యావత్ దేశాన్నీ కుదిపేసిన ఢిల్లీ (నిర్భయ) అత్యాచార ఘటన జరిగి పుష్కరకాలం గడుస్తున్నా.. ఇప్పటికీ రాజధాని మహిళలు భయం భయంగానే బతుకుతున్నారు. తాజాగా, గ్రీన్పీస్ ఇండియా నిర్వహించిన ఓ సర్వేలో.. ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలో సాయంత్రం 5 గంటల తర్వాత బస్సుల్లో ప్రయాణించడం సురక్షితం కాదని 77 శాతం మంది మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఈ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలువడ్డాయి. ఢిల్లీలో 45 శాతం మంది మహిళలు పబ్లిక్ బస్సులకు దూరంగా ఉంటున్నారు. 35 శాతం మంది ప్రతిరోజూ లేదా వారానికి మూడు నుంచి ఐదు రోజులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక బస్స్టాప్లలో వెలుతురు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మహిళలు ఆందోళన చెందుతున్నట్టు సర్వేలో తేలింది. సగటున 87 శాతం మంది మహిళలు ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల కంటే ఎక్కువగా బస్స్టాప్లలో వేచి ఉంటున్నారట. 13 శాతం మంది బస్సు కోసం 30 నిమిషాల కంటే ఎక్కువ సమయంపాటు ఎదురు చూస్తున్నారనీ వెల్లడైంది. చీకటిలో బస్సుల కోసం వేచి ఉండటం వల్ల తాము తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్లు మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలో 95 శాతం క్షేత్రస్థాయిలో మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించగా, 5 శాతం వెబ్ ఆధారంగా తీసుకున్నట్టు సర్వే ప్రతినిధులు పేర్కొన్నారు.