బస్తీ దవాఖాన నుంచి కార్పొరేట్ హాస్పిటల్ వరకు.. వైద్య సేవల కోసం రోగులు రావడం కామన్. వారివెంట ఒకరో ఇద్దరో సహాయకులు ఉండటం పరిపాటి! తమ వంతు వచ్చేదాకా చాలామంది సెల్ఫోన్లో మునిగిపోతున్నారు. రోగి పేరు నాలుగైదుసార్లు పిలిచే వరకూ స్పందించనంతగా అందులో లీనమైపోతున్నారు. కానీ, వంగరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన రోగులు, వారివెంట ఉన్న సహాయకుల చేతుల్లో సెల్ఫోన్లు ఉండవు. ఆరోగ్య సూత్రాలు వివరించే పుస్తకాలు దర్శనమిస్తాయి. ఇందుకు కారణం డాక్టర్ రుబీనా. ఆస్పత్రిని మినీ లైబ్రరీగా మార్చింది. రోగులకు మెరుగైన చికిత్స అందిస్తూనే, దవాఖానలో అడుగుపెట్టిన వారిలో పఠనాసక్తిని పెంచుతున్నది.
ఏడాదిన్నర కిందట హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీలో వైద్యురాలిగా చేరింది రుబీనా. ఆమె వచ్చేనాటికి పీహెచ్సీ పరిస్థితి అంత ఆరోగ్యకరంగా ఏం లేదు. ఎప్పుడో గానీ రోగులు వచ్చేవాళ్లు కాదు. ప్రత్యేక ప్రణాళికతో ప్రజల్లో పీహెచ్‌సీపై నమ్మకాన్ని కలిగించింది రుబీనా. రోగులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది. అప్పుడు మరో సమస్య రుబీనా దృష్టికి వచ్చింది. రోగులు, వారి వెంట వచ్చిన సహాయకులు సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయడం గమనించింది.
వెయిటింగ్ హాల్లో సెల్ఫోన్ల మోత ఆమెకు చికాకు తెప్పించింది. ఈ ధోరణి వల్ల రోగులు, అక్కడి సిబ్బంది ఇబ్బందిపడుతుండే వాళ్లు. దీనికి పరిష్కారంగా పీహెచ్‌సీని మినీ లైబ్రరీగా మార్చేసింది రుబీనా. ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన తెలుగు పుస్తకాలను దవాఖాన వెయిటింగ్ హాల్లో పెట్టించింది.
‘ఆస్పత్రిలో ఫోన్ వాడరాదు’ అని షరతు విధించింది. ఈ నిషేధంపై తొలుత పెదవి విరిచిన రోగుల సహాయకులు కొన్ని రోజులకు ఆ పుస్తకాలు చదవడం మొదలుపెట్టారు.
పల్లెవాసుల్లో వచ్చిన మార్పును మరింత కొనసాగించేలా ప్రోత్సహించాలని భావించింది రుబీనా! తన సొంత డబ్బులతో ఆరోగ్య సూత్రాలు తెలియపరిచే ఎనభై పుస్తకాలు కొనుగోలు చేసి, దవాఖాన లైబ్రరీలో పెట్టించింది. దాంతో నిత్యం వచ్చే రోగులు వారి సహాయకులు అక్కడ ఉన్నంత సమయం ఏదో ఒకటి చదవడం అలవాటుగా మార్చుకున్నారు. ఏమైనా సందేహాలు వస్తే.. డాక్టర్ని అడిగి తెలుసుకుంటున్నారు. యోగ, ఆహార నియమాలకు సంబంధించిన విషయాలు తెలుసుకొని, వాటిని అమలు చేస్తుండటం విశేషం. ప్రధానంగా మహిళలు, బాలికలు సరైన సమయంలో నెలసరి రాక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వారికి వైద్యంతోపాటు యోగాసనాలకు చెందిన పుస్తకం చదవమని ప్రోత్సహిస్తుంది రుబీనా. తేలికైన ఆసనాలు సాధన చేయడం ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యను అధిగమిస్తున్నారు రోగులు. ఇప్పుడు వంగర పీహెచ్సీలో సెల్‌ఫోన్ మోతలు వినిపించవు. అక్కడంతా పిన్‌డ్రాప్ సైలెన్స్ వాతావరణం ఉంటుంది. అందరి కళ్లూ ఏదో చదువుతూ ఉంటాయి. వైద్యురాలిగా మెరుగైన సేవలు అందిస్తున్న రుబీనా.. తనవంతుగా సామాజిక బాధ్యతనూ నిర్వర్తిస్తూ అందరి మన్ననలూ అందుకుంటున్నది.
