ఆమె పుట్టింది పల్లెలో కాదు. ఉన్నత చదువులే ఆమెకు తెలిసిన ప్రపంచం. పెద్దయ్యాక అడ్వైర్టెజింగ్ మేనేజర్, బ్రాంచ్ హెడ్ హోదాలు వద్దనుకుంది. కార్పొరేట్ ట్రైనర్‌గా పేరు తెచ్చుకుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ అధికారులకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పింది. అవన్నీ వదులుకుని కౌలు రైతుగా మారింది. రైతులకు డ్రోన్ దీదీ అయ్యింది. జీవితానికి కావాల్సింది పేరు ముందు హోదాలు, వెనకేసుకున్న డబ్బు కాదు సంతోషం అంటున్నది డ్రోన్ దీదీ సురేఖ ఆదిమూలం. సంతోషం, సంతృప్తి కోసం నేర్చుకోవడమే సాధనం అంటున్న ఆమె అనుభవ పాఠాలను జిందగీ పాఠకులకు మళ్లీ చెబుతున్నదిలా..
నేను పుట్టింది.. పెరిగింది.. చదివింది సికింద్రాబాద్‌లో. నాన్న టైలర్‌గా పని చేస్తూ అక్క, అన్న, తమ్ముడు, నన్ను బాగా చదివించాడు. బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏలో చేరాలనుకున్నాను. సంప్రదాయ గ్రూపుల్లో సీట్లు అయిపోయాయి. కొత్తగా బీఏ మాస్ కమ్యూనికేషన్ వచ్చిందని, దీనికి మంచి భవిష్యత్ ఉంటుందని ప్రొఫెసర్ హేమలత గారు ప్రోత్సహించారు. బీఏ మాస్ కమ్యూనికేషన్లో చేరాను. పత్రికలు, టీవీలు, రేడియోలు ఎలా నిర్వహిస్తారో చూసి వచ్చేవాళ్లం. ఫైనల్ ఇయర్లో అడ్వైర్టెజింగ్, మార్కెటింగ్ సబ్జెక్టులు ఉన్నాయి. వాటి గురించి అవగాహన వల్ల డిగ్రీ తర్వాత భవన్స్ కాలేజ్‌లో అడ్వైర్టెజింగ్ డిప్లొమా కోర్సులో చేరాను.
సంతృప్తి లేని చోట
చదువుకునేటప్పుడే అడ్వైర్టెజింగ్ ఏజెన్సీలో ఎగ్జిక్యూటివ్ జాబ్ వచ్చింది. అది చేస్తూనే ఆకాశవాణి, దూరదర్శన్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమం చూసేదాన్ని. అలాగే దూరదర్శన్‌లో వచ్చే ‘స్టేట్ స్కాన్’ న్యూస్ బులిటెన్ కోసం పని చేశాను. దూరాభారంగా ఉందని దూరదర్శన్‌లో పని మానేశాను. ఒక బెంగళూరు అడ్వైర్టెజింగ్ కంపెనీ హైదరాబాద్‌కి విస్తరించాలనుకుంది. నన్ను హైదరాబాద్ హెడ్‌గా నియమించుకుంది. కెరీర్లో ఎదుగుదల ఉన్నా పనిలో కొత్తదనం లేదు. ఎనిమిదేండ్లకు ఉద్యోగం మానేశాను.
