ఇంటీరియర్ డెకొరేషన్ విలాస వంతంగానే ఉండాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. దుస్తులు, కార్లు,కాస్మెటిక్స్లాగే వీటిలోనూ ‘ఇంపోర్టెడ్’ ముద్ర కోసం ఆరాటపడుతున్నారు. అలాంటి వారికోసం లగ్జరీ ఇంటీరియర్ వస్తువుల్ని అందించేందుకు ‘మైసన్ సియా’ పేరిట ఒక బ్రాండ్‌ను సృష్టించారు ముంబయికి చెందిన వ్రతిక అగర్వాల్. ఈ మధ్యే దాన్ని హైదరాబాద్‌కూ విస్తరించారు. ఫ్యాషన్ డిజైనర్‌గా పద్నాలుగేండ్లు పనిచేసిన తాను ఇంటీరియర్ డిజైనింగ్ వైపు ఎలా అడుగులు వేసిందీ ‘జిందగీ’తో పంచుకున్నారిలా…
మాది ఉత్తరప్రదేశ్. అక్కడి సహారన్పూర్లో నేను పెరిగాను. నాన్న వ్యాపారం చేసేవారు. అమ్మ పెండ్లికి ముందు పైలట్. తర్వాత ఇంటి బాధ్యతలు చూసుకునేది. నాన్నను చూస్తూ పెరిగాను కాబట్టి కస్టమర్లతో ఎలా వ్యవహరించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలన్నది సులభంగానే అర్థమైపోయింది. నాకు ఏ పనైనా సృజనాత్మకంగా చేయడం ఇష్టం. ఏ వ్యాపారానికైనా అదే అసలైన పెట్టుబడి. ఆ సృజనకు అధ్యయనం తోడుకావాలి. అందుకే, పెద్ద చదువుల కోసం ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీని ఎంచుకున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేశాను. ఢిల్లీలోనే కొన్ని ప్రసిద్ధ సంస్థలతో కలిసి పనిచేశాను. పెండ్లి తర్వాత ముంబై వచ్చాను. ఇక్కడ మనీశ్ మల్హోత్రా, రేణు టండన్, అంజు మోదీలాంటి బ్రాండ్లలో ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేశాను. తొలినుంచీ సొంతంగా ఒక బ్రాండ్ పెట్టాలన్న ఆలోచన ఉండేది. మా వారు నకుల్ అగర్వాల్‌ది కూడా వ్యాపార నేపథ్యమే. నేను సొంతంగా బిజినెస్ ప్రారంభిస్తానంటే ఆయన ప్రోత్సహించారు. నాకంటూ ఒక గుర్తింపు ఉండటం మంచిది అని చెప్పారు. దీంతో, 2012లో ‘టూ వైట్ బర్డ్స్’ పేరిట దుస్తుల బ్రాండ్ ఏర్పాటు చేశాను. ఇండియన్, వెస్ట్రన్ డిజైన్ల ఫ్యూజన్‌గా డ్రెస్‌లను డిజైన్ చేశాను. అలా మొత్తంగా 14 ఏండ్లు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో పనిచేశాను.
ఇలా పనిచేస్తూనే ముంబయిలోని మా కొత్త ఇంటి డిజైనింగ్ పనీ చూసేదాన్ని. మా కలల సౌధాన్ని అందంగా అలంకరించడానికి మంచి ఆర్ట్‌పీస్‌లు, హోమ్‌డెకార్ ఎక్కడ దొరుకుతాయా అని వెతికేదాన్ని. ఇటాలియన్, ఫ్రెంచ్, అమెరికన్… ఇలా ఒక్కో బ్రాండ్‌కు సంబంధించిన వస్తువు ఒక్కో చోట దొరికేది. కార్లు, కాస్మెటిక్స్, దుస్తులు భారత్‌లో దొరికినట్టుగా ఈ హోమ్డెకార్లను అమ్మే బ్రాండ్స్ నాకెక్కడా కనిపించలేదు. దీంతో నేను మా ఇంటిని డిజైన్ చేసుకోవడానికి ప్రపంచమంతా చుట్టాల్సి వచ్చింది. కానీ నాలాగే విలాసవంతమైన ఇంటి అలంకరణ సామగ్రిని ఇష్టపడేవాళ్లు ముంబైలో చాలామంది ఉన్నారు. వాళ్లకు కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో 2022లో ‘మై సన్ సియా’ స్థాపించాను. ఖరీదైన విదేశీ బ్రాండ్ల గృహాలంకరణ సామగ్రి అంతా మా స్టోర్స్‌లో అందుబాటులో ఉంటుంది. లేకపోయినా, ఆర్డర్ మీద తెప్పిస్తాను. పారిస్‌కు చెందిన కళాకారిణి కర్తిని థామస్, డచ్ డిజైనర్ మార్సెల్ వాండర్స్, ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ అతీనా జహాంతీలాంటి వాళ్లతోపాటు అనేక డిజైనింగ్ హౌస్‌లకు చెందిన కళారూపాలు ఉంటాయిక్కడ. హైదరాబాద్ నవాబుల నగరం. విలాసవంతుల చిరునామా. ఇక్కడి ప్రజల టేస్ట్ చాలా రిచ్. ఈ తరహా అలంకరణలను హైదరాబాదీలు ఇష్టపడతారని నేను దగ్గరనుంచి గమనించాను. అందుకే మా రెండో బ్రాంచ్ ఇక్కడే నెలకొల్పాం. త్వరలోనే కస్టమైజ్డ్ ఫర్నిచర్, ప్లేజోన్ల రంగంలో కూడా అడుగు పెడుతున్నాం. మరింత మందికి మా సేవలు అందించేందుకు ఇతర నగరాల్లోనూ స్టోర్లు తెరిచే ఆలోచనలో ఉన్నాం.
నాకు ముగ్గురు పిల్లలు. అందరూ ఐదేండ్ల లోపువాళ్లే. నా కెరీర్లో ఏదైనా సవాలు ఉందంటే వాళ్లను చూసుకుంటూ వ్యాపారం నిర్వహించడమే. మా అమ్మ తొలితరం పైలట్లలో ఒకరు. కానీ ఇంటి కోసం కెరీర్ వదిలేశారు. అలా కాకుండా ఇంటినీ కెరీర్‌నీ చూసుకుంటూ ముందుకెళ్లమని ఆమె ఎప్పుడూ నన్ను ప్రోత్సహిస్తారు. ఆడవాళ్లకు అమ్మతనం అన్నది వరమే కాదు, కెరీర్ పరంగా సవాలు కూడా. కానీ ఈతరం మహిళ రెండిటినీ సమన్వయం చేసుకోగలదు. రెండు బాధ్యతల్లోనూ విజయం సాధించగలదు. నేను అదే తోవలో ఉన్నాను.
-లక్ష్మీహరిత ఇంద్రగంటి