విధుల్లో చేరిన కొత్తలో అక్కడ విచిత్రమైన పరిస్థితులను గమనించింది రుబీనా. ఆస్పత్రికి రోగులు రావడమే గగనంగా కనిపించింది. ఒకవేళ ఒకరిద్దరు వచ్చినా.. మళ్లీ చెకప్ కోసం రమ్మన్న రోజు వాళ్లు రాకపోవడం గుర్తించింది. సాధారణంగా సర్కారు దవాఖానలపై ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయం నెలకొని ఉండటమే ఇందుకు కారణం. అక్కడ మందులు ఉండవనీ, సరైన వైద్యం అందించరనే అపోహ చాలామందిలో ఉంది. ఇందుకు వంగర ప్రజలూ మినహాయింపు కాదు! ఆస్పత్రికి రోగులు అరకొరగా వస్తుంటే.. ఊళ్లో అందరూ ఆరోగ్యంగా జీవిస్తున్నారేమో అనుకుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపించాయి. చాలామంది మహిళలు తమ అనారోగ్య సమస్యలు బయటపెట్టడానికే జంకుతున్నట్టుగా తెలిసింది. డయాబెటిస్ ఉన్నా.. పరీక్ష చేయించుకోవడానికి చాలామంది ముందుకు రావడం లేదని అర్థమైంది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఇంటింటికీ వెళ్లి అందరినీ పలకరించింది రుబీనా. అవసరమైన వారికి పరీక్షలు చేయించి, తగిన చికిత్స అందించింది. రుబీనా వైద్యంపై గురి కుదరడంతో క్రమంగా పీహెచ్‌సీకి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒంట్లో ఏమాత్రం నలతగా అనిపించినా ఈ డాక్టరమ్మ దగ్గరికి వెళ్తున్నారంతా! అలా పీహెచ్‌సీకి వచ్చిన రోగులను, వారి సహాయకులను సెల్‌ఫోన్ ఉచ్చు నుంచి బయటపడేసేందుకు దవాఖానను పుస్తకాలయంగా మార్చిందామె!!
వైద్యంతోపాటు హెల్త్ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్న రుబీనా… మరిన్ని పుస్తకాలు సేకరించే పనిలో ఉంది. తనకు వచ్చే జీతభత్యాలతోనే పుస్తకాలు కొనుగోలు చేస్తూ… రోగులకు అందుబాటులో ఉంచుతున్నది. భవిష్యత్తులో గైనకాలజిస్ట్‌గా తల్లీబిడ్డలకు రక్షణగా నిలవాలన్నదే తన లక్ష్యం అంటున్నది.
రుబీనా బాల్యమంతా ఆదిలాబాద్‌లోనే సాగింది. చిన్నప్పటి నుంచి వైద్యురాలు కావాలని కలలు కనేది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉద్యోగులుగా పనిచేసేవారు. అక్కడి పేద విద్యార్థుల్లో చాలామంది రక్తహీనతతో బాధపడేవారు. తరచూ జ్వరాలకు గురవుతూ ఉండేవారు. వారిని చూస్తూ పెరిగింది రుబీనా. ఆ పిల్లల పరిస్థితి చూసి ‘నాకు మరో జన్మంటూ ఉంటే ఇలాంటి పిల్లల కోసం డాక్టర్ అవుతా’ అన్న తల్లి మాటలు చిన్నారి రుబీనా మనసులో బలంగా నాటుకున్నాయి. ఆ పట్టుదలతోనే ఖమ్మంలో మెడిసిన్ పూర్తి చేసింది. తర్వాత కొన్నాళ్లు కాంట్రాక్టు డాక్టర్‌గా సేవలు అందించింది. ఏడాదిన్నర కిందట వంగర పీహెచ్సీలో వైద్యురాలిగా అడుగుపెట్టి ఈ అద్భుతాలన్నీ చేసింది. ఈ క్రమంలో ఆమె భర్త డాక్టర్ రెహమాన్ సహకారం ఎంతో ఉందని చెబుతుంది రుబీనా. ఈ దంపతులు వంగర పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లోని పిల్లల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ చిన్నారుల రక్షనకు పాటుపడుతుండటం మరో విశేషం.
– రాజు పిల్లనగోయిన