శ్లోకం నుంచి పుట్టిన శ్లోకం రామాయణమైంది. అదే శ్లోకం నుంచి పురుడుపోసుకున్న సామాజిక బాధ్యత ట్రస్ట్‌గా ఆవిర్భవించింది. ఓ తల్లి గుండెకోత.. ఎంతోమంది హృద్రోగులను మానవతతో ఆదుకున్నది. పదహారేండ్ల వయసులోనే నూరేండ్లు నిండిన శ్రీజ జ్ఞాపకార్థం ఫౌండేషన్‌ను స్థాపించి.. నలుగురి చిరునవ్వులలో కూతుర్ని చూసుకుంటున్నారు భారతీదేవి. ఆ తల్లి హృదయ స్పందన..
శ్రీజ.. నా బంగారు తల్లి! మనుషులంటే ప్రేమ. జీవులంటే కరుణ. ప్రకృతి పట్ల బాధ్యత. దేవుడంటే భక్తి. చదువుల్లో సరస్వతి. నృత్యంలో పార్వతీదేవి. మార్కుల్లో ఎప్పుడూ ఫస్టే. ఏ పోటీలో అయినా తనకు బహుమతి రావాల్సిందే. భవిష్యత్తులో చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని కలలుకనేది. నవంబరు పదమూడు.. తన పుట్టినరోజు. బహుమతులు, పార్టీలు, కానుకలకంటే.. అనాథ పిల్లల మధ్య గడపడానికే ఎక్కువ ఇష్టపడేది. ఆర్భాటాలు అస్సలు నచ్చేవి కాదు. బర్త్‌డే నాడు వృద్ధాశ్రమాలకు తప్పక వెళ్లేది. తనకు తోచిన బహుమతులు ఇచ్చేది. పంచుకోవడంలోని ఆనందం శ్రీజను చూస్తేనే అర్థమయ్యేది.
పదహారేండ్లు వచ్చే వరకు.. అంతా బాగానే ఉంది. ఆ తర్వాతే.. తరచూ అనారోగ్యాలు. ఒక్కసారిగా బలహీనపడింది. మునుపటి కళ తగ్గిపోయింది. పరధ్యానంగా కనిపించేది. ఎంతమంది వైద్యులకు చూపించినా ఫలితం లేదు. చివరికి బర్కిట్ లింఫోమా అనే అరుదైన రుగ్మతగా తేల్చారు. ఈ క్యాన్సర్ రోగ నిరోధక శక్తిని అందించే కణాలపై నేరుగా దాడి చేస్తుంది. పెద్దలతో పోలిస్తే.. పిల్లలకే ఈ క్యాన్సర్ ముప్పు ఎక్కువని వైద్యులు చెప్పారు. ఎంత నిర్దాక్షిణ్యమైన వ్యాధి! లక్షమందిలో ఒకరికి మాత్రమే సోకుతుందని అంటారు. ఆ లక్షలో మా శ్రీజ కూడా ఉంటుందని కలలోనూ ఊహించ లేదు. ఈ మహమ్మారికి ఎలాంటి చికిత్సలూ లేవని వైద్యులు తేల్చేశారు. ఆ ప్రాణాంతక పరిస్థితిలోనూ శ్రీజ నలుగురి గురించే ఆలోచించేది. తన మరణం మమ్మల్ని తీవ్రంగా కుంగదీసింది. ఆ బాధతోనే.. మా మామగారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. శ్రీజ భౌతికంగా లేకపోతేనేం..తన ఆశయాలు ఉన్నాయి. బిడ్డను ఎటూ కాపాడుకోలేక పోయాం. తన కలల్ని అయినా బతికించుకోవాలనే తపనతో ‘శ్రీజ హెల్పింగ్ హ్యాండ్స్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించాం.
ఊపిరి ఉన్నంతవరకూ నా బిడ్డ లక్ష్యం కోసమే పనిచేస్తాను. శ్రీజ ట్రస్ట్ వందలాది అభాగ్యులకు, పేదలకు బాసటగా నిలిచింది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్యసాయం చేసింది. ఆర్థికంగా అండగా నిలబడింది. నిత్యం ఎవరో ఒకరు మా అమ్మాయిని తలుచుకోవాలనేది మా ఆశ. అందుకే, సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేస్తున్నాం. తెలుగు రాష్ర్టాలతో పాటు బెంగళూరు, ఢిల్లీలోనూ ఆపన్నులకు అండగా నిలుస్తున్నాం. ఎవరి నుంచి అయినా సాయం కోసం అభ్యర్థన రాగానే.. సమీపంలోని సభ్యులు అక్కడికి చేరుకొని పరిస్థితులను అంచనా వేస్తారు. సమస్య పరిష్కారానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో బేరీజు వేస్తారు. ఆ తర్వాత, ఇతర సభ్యులకు సమాచారం అందిస్తారు. వీలైనంత త్వరగా.. అవసరమైన సొమ్ము అర్హులకు చేరవేసే ఏర్పాట్లు జరిగిపోతాయి. చిన్నారుల వైద్యం కోసం లక్షలాది రూపాయలు అందించిన సంఘటనలు అనేకం. ఆ బిడ్డల బోసి నవ్వులలో మా శ్రీజను చూసుకుంటాం. ఇటీవలే బసవతారకం దవాఖానలో లుకేమియా వ్యాధికి చికిత్స పొందుతున్న ఓ చిన్నారికి రూ. లక్షన్నర అందించాం. కొవిడ్ సమయంలో ఫుట్‌పాత్‌లపై జీవించే అనాథలకు దుప్పట్లు, ఆహారం పంచాం. వేసవిలో వాహనదారులు, శ్రామికుల దప్పిక తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. ఒక్కో కేంద్రం నుంచి 15 వందల గ్లాసుల మజ్జిగ పంపిణీ చేశాం. క్యాన్సర్ తీవ్రమైన వ్యాధే. కానీ, తొలి దశలో గుర్తిస్తే చికిత్స సాధ్యమే. వైద్యం తర్వాత సాధారణ జీవితం గడిపేయవచ్చు. అందుకే క్యాన్సర్ లక్షణాలు, చికిత్స, జీవనశైలి మార్పులు..
చేయాలనే సంకల్పంతో నిష్ణాతులైన వైద్యుల బృందంతో కార్పొరేట్ సంస్థల ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. ఆ శిబిరాలకు హాజరైన తర్వాత.. ఎంతోమంది
ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఇది మాకు ఎంతో తృప్తిని కలిగిస్తున్న విషయం. మా ఆయన వై.ఎస్.ఎన్ మూర్తి ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగి. ఆయన సహకారం, ప్రోత్సాహం మరువలేనివి. శ్రీజ ట్రస్టు ద్వారా సాయం పొందాలనుకునేవారు 9177666554, 8247583228 నెంబర్లలో సంప్రదించవచ్చు. మా వంతు ఆసరా తప్పక అందిస్తాం. మా ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏదో ఓ రూపంలో సహకరించడానికి ముందు కొచ్చే దాతలకు కూడా సాదర స్వాగతం.
-కేసాని నరసింహారావు
-భాస్కర్