‘ఓ స్త్రీ రేపు రా!’ ఎప్పటి మాటో. మళ్లీ వినిపిస్తున్నది. నిన్నమొన్నటి దాకా సినిమా థియేటర్లలో కాసులు కురిపించిందీ స్త్రీ. ఇప్పుడు ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నదీ స్త్రీ. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ‘స్త్రీ2’ సంగతే ఇదంతా! నవ్వులు పంచుతూ, భయాన్ని రేకెత్తించిన ఈ చిత్రంలో ఇంకా ఏదో ఉంది. ఏదో సందేశం దాగుంది.
1980 దశకం చివర్లో దేశాన్నంతా ఊపేసిన వాక్యం ‘ఓ స్త్రీ రేపు రా!’ ఏ ఇంటి తలుపు మీద చూసినా బొగ్గుతో రాసిన ఈ అక్షరాలే! ఏ వీధి మలుపులో చూసినా తాటికాయంత అక్షరాల్లో ఈ మాటలే!! కొన్ని నెలల పాటూ ఏ స్త్రీలు కలిసినా.. ఆ స్త్రీ గురించే కబుర్లు. ఏ పురుషులు మాట్లాడుకున్నా.. ఆ స్త్రీ ఎలా ఉంటుందన్న చర్చలే! మీడియా అంతగా లేని రోజుల్లో, సోషల్ మీడియా ఉనికి కూడా తెలియని సమయంలో.. ఈ నాలుగు ముక్కలు ఊరూరా తెగ వైరల్ అయ్యాయి. ఎవరో స్త్రీమూర్తి భయానక రూపంతో, అర్ధరాత్రి వచ్చి పిల్లలను ఎత్తుకుపోతుందని కొందరి భయం. ఏ అపరాత్రో తలుపు తట్టి.. పురుషులను ఎగురేసుకుపోతుందని మరికొందరి అనుమానం. అంధ విశ్వాసంతో తలుపు మీద ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాస్తే.. వచ్చిన పెనుభూతం అది చదివి వెనక్కి వెళ్లిపోతుందని మూఢంగా నమ్మారు జనం. సదరు స్త్రీ తమ వీధికి వచ్చిందనీ, తమ ఇంటికే వచ్చిందనీ పుకార్లూ పుట్టించారు కొందరు. కొన్నాళ్లకు గానీ అదంతా ట్రాష్ అని జనాలకు అర్థం కాలేదు. కానీ, ఈ ఉదంతమంతా నోస్టాలజీ జ్ఞాపకంగా మిగిలిపోయింది.
2018లో.. మళ్లీ ‘ఓ స్త్రీ రేపు రా’ అని వినిపించింది. రియల్ లైఫ్‌లో కాదు. రీల్ దునియాలో. అమర్ కౌశిక్ దర్శకత్వంలో విడుదలైన ‘స్త్రీ’ సినిమా విడుదలతో ఈ మాటలు మళ్లీ వైరల్ అయ్యాయి. చందేరీ గ్రామం కథ ఇది. అదే ఊరికి చెందిన ఓ స్త్రీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం దెయ్యంగా మారుతుంది. మగవారిపై పగబడుతుంది. ఏ పండుగ వచ్చినా ఓ ఇంటి నుంచి పురుషుణ్ని ఎత్తుకొని పోతుంటుంది. ఆ దెయ్యానికి భయపడిన గ్రామస్తులు తమ ఇంటి గోడపై ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాస్తారు. తమ గ్రామాన్ని కాపాడటానికి విక్కీ (రాజ్‌కుమార్ రావు) ఏం చేశాడన్నది మిగిలిన కథ. సుమారు పాతిక కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం నవ్వుల కిక్కు పంచింది. భయాన్ని రుచి చూపించింది. బాక్సాఫీస్ దగ్గర రూ.180 కోట్లు కొల్లగొట్టింది.
సర్కట భయంతో.. గ్రామంలోని మహిళలు ఎవరూ గడప దాటొద్దనీ, కట్టుబాట్లు కచ్చితంగా పాటించాలనీ, మోడ్రన్‌గా కనిపించొద్దనీ ఊరు పెద్దలు తీర్మానం చేస్తారు. ఆ దెయ్యం ప్రలోబానికి గురైన పురుషులు ఆడవాళ్లను ఇండ్లలో పెట్టి తాళం వేస్తారు. ఇది ఇలాగే కొనసాగితే.. ఇప్పుడిప్పుడే స్వతంత్రంగా బతుకుతున్న స్త్రీ జాతి మళ్లీ వంటింటికే పరిమితం అవుతుందని విక్కీ బృందం నమ్ముతుంది. సర్కట రంగప్రవేశంతో చెదిరిపోయిన చందేరీని తిరిగి గాడిన పెట్టాలని భావిస్తుంది. ఒకప్పుడు తమను భయభ్రాంతులకు గురిచేసిన ‘స్త్రీ’కి మళ్లీ ఆహ్వానం పలకాలని నిర్ణయిస్తుంది. చందేరీ పురాణం ప్రకారం విక్కీని గ్రామ రక్షకుడిగా భావిస్తారంతా! మొండెం నుంచి తలను వేరు చేసుకొని వికృత విన్యాసాలు, భయానక చర్యలకు పాల్పడే సర్కటను ఎదిరించడం తన వల్ల కాదంటాడు విక్కీ. కానీ, తను ప్రేమిస్తున్న యువతి ప్రేరణతో యుద్ధానికి సిద్ధమవుతాడు.
