ప్రేయసి అంటే ప్రేమ ఉన్నవారు.. ఆమెకు ఇచ్చిన మాట తప్పరు! తప్పినా అతగాడు ‘ఐ యామ్ వెరీ సారీ.. అన్నాగా వందోసారీ..’ అనగానే సరదాగా క్షమించేస్తుంది ఆమె. ఇలాగే మన్నించేస్తుందని భావించాడు ఆ ప్రేమికుడు. ఇచ్చిన మాట తప్పాడు. ఆమెకు చిర్రెత్తింది. నేరుగా ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించింది. దీన్ని తక్షణం విచారణకు స్వీకరించిన ధర్మాసనం సదరు ప్రేమికుడికి కొర్రు కాల్చి కాసులు చెల్లించమని వాతలు పెట్టింది. ఇంతకీ విషయమేంటంటే న్యూజిలాండ్‌కు చెందిన ఓ జంట ఆరున్నరేండ్లుగా ప్రేమించుకుంటున్నది. ఓ రోజు ఆ చిన్నది సుదూర నగరంలో సంగీత కచేరీకి వెళ్లడానికి టికెట్లు బుక్ చేసుకుంది. అదే విషయాన్ని ప్రియుడికి చెప్పింది. జస్ట్ ఓకే అని చెప్పి ఊరుకోలేదు అతను. ‘ఔనా బేబీ! నేను ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా. ఫ్లయిట్ ఎక్కించి మీ ఇంటికి వచ్చి మీ కుక్కలను చూసుకుంటా’ అని వాగ్దానం చేశాడు.
‘లవ్యూ బేబీ!’ అందామె! మర్నాడు అందంగా ముస్తాబైంది. ఎంతసేపు చూసినా అతగాడు రాలేదు. ఫ్లయిట్ మిస్సయింది. సంగీత కచేరీ మాటే లేకుండా పోయింది. ప్రేయసికి మండింది. ఆ కోపంలోనే కోర్టును ఆశ్రయించింది. ఆ అతివ గోడు విన్న న్యాయమూర్తి ఎత్తిపోయిన ఫ్లయిట్ కిరాయిలు, మర్నాడు కాన్సర్ట్‌కు వెళ్లడానికి అయ్యే విమాన ఖర్చులు, అతని కోసం బుక్ చేసిన ఫెర్రీ రైడ్ టికెట్ ఖర్చులు అన్నీ ప్రియుడు ఆమెకు చెల్లించాల్సిందిగా తీర్పు వెలువరించింది. అదే సమయంలో మాటల రూపంలో చేసిన వాగ్దానాన్ని భంగం చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకోలేమని వెల్లడించింది. అయితే, ఆ జంటపేరు మాత్రం గోప్యంగా ఉంచింది. మొత్తం మీద ఈ న్యూజిలాండ్ జంట అనుభవం.. అన్ని దేశాల ప్రేమికులకు ఒక పాఠం.