భారీ తారాగణం ఎంతున్నా.. సినిమాకు కెప్టెన్ అంటే డైరెక్టరే! ఆయన యాక్షన్ అనగానే నటించాలి. కట్ అనగానే ఆపేయాలి. ఎలా చెప్తే హీరోలు అలా వినాల్సిందే! ‘షాట్ ఒకే!!’ అనే వరకూ ‘వన్ మోర్!!’ చేయాల్సిందే!! మరి ఆయనకు ఆయనే యాక్షన్ అనుకుంటే! టేకింగ్ అదిరిపోతుందంతే!! అలా ఎందరో
హీరోలు దర్శకులుగా అవతారమెత్తి.. ప్రేక్షకులకు వినోదం పంచారు. స్వీయ దర్శకత్వంలో అద్భుతాలు సృష్టించారు. స్టార్ హీరోలుగా, టాప్ డైరెక్టర్లుగా పేరొంది.. ఈ తరం దర్శకులకు టార్చ్ బేరర్స్‌గా నిలిచారు!!
‘నా సినిమాల్లో స్క్రీన్ ప్లే అలా ఉండటానికి కారణం ఆయనే! ‘ఓం’, ‘A’, ‘ఉపేంద్ర’ చిత్రాలతోనే నేను వైవిధ్యమైన స్క్రీన్ ప్లే నేర్చుకున్నాను. నేను ఆ విషయాన్ని ఉపేంద్ర గారి నుంచి దొంగిలించాను కాదు, తస్కరించాను! నేను సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడే యాక్షన్ కింగ్ అర్జున్ గారిని దగ్గర నుంచి చూశాను. తన సర్వస్వాన్ని ధారపోసి యాక్టర్ కమ్ డైరెక్టర్‌గా ఎదిగారు!’- ఇలా అన్నది ఎవరో కాదు, డైరెక్టర్ సుకుమార్. అర్జున్ దర్శకత్వంలో వస్తున్న ‘సీతా పయనం’ సినిమా టీజర్ లాంచ్‌లో డైరెక్టర్లుగా మారిన యాక్టర్ల గురించి ప్రస్తావించారు సుకుమార్. హీరోగా, దర్శకుడిగా రాణించిన అర్జున్, ఉపేంద్ర క్లాసిక్ కల్ట్ మూవీస్‌ను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్లకు డిక్టేషన్ చెప్పిన మన డైరెక్టర్ కమ్ యాక్టర్స్ విశేషాలు ప్రస్తావించుకుందాం.
తెలుగు సినిమా తొలి తరం నటుడు చిత్తూరు నాగయ్య. నటనకు కొలమానం నిర్దేశించిన ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగానూ రాణించారు. నిర్మాతగా మేలు రత్నాల్లాంటి చిత్రాలను అందించారు. నాగయ్య తర్వాత దర్శకుడిగా ఎనలేని కీర్తి గడించిన స్టార్ హీరో ఎన్టీఆర్. ‘సీతారామకళ్యాణం’ సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తారు ఎన్టీఆర్. రామాయణంలోని విలన్ రావణుడిని కథానాయకుడిగా చేసి చూపించిన ఈ చిత్రం ఎన్టీఆర్లోని వైవిధ్యాన్ని చాటిచెప్పింది.
ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ డజన్ వరకు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన డైరెక్షన్లో వచ్చిన చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. శ్రీకృష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా? పెళ్లామా?, తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, చాణక్య చంద్రగుప్త, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర, చండశాసనుడు, బ్రహ్మశ్రీ విశ్వామిత్ర, సామ్రాట్ అశోక ఇలా ఎన్నో సినిమాలు ఆయన హీరోగా నటిస్తూనే, దర్శకత్వం వహించారు.
ఎన్టీఆర్ డైరెక్ట్ చేసిన ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో కృష్ణుడిగా, దుర్యోధనుడిగా, కర్ణుడిగా త్రిపాత్రాభినయం చేసి మెప్పించారు. తర్వాత వచ్చిన ‘శ్రీమద్విరాటపర్వం’ సినిమాలో ఏకంగా ఐదు పాత్రలు (కృష్ణుడు, అర్జునుడు, బృహన్నల, కీచకుడు, దుర్యోధనుడు) పోషించి అదరహో అనిపించారు. ఇండస్ట్రీలో తనకు సమ ఉజ్జీగా భావించే ఏయన్నార్‌ను కూడా డైరెక్ట్ చేశారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన పెద్ద హీరో కృష్ణ. ఆయన కెరీర్లో మైలురాయిగా చెప్పుకొనే ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాకు కొన్నాళ్ల షూటింగ్ తర్వాత అనుకోకుండా డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1986లో వచ్చి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘సింహాసనం’ సినిమాకు దర్శకత్వం వహించింది ఆయనే. కాళీదాదా, శంఖారావం, ముగ్గురు కొడుకులు, కలియుగ కర్ణుడు ఇలా పదికిపైగా సినిమాలకు కృష్ణ దర్శకత్వం చేపట్టారు.
