వాతావరణంలో ఏటికేడూ కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతున్నది. అయితే ఇది రక్తంలోనూ మార్పులకు కారణమవుతున్నదా… అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నది తాజా పరిశోధన. ఇందులో భాగంగా, అమెరికా ప్రజల రెండు దశాబ్దాల ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు, రక్తంలోని కొన్ని ముఖ్యమైన పదార్థాల స్థాయుల్లో కాలక్రమేణా మార్పులను గుర్తించారు. ఈ అధ్యయనాన్ని ఆస్ట్రేలియాలోని కిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కర్టిన్ విశ్వవిద్యాలయం, ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించారు. అమెరికా జాతీయ ఆరోగ్య-పోషకాహార పరీక్షల సమాచారాన్ని ఉపయోగించి, 1999 నుంచి 2020 వరకు ప్రతి రెండేండ్లకు సుమారు 7,000 మందికి రక్త పరీక్షలు నిర్వహించి సమాచారాన్ని విశ్లేషించారు. ఈ ఫలితాల్లో రక్తంలో బైకార్బొనేట్ స్థాయి పెరిగినట్టుగా గుర్తించారు.
1999తో పోలిస్తే 2019-20 నాటికి దాని సగటు స్థాయి సుమారు ఏడు శాతం పెరిగిందట. అదే సమయంలో రక్తంలోని క్యాల్షియం దాదాపు రెండు శాతం, ఫాస్ఫరస్ సుమారు ఏడు శాతం తగ్గినట్లు పరిశోధకులు లెక్కగట్టారు. ఈ మార్పులు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలతో సమాంతరంగా సాగినట్లు విశ్లేషణలో తేలింది. శరీరం రక్తంలోని ఆమ్ల-క్షార సమతుల్యతను చాలా జాగ్రత్తగా నియంత్రిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ పెరిగినప్పుడు దాన్ని సమతుల్యం చేయడంలో బైకార్బొనేట్ కీలక పాత్ర పోషిస్తుంది. పరిశోధకుల అంచనా ప్రకారం ప్రస్తుత ధోరణి ఇలాగే కొనసాగితే, రక్తంలోని బైకార్బొనేట్ స్థాయి కొన్ని దశాబ్దాల్లో ఆరోగ్యకరమైన వ్యక్తికి ఉండవలసిన దానిలో గరిష్ఠ పరిమితికి చేరువయ్యే అవకాశం ఉంది. అలాగే క్యాల్షియం, ఫాస్ఫరస్లు అతి తక్కువ స్థాయికి పడిపోయే ప్రమాదం కనిపిస్తున్నదట. కాబట్టి వాతావరణ మార్పు ప్రభావం ఉష్ణోగ్రతల్లోనే కాదు… శరీరంలోనూ ప్రతిబింబించే అవకాశం ఉందా? అన్న కొత్త ప్రశ్నను ఈ పరిశోధన మన ముందు ఉంచుతున్నది.