మన పిల్లల బాల్యం.. మనకు చిన్నా పెద్దా తీపి జ్ఞాపకాల సమాహారం. పాప నవ్వితే సంబురం. బాబు బుడిబుడి అడుగులేస్తే ఆనందం. ఇద్దరూ ముద్దుముద్దు మాటలు మాట్లాడితే పండుగే. కృష్ణాష్టమి, సంక్రాంతి, దసరా.. ఇలా ప్రతి ప్రత్యేక సందర్భంలోనూ పిల్లల్ని కొత్తకొత్తగా అలంకరించి మురిసిపోతారు తల్లిదండ్రులు. ఆ ఆనందోత్సాహాల్ని రెట్టింపు చేస్తామంటున్నారు ‘ఫరెవర్ కిడ్స్’ వ్యవస్థాపకురాలు శీతల్ ఠాకూర్. నొయిడాకు చెందిన ఈ మేనేజ్మెంట్ పట్టభద్రురాలు తన కలను నిజం చేసుకోవడానికి కార్పొరేట్ కెరీర్‌ను వదులుకున్నారు.
తన కూతురి పుట్టినరోజు కోసం మంచి డ్రెస్ కొందామని వెళ్లినప్పుడు.. తీవ్ర నిరాశ ఎదురైంది శీతల్‌కు. ఎక్కడ చూసినా అవే దుస్తులు, అవే డిజైన్లు. దీంతో అమ్మల తరఫున పిల్లల ముస్తాబు బాధ్యత తానే తీసుకున్నారు. ఫరెవర్ కిడ్స్ వెబ్సైట్లో రకరకాల డిజైనర్ డ్రెస్‌లను అందుబాటులోకి తెచ్చారు. పుట్టినరోజు, స్కూల్ యానివర్సరీ, గ్రాడ్యుయేషన్ డే, జన్మాష్టమి, క్రిస్మస్.. ఇలా థీమ్ బేస్డ్ దుస్తులూ ఉన్నాయి. స్టార్టప్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చినా.. ఇదంతా శీతల్ కష్టమే. నయాపైసా కూడా అప్పు చేయలేదు. ఏ ఏంజెల్ ఇన్వెస్టర్లనూ ఆశ్రయించలేదు. ‘ఓ అమ్మగా కన్నవారికి కమ్మని జ్ఞాపకాలను అందించడమే నా వ్యాపారం’ అంటారామె.