ఫ్రీస్టయిల్ రిలేలో బంగారు పతకాలు సాధించింది. ఇలా రుత్విక ఈత కొలనులో దిగితే చాలు ఏదో ఒక పతకం గెలవడం ఖాయం అన్న పేరు సాధించింది. ఇంట గెలిచిన రుత్విక ఇప్పుడు రచ్చ గెలవడానికి కఠోర సాధన చేస్తున్నది. ‘నాన్న, అక్క ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నా. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో పతకం గెలిచి మనదేశానికి పేరు తేవాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నిరంతరం శ్రమిస్తాను’ అని చెబుతున్న రుత్వికకు మనమూ ఆల్ ద బెస్ట్ చెబుదాం.అంచనాలను మించి..
చిన్నప్పటినుంచి ఈత అంటే నాకు చాలా ఇష్టం. నా పిల్లలకు కూడా ఈత నేర్పాలనుకున్నా. భవిష్యత్తులో రక్షణగా ఉంటుందనీ, ఆరోగ్యానికి మంచిదనీ ఈత నేర్పాను. అలా మొదలైన ప్రయత్నం వారి ఉత్సాహంతో ముందుకుసాగింది. నా బిడ్డలు చూపుతున్న ప్రతిభకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలనిపించింది. మొత్తానికి నా అంచనాలను మించి ఇద్దరూ స్విమ్మింగ్‌లో రాటుదేలారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి ఈవెంట్లలో పాల్గొని పతకాలు గెలిచారు. పెద్దమ్మాయి రిషిక ప్రస్తుతం చదువులపైనే దృష్టిపెట్టింది. చిన్నమ్మాయి రుత్విక శిక్షణ కొనసాగుతున్నది. త్వరలోనే దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందని నమ్మకంగా ఉంది. అంతేకాదు, స్విమ్మింగ్‌లో మనదేశానికి పతకం సాధిస్తుందన్న విశ్వాసమూ ఉంది.l మిట్టపల్లి ప్రకాశ్ రావు, రుత్విక తండ్రి
జూపల్లి రమేశ్