తప్పిపోయిన బిడ్డ కోసం తండ్లాడే తల్లుల పోరాటాలు విన్నాం. ఇది కూడా అలాంటి కథే. కాకపోతే ఇది తల్లి కోసం వెతుకులాడే అమృత సినిమాలోని అమృత లాంటి మరో కథ. స్వీడన్లో పాట్రీషియా అనే అమ్మాయి ఉంది. బడిలో కొంతమంది పిల్లలు ‘నేను అచ్చం అమ్మలా ఉంటా’ అని, మరికొంతమంది ‘నాది నాన్న పోలిక’ అనడం విన్నప్పుడల్లా పాట్రీషియా ఆలోచనలో పడేది. ‘నేనెవరిలా ఉన్నాను?’ అన్న ఆమె సందేహాన్ని అమ్మానాన్న తీర్చలేకపోయారు. వాళ్లు నలభై ఏళ్ల క్రితం భారత దేశ సందర్శనకు వచ్చారు. ఆ సందర్భంలో పూనేలోని ఓ అనాథాశ్రమంలో పెరుగుతున్న ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు. ఆ బిడ్డను తీసుకుని స్వీడన్ పోయారు. ఆ బిడ్డే పాట్రీషియా.
తన తల్లి ఎవరో పెంచుకున్న అమ్మానాన్నలు చెప్పలేదు. తన తల్లి జాడ తెలుసుకోవాల్సిందేనని నలభై ఏళ్ల తర్వాత మళ్లీ మాతృభూమిపై కాలుమోపింది. స్వీడిష్ దంపతులకు పాట్రీషియాను దత్తత ఇచ్చిన పూనేలోని అనాథాశ్రమానికి చేరింది. అక్కడ తన తల్లి వివరాలేవీ దొరకలేదు. కానీ, ఆ వివరాలకు ఓ దారి దొరికింది. అక్కడి నుంచి సామాజిక కార్యకర్తల సహకారంతో నాగపూర్లోని మరో అనాథాశ్రమానికి చేరింది. తన తల్లి పేరు ‘శాంత’ అని, డాగా ఆసుపత్రిలో పుట్టిందని ఆ ఆశ్రమం నిర్వాహకులు చెప్పారు. తల్లి పేరు తెలుసుకున్నా, తల్లి జాడను తెలుసుకునే ప్రయత్నంలో విఫలమైన ఆమె వెనుదిరిగి స్వీడన్ వెళ్లిపోయింది. రెండేళ్ల తర్వాత మళ్లీ భారత్ వచ్చింది. తల్లి ఆచూకీ కోసం మరోమారు వెతకడం మొదలుపెట్టింది. నాగ్పూర్ పట్టణంలోని అంగన్వాడీలు, పాఠశాలల్లో శాంతి పేరుతో నమోదైన వాళ్లందరి వివరాలు సేకరిస్తోంది. నగరంలో నలభై ఏళ్ల నుంచి నివసిస్తున్న వాళ్లను కలిసి ‘శాంతి’ కోసం ఆరా తీస్తూనే ఉంది. ఆమె ఎంతో ఆశతో తల్లి కోసం వెదుకుతోంది. ఆమెకు అంతే నిరాశ ఎదురవుతోంది. ఏదో ఒకనాటికి అమ్మ ఒడిని చేరుకుంటాననే ఆశతో అన్వేషిస్తూనే ఉంది.