చిన్న ఆలోచన ఓ పెద్ద ప్రయోగానికి నాంది పలుకుతుంది. చిన్న అడుగు ఓ విజయానికి దారి చూపుతుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ నేరెళ్ల అలాంటి అడుగే వేసింది. సాటిరాని కులవృత్తిని మేటిగా మార్చుకుని ఆంత్రప్రెన్యూర్‌గా రాణిస్తున్నది. తాటి, ఈత నీరాతో సేంద్రియ విధానంలో చక్కెర తయారుచేస్తూ ప్రజలకు ‘కానుక’ అందిస్తున్నది. ‘కానుక ఆర్గానిక్స్’ పేరుతో సరికొత్త వ్యాపారంలో దూసుకుపోతున్న శ్రియ ప్రయాణమిది..
తాటి, ఈత నీరా చూసేందుకు కొబ్బరినీళ్లలా ఉంటుంది. సూర్యోదయానికి ముందు చెట్టు నుంచి తీసినదాన్ని నీరా అంటారు. పోషకాలు, ఔషధ గుణాలు మెండుగా ఉండే ఈ పానీయాన్ని ఇష్టపడనివారు ఉండరు. అయితే, నీరా నుంచి చక్కెర, బెల్లం ఉత్పత్తి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న శ్రియ తానెందుకు ఆ ప్రయత్నం చేయకూడదు అని భావించింది. కల్లుగీత కులవృత్తిగా కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమె ఈ ప్రయోగానికి పూనుకుంది.
కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రియ పదో తరగతి దాకా అక్కడే చదివింది. తర్వాత ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్‌లో కొనసాగింది. జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీటెక్ చేసింది. ఎప్పటికైనా సమర్థురాలైన వ్యాపారిగా ఎదగాలన్నది శ్రియ లక్ష్యం. ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో తన స్నేహితులు వేసే చిత్తరువులను గిఫ్ట్స్ రూపంలో మార్కెటింగ్ చేస్తూ బిజినెస్ సూత్రాలు ఒంటబట్టించుకుంది. బీటెక్ తర్వాత పూణెలో పామ్ జాగరీలో పీజీ డిప్లొమా చేసింది. అదే సమయంలో నీరాతో చక్కెర ఎందుకు ఉత్పత్తి చేయకూడదన్న ఆలోచన వచ్చింది. శ్రియకు తన చిన్నతనంలో వాళ్లింట్లో నీరా బెల్లం తిన్న జ్ఞాపకం ఉంది. ఆ అనుభవంతో.. చక్కెర తయారీకి మొగ్గు చూపింది. అనుకున్నదే తడవుగా పరిశోధన మొదలుపెట్టింది. ఈ రీసెర్చ్‌లో కాంబోడియా, శ్రీలంక, నైజీరియా దేశాల్లో ఈ తరహా ఉత్పత్తులు తయారు చేస్తున్నారని తెలుసుకున్నది. మనదేశంలో నీరాతో బెల్లం తయారీ కొందరు చేస్తున్నారని ఆమె దృష్టికి వచ్చింది. కేరళలో కొబ్బరిపాలతో చక్కెర ఉత్పత్తి చేస్తున్నారని తెలిసింది. ఆ విషయాలన్నిటినీ సేకరించింది. తాటి, ఈత నీరాతో చక్కెర ఉత్పత్తికి శ్రీకారం చుట్టాలని నిశ్చయించుకుంది.
ముందుగా బెల్లం తయారీదారులను కలుసుకుంది. నీరా సేకరణ, బెల్లం ఉత్పత్తి విధానాల గురించి వాకబు చేసింది. పలువురు శాస్త్రవేత్తలనూ కలుసుకొని తన ఆలోచన వారితో పంచుకుంది. ఇలా ఏడాదిన్నర పరిశోధన తర్వాత మహారాష్ట్రలో తాటి తోపులు విరివిగా ఉండే పాల్ఘర్‌ను తన వ్యాపార కేంద్రంగా ఎంచుకున్నది. ‘కానుక ఆర్గానిక్స్’ పేరిట సంస్థను స్థాపించి గతేడాది నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. నీరా సేకరణకు స్థానిక కల్లుగీత కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద రూ.50 లక్షలు రుణం అందుకుంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు రూ.30 లక్షలు సమకూర్చారు. ఈ మొత్తంతో తన కలలను సాకారం చేసుకునే దిశగా ‘కానుక ఆర్గానిక్స్’ సంస్థను నెలకొల్పింది.
పుట్టిన ఊరును కాదని, చదువుకున్న హైదరాబాద్‌ను వదిలి.. పొరుగు రాష్ట్రంలో ఆంత్రప్రెన్యూర్‌గా శ్రియ మనుగడ సాగిస్తున్నది. మహారాష్ట్రలో నీరా ఉత్పత్తి అధికం. మన దగ్గర కొబ్బరినీళ్లు ఎంత విరివిగా దొరుకుతాయో.. అక్కడ నీరా అంతగా లభ్యమవుతుంది. ముడిసరుకు సమృద్ధిగా అందుబాటులో ఉన్నప్పుడే కదా.. వ్యాపారం సజావుగా సాగేది. అందుకే చక్కెర ఉత్పత్తి ప్లాంట్ పాల్ఘర్ ఏరియాలో పెట్టానని చెబుతుంది శ్రియ. చెట్టు నుంచి నీరా తీసిన రెండు గంటల్లోగా చక్కెర ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందట. ఏ కొంచెం ఆలస్యమైనా అది చక్కెర తయారీకి పనికిరాదని చెబుతుందామె. ‘నీరా చక్కెర తయారీలో ఎలాంటి రసాయనాలను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. సేకరించిన నీరాను సంప్రదాయ పద్ధతుల్లో, నిర్దేశిత ఉష్ణోగ్రతలో ఉడికిస్తే.. చక్కెర తయారవుతుంది’ అని చెప్పుకొచ్చింది శ్రియ. ప్రస్తుతం పరిమిత స్థాయిలో ఉత్పత్తి కొనసాగిస్తున్నది. రానున్న రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది ఈ ఆంత్రప్రెన్యూర్. ‘ప్రస్తుతం ముంబయిలోని కొన్ని సంస్థలు నీరా చక్కెర కొనుగోలుకు ఒప్పందాలు చేసుకున్నాయి. చక్కెరతోపాటు బెల్లాన్నీ సమాంతరంగా ఉత్పత్తి చేస్తున్నాం. రిస్క్ చేయకపోతే.. విజయం రాదు. అడుగు వేయడానికి కూడా జంకితే.. గెలుపు ఎప్పటికీ సాధ్యం కాదు. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగితే ఏదైనా సాధించవచ్చు’ అంటున్న శ్రియ యువతరంగాలకు ఆదర్శం.