పూణె ఆమె పుట్టిన ఊరు నేహా నర్ఖెడే ఆమె పేరు 39 ఏళ్లు ఆమె వయసు 4900 కోట్ల రూపాయలు ఆమె సంపద..
సొంత కష్టంతో ఎదిగిన అత్యంత సంపన్న భారతీయ మహిళల్లో 5వ స్థానం ఆమెది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె తర్వాతి కాలంలో 93 వేల కోట్ల రూపాయల విలువగల సంస్థను నిర్మించింది. అందుకే, ఆంత్రప్రెన్యూర్లకు ఆమెజీవితం ఓ స్ఫూర్తి పాఠం. తనకు మాత్రం ఉన్నతమైన మహిళల జీవితాలను పరిచయం చేసినతన తండ్రే స్ఫూర్తి ప్రదాత అని చెప్పే ‘నేహా నర్ఖెడే’ గురించి ఆసక్తికర సంగతులు.
నేహా పూణెలో పుట్టి పెరిగింది. వాళ్ల నాన్న ఆమెకు ఎప్పుడూ పుస్తకాలను కానుకలుగా ఇస్తూ ఉండేవారు. సావిత్రీబాయి పూలే, ఇందిరాగాంధీ, సరోజినీ నాయుడు, ఇంద్రానూయి వంటి మహిళల జీవిత చరిత్రలెన్నింటినో ఆమె చదివింది. వాటి ద్వారా తనకూ పెద్ద కలలను కనాలన్న ఆలోచనలు కలిగాయి. వాటిని తాను నెరవేర్చుకోగలనన్న ఆశ, ధైర్యం కూడా ఏర్పడ్డాయి. చిన్నప్పటి నుంచి బాగా చదివే ఆమె అమెరికాలో కూడా ప్రతిభ కనబరిచింది. అలా జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మంచి మార్కులతో ఎం.ఎస్. (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసింది.
చదువు పూర్తయిన వెంటనే ఒరాకిల్ సంస్థలో ఉద్యోగిగా చేరింది నేహ. అక్కడ రెండేళ్లపాటు పని చేసింది. తక్కువ కాలంలోనే అపారమైన అనుభవం గడించింది. ఆ తర్వాత లింక్డ్ ఇన్ సంస్థకి మారి అందులోనూ తన మార్కు చూపించింది. పనిలో ప్రతిభను కనబరిచింది. అంకితభావంతో పని చేసి, మెరుగైన ఫలితాలు సాధించిన ఆమె సహజంగానే యాజమాన్యం దృష్టిని ఆకర్షించింది. దాంతో కొద్దికాలంలోనే సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ హోదాల్లోకి వచ్చింది.
ఈ అనుభవాల నుంచి సవాళ్లను అధిగమించడం, కొత్త సమస్యలకు పరిష్కారాలు చూపడంలాంటి నిర్వహణా నైపుణ్యాలు సాధించింది. అయితే గుర్తింపు వచ్చింది కదా అని అదే సంస్థలో పనిచేసి ఉద్యోగిగానే మరిన్ని మెట్లు ఎక్కాలని ఆమె అనుకోలేదు. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకోవాలని ఆరాట పడింది. అందుకు తానే ఓ సంస్థను ప్రారంభించడం మంచి మార్గమని భావించింది. సాహసమే అయినా అసాధ్యం మాత్రం కాదు.. అన్న నమ్మకంతో ఇద్దరు సహోద్యోగులతో కలిసి ధైర్యంగా ముందడుగేసింది. అలా 2014లో స్టార్టప్‌గా ప్రారంభమైందే ‘కాన్ఫ్లుయెంట్’ సాఫ్ట్వేర్ సంస్థ. ప్రస్తుతం దీని విలువ 93,700 కోట్ల రూపాయలకు పైమాటే!
కాన్ఫ్లూయెంట్ని మొదలు పెట్టినప్పుడు చీఫ్ టెక్నికల్ ప్రొడక్ట్ ఆఫీసర్ (సీటీపీఓ)గా బాధ్యతలు చేపట్టింది నేహ. రియల్ టైమ్ డాటా స్ట్రీమింగ్‌లో కాన్ఫ్లుయెంట్ ఓ విప్లవం తీసుకొచ్చింది. ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ప్రముఖమైన కంపెనీగా ఎదిగింది. అయితే కాన్ఫ్లూయెంట్ ప్రస్థానం అంతా సాఫీగా సాగలేదు. మార్కెట్లో వచ్చే అనూహ్యమైన మార్పుల వల్ల తీవ్ర ఒడుదొడుకులకు గురైంది. 2022 సంవత్సరంలో కంపెనీ విలువ అనూహ్యంగా పడిపోయింది. పది బిలియన్ డాలర్ల సంపదను చేరుకున్న దాని విలువ సగానికి పైగా పడిపోయిందని ఆర్థిక సేవల సంస్థ హురూన్ లెక్కగట్టింది.
