Voice Over in Tollywood Movies | చిరంజీవి సినిమాలో.. పవన్‌కళ్యాణ్ గళం వినిపిస్తే ఈలలే! డైలాగ్‌కింగ్ మోహన్‌బాబును.. మెగాస్టార్ పరిచయం చేస్తే గోలలే!! రవితేజ కథను వెంకీ మామ చెబితే.. యమాగా ఉంటుంది కదూ!! టాలీవుడ్లో ఎప్పట్నుంచో ఉన్నదే అయినా.. తాజాగా చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ‘ఆచార్య’ సినిమాకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ధర్మస్థలి విశేషాలను వివరిస్తూ ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. ఎప్పుడో మొదలైన వాయిస్ ఓవర్ ట్రెండ్‌ను మేటి హీరోలు నేటికీ కొనసాగిస్తున్నారు.
‘మైఁ సమయ్ హూఁ.. ఔర్ ఆజ్ మహాభారత్కీ అమర్కథా సునానే జారహా హూఁ’.. 1990 దశకంలో దూరదర్శన్‌లో మహాభారత్ సీరియల్ ఇలా కాలం చెప్పిన కథతోనే మొదలైంది. ఆ దూరదర్శన్‌లోనే ‘నేను ఓంకారాన్ని..’ అని ప్రతిధ్వనించిన గొంతుక ‘ఓం నమఃశివాయ’ సీరియల్లో తరచూ వినిపించేది. ఈ పద్ధతి టీవీకే పరిమితం కాలేదు. సినిమాల్లోనూ వాయిస్ ఓవర్ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నది. అయితే, పెద్దస్టార్లు తమ మాటలతో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం మొదలైనప్పటి నుంచి ఈ ట్రెండ్‌కు మరింత ఊపొచ్చింది.
పాత్రల పరిచయానికి, కథా గమనాన్ని తెలియజేసేందుకు దర్శకులు వాయిస్ ఓవర్‌ను నమ్ముకుంటారు. కొన్ని ప్రత్యేక విషయాలను పవర్ఫుల్ గొంతుకలో వినిపిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని భావిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలోని పాత్ర ద్వారానే ఆ విశేషాలను వివరిస్తారు. కమర్షియల్ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఒక హీరో సినిమాకు మరో కథానాయకుడితో వాయిస్ చెప్పిస్తున్నారు. దీనివల్ల సదరు సినిమా ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారుతుందని నమ్ముతున్నారు. పనిలో పనిగా మాటసాయం చేసిన మేటి హీరో అభిమానులు సైతం చిత్ర ప్రచారానికి దోహదం చేస్తారని లెక్కలు కడుతున్నారు.
మాట సాయం చేయడంలో మహేశ్‌బాబు ముందువరుసలో ఉన్నాడు. అడపాదడపా ఇతర హీరోల సినిమాల కోసం తన గొంతు సవరించుకుంటున్నాడు. ఎప్పుడో వచ్చిన ‘జల్సా’ నుంచి నేటి ‘ఆచార్య’ వరకు మహేశ్ తన మాటలతో చిత్రకథను పరిచయం చేశాడు. ‘యుద్ధంలో గెలవడం అంటే శత్రువును చంపడం కాదు’ అంటూ పవన్‌కళ్యాణ్ ‘జల్సా’లో వినిపించిన మహేశ్‌బాబు గళం ఇప్పటికీ అభిమానుల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నది. ఆ సినిమాలో సంజయ్ సాహూ పాత్రను మహేశ్ పరిచయం చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. సాహూ మందు ఎందుకు తాగుతాడో విడమరచి చెప్పడమే కాదు, అతగాడు మద్యానికే కాదు విద్యకు కూడా బానిసే అని నాలుగు ముక్కల్లో హీరో పాత్ర తీరుతెన్నులను చెప్పేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ‘బాద్షా’ కూడా మహేశ్ మాటలతోనే మొదలవుతుంది. ఓవైపు టైటిల్స్ రోల్ అవుతుంటే.. మరోవైపు మహేశ్ వాయిస్ వినిపిస్తుంది. ‘మేరా భారత్ మహాన్..’ అని మొదలుపెట్టి మనదేశంలో జరుగుతున్న ఉగ్రవాదదాడులను విమర్శిస్తూ, అలాంటి ఓ గ్యాంగ్‌స్టర్‌ను ‘బాద్షా’ ఎలా ఎదుర్కోబోతున్నాడో చెబుతాడు. ‘సాదూ
బాయ్‌కి సవాలు విసిరిన మొట్టమొదటి మగాడు బాద్షా’ అంటూ కథలోకి తీసుకెళ్తాడు. తాజాగా ఆచార్య సినిమాకూ మహేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కథలో కీలకమైన ‘ధర్మస్థలి’ పుట్టుపూర్వోత్తరాలను పూసగుచ్చినట్టు వివరించాడు. మొత్తానికి మెగాస్టార్ సినిమాకు మహేశ్‌బాబు గాత్రమివ్వడం టాలీవుడ్లో హీరోల మధ్య సఖ్యతను చెప్పకనే చెబుతున్నది.