పద్మాలయ స్టూడియోస్ పతాకంపై ఎన్నో చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. ఎన్టీఆర్, కృష్ణ జమానా నుంచి మొదలైన హీరో కమ్ డైరెక్టర్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతున్నది. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, ధనుష్, విశ్వక్సేన్, సిద్ధార్థ్ ఇలా నటులుగా, దర్శకులుగా తమ సృజనాత్మకతను నిరూపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పూర్తిస్థాయి దర్శకుడిగా మారకపోయినా.. ఆయన చేసిన కొన్ని సినిమాల్లో పలు సన్నివేశాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
‘హీరోగా తెరపై మెరవడం ఒక కళ అయితే, దర్శకుడిగా కథను తెరకెక్కించడం అంతకుమించిన ఆర్ట్!’ అంటారు సినీ విమర్శకులు. పాన్-ఇండియా స్థాయిలో హీరో కమ్ డైరెక్టర్‌గా మెప్పించిన వారిలో కమల్ హాసన్ ముందు వరుసలో ఉంటారు. ‘హే రామ్’, ‘చాచీ 420’, ‘పోతురాజు’, ‘విశ్వరూపం’ లాంటి చిత్రాలతో హీరో-దర్శకుడిగా తన సత్తా చాటారు. స్ఫూర్తిదాయక, సామాజిక సందేశాత్మక కథలను చెప్పాలనే ఉద్దేశం కమల్‌ను దర్శకుడిగా మార్చింది. తర్వాత యాక్షన్ కింగ్ అర్జున్, కన్నడ హీరో ఉపేంద్ర పేర్లు వినిపిస్తాయి. అర్జున్ కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో హీరోగా మెరిసి, దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు.
‘సేవగన్’, ‘జైహింద్’, ‘మద్రాసి’.. లాంటి చిత్రాలతో దర్శకుడిగా, రచయితగా గుర్తింపు పొందారు. ఇప్పుడు ‘సీతా పయనం’తో తన కుమార్తె ఐశ్వర్య, నిరంజన్ జంటగా ఒక ప్రేమకథా చిత్రాన్ని రూపొందించారు. ఇక కల్ట్ సినిమాలకు కేరాఫ్‌గా మారిన ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉపేంద్ర కన్నడ సినిమాలో ‘A’, ‘ఉపేంద్ర’ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో సంచలనం సృష్టించారు. తెలుగులో ‘రా’తో ఆకట్టుకున్న ఉపేంద్ర, సామాజిక సందేశాలు, కొత్త కథన శైలితో యువతను ఆలోచింపజేశారు.
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు తనదైన శైలిలో కథను చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. మార్షల్ ఆర్ట్స్‌ను బ్యాక్‌డ్రాప్‌గా చేసుకుని ‘జానీ’ సినిమాతో ఓ ఎమోషనల్ ప్రేమ కథను చెప్పే ప్రయత్నం చేశారు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్లో ప్రత్యేకత చూపారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా విజయం సాధించలేకపోయినా, పవన్ టేస్ట్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు వస్తున్న యంగ్ హీరోల్లో విశ్వక్సేన్ తనలోని డైరెక్టర్ కమ్ హీరోని నేటి తరానికి చూపించే ప్రయత్నం చేశారు. ‘ఫలక్నామా దాస్’తో హీరోగా, దర్శకుడిగా కొత్త కథను చెప్పారు.
ఈ చిత్రం మిశ్రమ స్పందన పొందినా, విశ్వక్ దర్శకత్వం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘నాకు సినిమా అంటే కేవలం నటన కాదు, కథ చెప్పడంలోనూ భాగం కావాలనుకుంటాను’ అని విశ్వక్ ఓ సందర్భంలో ప్రేక్షకులతో పంచుకున్నారు. తమిళ సినిమాలో ఆర్.మాధవన్ ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’తో దర్శకుడిగా మారారు. ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథను అద్భుతంగా తెరకెక్కించారు.
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు.. జాతీయ అవార్డుల రేసులో నిలిచింది. హిందీ సినిమాల్లోనూ హీరోలు దర్శకత్వం వైపు మళ్లడం చూస్తున్నాం. మొత్తంగా చాలామంది స్టార్ హీరోలు సూపర్ డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. కొందరు ఒకట్రెండు సినిమాలే డైరెక్ట్ చేసినా.. ఒక ట్రెండ్ సృష్టించారు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం!
ఈ ట్రెండ్ బాలీవుడ్లో బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ ఉన్నదే! వి.శాంతారామ్, గురుదత్, రాజ్ కపూర్, దేవానంద్ ఇలా సూపర్స్టార్లు ఎందరో దర్శకులుగా రాణించారు. నిన్నటి తరానికి వస్తే ఆమిర్‌ఖాన్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన దర్శకత్వం వహించిన ‘తారే జమీన్ పర్’ అద్భుతమైన సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’తో మెగాఫోన్ పట్టుకోనున్నట్లు ప్రకటించడం విశేషం.