పాత సామర్థ్యాలు.. కొత్త పాఠాలు
ఏం చేస్తే బాగుంటుందో తెలిసినవాళ్లను అడుగుతూ వచ్చాను. ప్రొఫెషనల్ ట్రైనర్ రామ్మోహన్ గారు ట్రైనింగ్ ప్రొఫెషన్ ఒకటుందని చెప్పారు. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటుందో చూపించారు. అవి చూశాక ఇదే నా కెరీర్ అనుకున్నాను. అప్పటికే.. నా క్లాస్మేట్స్ ఇద్దరు జర్నలిజం లెక్చరర్లుగా పని చేస్తున్నారు. అడ్వైర్టెజింగ్ క్లాసుల కోసం నన్ను గెస్ట్ లెక్చరర్‌గా పాఠాలు చెప్పమని పిలిచేవాళ్లు. ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇన్ఫర్మేటివ్గా చెప్పేదాన్ని. గెస్ట్ లెక్చరర్ పాఠాల వల్ల బోధన అలవడింది. కొన్నాళ్లకు ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ (ఐఎస్టీడీ)లో చేరాను. పద్దెనిమిది నెలల కోర్సు పూర్తి చేశాను. ఆ తర్వాత ప్రొఫెషనల్ ట్రైనర్‌గా పంజాగుట్టలో ‘ఎపిటమీ మెంటర్స్’ ఇన్స్టిట్యూట్ ప్రారంభించాను. ప్రజెంటేషన్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్, టీమ్‌వర్క్‌లో శిక్షణ ఇచ్చాను. బ్రిటిష్ కౌన్సిల్ నుంచి ఐఈఎల్టీఎస్ సర్టిఫికేషన్ వచ్చింది. దాంతోపాటు జీఆర్ఈ కోచింగ్ కూడా మొదలుపెట్టాను. అందరి సామర్థ్యాలు ఒకేలా ఉండవు. గృహిణి, ఉద్యోగి, ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన వాళ్లకు ఒకే రకమైన శిక్షణ సరైనది కాదని నా భావన. కాబట్టి నేను వన్ టు వన్ చెబుతాను. వీసా ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి? రెజ్యుమె ఎలా బిల్డ్ చేసుకోవాలని వన్ టు వన్‌కి శిక్షణ ఇచ్చాను. ఇలా చెప్పడం వల్లే అందరికీ రిజల్ట్ చూపించగలిగాను. ప్రకటనలు, ప్రచారం లేదు. ఒకరు చెబితే వాళ్ల ద్వారా మరొకరు వచ్చేవారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఈఓలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు శిక్షణ కోసం వచ్చేవారు. ఆ సమయంలో అటవీ శాఖ ఉన్నతాధికారి రఘువీర్ గారు వాళ్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వమని అడిగారు. ఫారెస్ట్ అధికారులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాను. కొవిడ్ వల్ల క్లాస్ రూమ్ కోచింగ్ నిలిపివేశాను. ఇన్స్టిట్యూట్ మూసేసి ఆన్లైన్ శిక్షణే కొనసాగిస్తున్నాను.
రైతు బడి
పల్లెలో ఉండాలని, పంటలు పండించాలని ఎప్పటి నుంచో ఓ ఆలోచన ఉంది. కరోనా సమయంలో మేడ్చల్ జిల్లాలోని గిర్మాపూర్‌లో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఓ ఫర్టిలైజర్ కంపెనీ సహకారంతో భూసార పరీక్ష చేయించాను. వ్యవసాయ, ఉద్యానవన శాఖల సహకారంతో సాగు మొదలుపెట్టాను. మొదట వరి వేశాను. తర్వాత కూరగాయల సాగు చేపట్టాను. సైంటిఫిక్‌గా వ్యవసాయం చేశాను. తెగుళ్లు వస్తే ఫొటోలు తీసి వ్యవసాయ నిపుణుల సలహాలు తీసుకునే ఎరువులు, పెస్టిసైడ్స్ వాడాను. నేర్చుకోవడం నాకు ఇష్టం. ఆ కొద్ది కాలంలోనే హైడ్రో పోనిక్స్, తోటల పెంపకం శిక్షణ తీసుకున్నాను. నా పంట బాగుంది. పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ కంపెనీలు చుట్టుపక్కల గ్రామాల రైతులను మా పొలానికి తీసుకువచ్చి చూపించేవాళ్లు. వ్యవసాయం ఎలా చేయలనేదానికి నా పొలం డెమో ఫీల్డ్ అయిపోయింది! అప్పటి నుంచి రైతులు ఫోన్ చేసి సలహాలు అడిగేవాళ్లు. నాకు తెలిసింది చెప్పేది. తెలియకపోతే తెలిసిన వాళ్లను అడిగి చెప్పేది. రెండేండ్లలో అగ్రికల్చర్ ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయాను. పొలానికి దగ్గరగా ఉండాలని నివాసాన్ని కొంపల్లి నుంచి మేడ్చల్‌కు మార్చాను.
డ్రోన్ దీదీ
మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ కోసం ఓ ఎనిమిది మంది మహిళా రైతులు కావాలని నన్ను అడిగారు నిర్వాహకులు. గ్రామాల సర్పంచ్‌లను అడిగి ఎనిమిది మందిని గుర్తించాను. మీటింగ్ పెట్టాను. వస్తామన్న వాళ్లు తర్వాత ఒక్కొక్కరు డ్రాప్ అయ్యారు. ‘మీరు నేర్చుకోగలరు. ఇతరులకు నేర్పగలరు’ అని చివరికి నన్ను ఎంపిక చేసి పది రోజులు శిక్షణ ఇచ్చారు. మామిడి, సపోటా, మక్కజొన్న, వరి పంటల మీద డ్రోన్లు నడిపాం. డ్రోన్‌ని ఏ హైట్‌లో ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకున్నాం. దేశవ్యాప్తంగా పదకొండు వందల మంది డ్రోన్ దీదీలు ఉన్నారు. అందులో నేనొకదాన్ని. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో రైతులకు డ్రోన్ వినియోగించడం నేర్పాను.
మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో డ్రోన్ దీదీలతో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డ్రోన్లతో డ్రిల్ (ప్రదర్శన) నిర్వహించారు. దానికి నేను ఎంపికయ్యాను. ఆ సదర్భంలో నాకు ప్రభుత్వం ఒక డ్రోన్‌ని ఉచితంగా ఇచ్చింది. ఈ పథకం రైతులకు, స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకే వర్తిస్తుంది. కార్పొరేట్ ట్రైనర్ అయిన నేను అనుకోకుండా కౌలు రైతుగా మారాను. సాగు కోసం బ్యాంక్ లోన్ అడిగితే… స్వయం సహాయక సంఘంలో చేరితే తక్కువ వడ్డీకే రుణం వస్తుందన్నారు. అందులో చేరి ఎనభై వేలు రుణం తీసుకున్నాను. ఇవన్నీ అర్హతలుగా కొత్త ప్రయాణం మొదలుపెట్టాను. సాగు లాభసాటిగా ఉంది. రెండేళ్ల తర్వాత ఆ రైతు తానే వ్యవసాయం చేసుకుంటానన్నాడు. ఇప్పుడు పండించే అవకాశం లేదు. డ్రోన్‌తో గ్రామాల్లో అడిగిన రైతులకు పురుగు మందులు పిచికారి చేస్తున్నాను. వరి, మక్కజొన్న, మిరప, కూరగాయల పంటని బట్టి కిరాయి తీసుకుంటున్నా. జీవితంలో సంతృప్తిగా బతకాలంటే కొత్త పనులు చేస్తూ ఉండాలని అనుభవం నేర్పింది. దానికి ఉండాల్సిన అర్హత నేర్చుకునే గుణమని నా ఆచరణలో తెలుసుకున్నా.
నా బలం..
బాలికల కోసం తరుణి సంస్థ పని చేసేది. డిగ్రీలో ఉన్నప్పటి నుంచే అందులో పనిచేసేదాన్ని. వరంగల్ జిల్లాలో గ్రామాలకు వెళ్లేవాళ్లం. తెల్లవారుజామున మా నాన్న బైక్ మీద దింపేవాడు. తిరిగి వచ్చే సరికి రాత్రి అయ్యేది. ‘మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఎన్జీవోల్లో పని చేస్తే మీకేం వస్తుంది? టైమ్ వేస్ట్ చేసుకుంటుంది’ అంటూ ఇరుగుపొరుగు వాళ్లు ఎన్ని మాటలన్నా అమ్మ అవేవీ పట్టించుకోలేదు. నాన్న ప్రోత్సాహం ఆగలేదు. ‘మా అమ్మాయి సమ్‌థింగ్ డిఫరెంట్. ఏదో చేయాలనే ఉత్సాహపడుతున్నది. ఏదో ఒకనాటికి తప్పకుండా సాధిస్తుంది’ అని మా అమ్మ అనుకునేది. అమ్మ ధైర్యమే చదువుకునే రోజుల్లో నా బలం.
జీవితానికో భరోసా
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించేందుకు పదమూడేండ్ల క్రితం ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాష్మెంట్ యాక్ట్ (పోష్) వచ్చింది. దాని గురించి ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలకు అవగాహన కల్పించేందుకు బెంగళూరులో శిక్షణ పొందాను. పోష్కి కొనసాగింపుగా ఇప్పుడు సాహస్ పేరుతో మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాహస్ అమలు కోసం మమతా రఘువీర్ అక్కతో కలిసి తెలంగాణలోని పురుష పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చాను. అత్యాచార బాధిత మహిళలకు రక్షణతోపాటు సాధారణ జీవితం కొనసాగించేలా ప్రోత్సహిస్తూ, ఉపాధికి శిక్షణ ఇచ్చే భరోసా సంస్థలో సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాను. బాధితులతో ఎలా మాట్లాడాలి? వాళ్లను ఎలా రిసీవ్ చేసుకోవాలి? వాళ్ల బాధలు ఎలా వినాలి? వాళ్లతో మాట్లాడేప్పుడు కమ్యునికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలో శిక్షణ ఇస్తాను….?
–నాగవర్ధన్ రాయల వీరగోని రజనీకాంత్గౌడ్