సు ఫ్రమ్ సో
జియో హాట్‌స్టార్: స్ట్రీమింగ్ అవుతున్నది.
తారాగణం: షనీల్ గౌతమ్, జేపీ తుమినాడ్, రాజ్ బీ శెట్టి, సంధ్య అరాకెరె, ప్రకాశ్ తుమినాడ్ తదితరులు
దర్శకత్వం: జేపీ తుమినాడ్
పల్లె నిండా సహజంగా కనిపించే స్వభావాలను ఆవిష్కరిస్తూ, దర్శకుడు జేపీ తుమినాడ్ తెరకెక్కించిన కన్నడ చిత్రం.. సు ఫ్రమ్ సో. తక్కువ బడ్జెట్లో నిర్మితమైన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకున్నది. తాజాగా, జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్కు వచ్చింది. కర్ణాటక ధర్మస్థలి సమీపంలోని ఓ మారుమూల పల్లెలో జరిగే కథ ఇది. ఆ ఊరివాళ్లకు మూఢ నమ్మకాలు ఎక్కువ. ఊరి పెద్ద రవీంద్ర (షానీల్ గౌతమ్) చాలా మంచివాడు, ధైర్యవంతుడు. ఊళ్లో జరిగే ప్రతి కార్యక్రమంలో ముందుంటాడు. ఈ క్రమంలో పెత్తనం, పెద్దరికం తమకు దక్కకుండా చేస్తున్నాడని.. ఊళ్లోని కొందరు రవీంద్రపై అసూయ పడుతుంటారు.
అదే ఊళ్లో అశోక్ (జేపీ తుమినాడ్) నివసిస్తుంటాడు. పట్నంలో చదువుకుంటూ ఆ ఊరికి వచ్చిన ఓ యువతిపై మనసు పడతాడు. ఒకరోజు ఆమె స్నానాల గదిలో ఉన్నప్పుడు రహస్యంగా చూడటానికి ప్రయత్నిస్తాడు. అటుగా వచ్చినవారు గమనించడంతో.. తనకు దయ్యం పట్టినట్టుగా ప్రవర్తించి, తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. దాంతో, అతనికి నిజంగానే దయ్యం పట్టిందని ఊరివాళ్లంతా నమ్ముతారు. అశోక్‌ను గదిలో బంధించి.. దయ్యాన్ని వదిలించడం కోసం మాంత్రికుడైన గురూజీ (రాజ్ బీ శెట్టి)ని పిలిపిస్తారు. ఆ గురూజీ ఊళ్లోకి అడుగుపెట్టిన తరువాత అక్కడ ఏం జరుగుతుంది? అశోక్ దయ్యం పట్టినట్లు ప్రవర్తించడం వల్ల ఊరంతా ఎలా ఇబ్బంది పడుతుంది? ఈ క్రమంలో అశోక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.