ఇండస్ట్రీలో ఆల్‌టైమ్ మెగాస్టార్‌గా పేరొందిన చిరంజీవి కూడా ఎన్నో చిత్రాలకు మాటసాయం చేసినవాడే. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘రుద్రమదేవి’ కోసం చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. కాకతీయ సామ్రాజ్ఞి కథ ఆయన మాటలతోనే మొదలవుతుంది. అంతకుముందు ‘హనుమాన్’ యానిమేషన్ చిత్రానికి ఏకంగా ఆంజనేయుడి పాత్రకు డబ్బింగే చెప్పారు. మోహన్‌బాబు చిత్రం ‘సన్నాఫ్ ఇండియా’ కోసం చిరంజీవి గొంతు సవరించుకున్నారు. ‘మన అంచనాలకు అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను.. తన రూటే సెపరేటు’ అంటూ మెగాస్టార్ చెప్పిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. థియేటర్లో విజిల్స్ వేయించాయి.
మెగాస్టార్ 151వ చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’కి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పరిచయ గాత్రం అందించాడు. ‘చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరి మోగించిన రేనాటి సూర్యుడు సైరా నరసింహారెడ్డి’ అంటూ పవన్ పలికిన మాటలు ‘సైరా’ కథ సత్తా చాటాయి. తమిళంలో కమల్‌హాసన్, మలయాళంలో మోహన్‌లాల్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఒకరికొకరు మాట సాయం చేసుకుంటూ టాలీవుడ్ స్టార్లు తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా అడిగిందే తడవుగా స్వరాల వరం ఇస్తున్నారు. ‘మర్యాద రామన్న’లో సైకిల్‌కు గొంతు ఇచ్చి రవితేజ అందరినీ అలరించాడు. రవితేజ ‘క్రాక్’లో వెంకటేశ్ మాటలు మురిపించాయి. అల్లరి నరేశ్ కితకితలు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో వినిపించాయి. రామ్ ‘రామరామ కృష్ణకృష్ణ’లో ‘వీడు రామకృష్ణ, జనరల్‌గా మనిషికో కథ ఉంటుంది. వెరైటీగా వీడి పేరుకే ఓ కథుంది..’ అంటూ హీరో పాత్రను పరిచయం చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ‘స్వామిరారా’లో నారా రోహిత్ గళం ఖంగుమంటూ మోగింది. ‘రేసు గుర్రం’లో సునీల్ వాయిస్ అదిరింది. ప్రభాస్, నాగార్జున, నాని, రాజ్‌తరుణ్ తదితర హీరోలు కూడా సాటి హీరో కోసం మాటసాయం చేస్తూ మేమంతా ఒకటే అని నిరూపించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ వదిలేసుకున్న సినిమాలు తెలుసా.. ఈ సినిమాలు గానీ చేసి ఉంటే..
Lady villains in Tollywood |గ్లామర్‌తోనే కాదు.. విలనిజంతోనూ మెప్పించిన అందాల బొమ్మలు !
“ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..”