సర్కట ఉండే పాడుబడ్డ గుహకు వెళ్తారు.. లోనికి వెళ్లాలంటే సగం పురుష, సగం స్త్రీ శరీరంతో ఉన్నవారికే సాధ్యమని చందేరీ పురాణంలో ఉంటుంది. విక్కీ దేహంలోకి యువతి ప్రవేశిస్తుంది. అలా విక్కీ గుహలోపలికి వెళ్తాడు. రియాలిటీకి దూరంగా అనిపించినా.. ఏ కార్యమైనా ఆడ, మగ ఇద్దరూ కలిసి చేస్తేనే విజయవంతం అవుతుందని ఈ సన్నివేశం చెబుతుంది. సర్కటను ఎదిరించడానికి విక్కీ శక్తి చాలదు. అప్పుడు స్త్రీ వచ్చి ఆ దుష్టశక్తిని అంతం చేస్తుంది. అదే సమయంలో ఇండ్లల్లో బందీలుగా ఉన్న మహిళలంతా కదం తొక్కాలని నిర్ణయించుకుంటారు. మూకుమ్ముడిగా తలుపులు పగులగొట్టుకొని బయటికి వస్తారు. సర్కట మరణంతో చందేరీలోని పురుషుల కండ్లకు కమ్ముకున్న పొరలు తొలిగిపోతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమేనని అందరూ నిశ్చయానికి వస్తారు.
2024.. ఇప్పుడు ‘స్త్రీ2’ విడుదలైంది. చూస్తుండగానే రూ.875 కోట్లు వసూలు చేసింది. మొదటి ‘స్త్రీ’ కథ ప్రతీకారం చుట్టూ తిరిగింది. ఈ రెండో స్త్రీ కథ కూడా అలాంటిదే! కాకపోతే, ఇందులో దర్శకుడు అమర్ కౌశిక్ అంతర్లీనంగా చక్కని సందేశాన్ని ఇచ్చాడు. కథలోకి వెళ్తే… ‘స్త్రీ’ సమస్య తొలిగిపోయిందని చందేరీ ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తుంటారు. అంతలో వాళ్లకు మరో విపత్తు ఎదురవుతుంది. ఇప్పుడు వచ్చిన ముప్పు పేరు ‘సర్కట’. గతంలో స్త్రీ పురుషులను టార్గెట్ చేస్తే.. ఈ సర్కట (పురుష దెయ్యం) స్త్రీలను లక్ష్యంగా ఎంచుకుంటాడు. కట్టూబొట్టూ, ఆచార వ్యవహారాల్లో సంప్రదాయాలు పాటించని మోడ్రన్ అమ్మాయిలే సర్కట లక్ష్యం. ఈ ఉపద్రవాన్ని విక్కీ, యువతి (శ్రద్ధాకపూర్), రుద్ర (పంకజ్ త్రిపాఠి) వారి స్నేహితులు ఎలా ఎదుర్కొన్నారన్నది మిగిలిన కథ.
సినిమా కథ ఇంతే! కానీ, అది చెప్పిన సత్యం ఎంతో ఉంది. అందరి జీవితాల్లోకి ప్రవేశించిన ఆధునికతకు మహిళలు ఎందుకు దూరంగా ఉండాలి? కట్టుబాట్లు వారికే ఎందుకు? స్మార్ట్‌ఫోన్ పట్టుకున్నంత మాత్రాన అతివ చెడ్డది అవుతుందా? నచ్చిన దుస్తులు వేసుకున్నంత మాత్రాన దుష్టురాలు అవుతుందా? ఉన్నతంగా చదువుకున్నంత మాత్రాన మహిళలు మారిపోతారా? ఆచారాల పేరుతో స్త్రీజాతిని అణచివేయొద్దని ‘స్త్రీ2’ హిట్టుకొట్టి మరీ చాటి చెప్పింది. చాలామంది స్త్రీ2 చూస్తూ విక్కీ, అతని స్నేహితులు చేసిన హంగామాకు నవ్వుతున్నారు. సర్కట విన్యాసాలకు భయపడుతున్నారు. విక్కీ, యువతి ఆరాటాన్ని, రుద్ర పోరాటాన్ని కూడా అర్థం చేసుకుంటే.. ఈ సినిమా గొప్ప పాఠం అనిపిస్తుంది.