ఆ ఏడాదిలో 8,600 కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని చవి చూసింది. అయినా సరే సవాళ్లను ఎదుర్కొంటూ, ధైర్యంగా ఆవిష్కరణలు చేస్తూ ఆ బృందం ముందుకు వెళ్లింది. కంపెనీ మళ్లీ పుంజుకుంది. కంపెనీలో నేహాకు 6 శాతం వాటా ఉంది. ప్రస్తుతం ఆమె సంపద విలువ 4,900 కోట్ల రూపాయలు. 37 ఏళ్ల వయసులో ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ ఇండియా రిచ్ లిస్ట్‌లో నేహా స్థానం పొందింది. వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు లేకుండా స్వీయార్జితం ద్వారా ఎదిగిన అమెరికాలోని 100 మంది సంపన్న మహిళల్లో 50వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కూడా ఫోర్బ్స్లాంటి ప్రఖ్యాత పత్రికల సంపన్నుల జాబితాలో ప్రతి ఏడాదీ చోటు సంపాదిస్తూనే ఉంది.
అలా అత్యంత ప్రతిభావంతమైన భారతీయ మహిళగా ప్రపంచ గుర్తింపు పొందింది. సాధారణ ఉద్యోగి నుంచి కెరీర్ మొదలుపెట్టి తక్కువ కాలంలో ఎక్కువ విజయాలు సాధించిన ఆమె ప్రపంచంలోని ఆంత్రప్రెన్యూర్లకు ఆదర్శంగా నిలిచింది. నేహా ప్రస్తుతం కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో పట్టణంలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం భర్త సచిన్ కులకర్ణితో కలిసి ఆస్కిలార్ అనే ఆన్లైన్లో జరిగే మోసాలను గుర్తించే సంస్థను ప్రారంభించింది. దీని పూర్తి నిర్వహణ భారం తనపై పడటంతో కాన్ఫ్లూయెంట్లో కీలకమైన బాధ్యతల నుంచి తప్పుకొంది. ఆస్కిలార్ సీఈఓగానూ తనదైన ముద్ర వేస్తున్న నేహ సొంత కష్టం మీద ఎదగాలనుకునే వారికి ఓ ఆశా కిరణం!
తన విజయ రహస్యం తెలుసుకోవాలనుకునే వారి కోసం నేహా తన అనుభవాలు పంచుకుంటూ.. ‘పెద్దగా ఎదగాలనే కోరికను చిన్న వయసులోనే నా మనసులో నాటుకునేలా చేశారు మా నాన్న. ఆయన ఇచ్చిన జీవిత చరిత్రలు చదివిన తర్వాత నా ఆలోచనా దృక్ఫథమే మారిపోయింది. జీవితంలో గెలవాలంటే మొదట లక్ష్యంపై స్పష్టత ఉండాలి. దానిపైనే ధ్యాస ఉండాలి. నిద్రాహారాలు మానుకునైనా పని పూర్తి చేసే ఓపిక ఉండాలి. పోటీ ప్రపంచంలో ఏ రంగంలో పనిచేసినా అందులో మీ ముద్ర ఉండాలి… అని చెబుతూ ఉంటుంది.
అమెరికాలో చదువుకుని, అక్కడే ఉద్యోగం సంపాదించాలని వెళ్లింది నేహా అనే అమ్మాయి. మొదట పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరింది. కొద్ది కాలానికే పెద్ద కొలువు దక్కింది. అది కూడా ఆమెకు సంతృప్తినివ్వలేదు. టెక్ దిగ్గజాలకు సవాల్ విసురుతూ తానే ఓ కంపెనీ ప్రారంభించింది. పదేళ్లు తిరిగే సరికి స్వీయార్జనతో ఎదిగిన భారతీయ మహిళల్లో అత్యంత సంపన్నురాలిగా రికార్డులకెక్కింది. ఇప్పుడు.. ఆమె సంపద విలువ 4900 కోట్ల రూపాయలు!