రామయ్య పెండ్లికి ఊరంతా పెద్దలే. సీతమ్మ కల్యాణానికి వాడంతా విడిదిల్లే! తోరణాలు కట్టేవారొకరు. చలువ పందిళ్లు వేసేవాళ్లు మరొకరు. ఉత్సవమూర్తులను అలంకరించేవాళ్లు వేరొకరు. ఇలా ప్రతి ఒక్కరూ రామకార్యానికి ఉడతా భక్తిగా తోడ్పడుతుంటారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన చెలువాది మల్లివిష్ణువందన కూడా ఈ కోవకే చెందుతారు. బియ్యం గింజలపై రామనామాన్ని లిఖించి.. కల్యాణ తలంబ్రాలు చదివిస్తున్నారు. రామ నామాంకితమైన తలంబ్రాలను శ్రీరామనవమి సందర్భంగా వివిధ ఆలయాలకు పంపుతూ తన భక్తిని వినూత్నంగా చాటుకుంటున్నారు.
చందానగర్‌లో ఉంటున్న విష్ణువందన పదో తరగతి వరకు చదువుకున్నారు. గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆమెకు రాముడంటే వల్లమాలిన భక్తి. శ్రీరామునిపై తనకున్న అచంచలమైన భక్తిని చాటుకోవాలని ఎప్పుడూ పరితపిస్తూ ఉంటారు. మొదట్లో కొండాపూర్‌లో ఉన్న రామాలయానికి పూలదండలు అల్లి నిత్యం తీసుకెళ్లి పూజల్లో పాల్గొనేవారు. తన భక్తికి మరింత ప్రత్యేకత జోడించాలని భావించారామె. ఈ క్రమంలో ఒంటిమిట్ట రామాలయంలో రామ నామం జపిస్తూ తలంబ్రాలు తయారు చేస్తారని తన భర్త ద్వారా తెలుసుకున్నారు. ఆ స్ఫూర్తితో బియ్యం గింజలపై రామనామం లిఖిస్తూ తలంబ్రాలు తయారుచేయడం మొదలుపెట్టారు. 2016లో మొదటిసారి 1,11,111 గింజలపై ‘శ్రీరామ’ నామాన్ని రాసి తలంబ్రాలు తయారుచేశారు.
వాటిని పలు రామాలయాల్లో జరిగే కల్యాణోత్సవానికి సమర్పించారు. తొమ్మిదేండ్లుగా ఈ క్రతువును కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 128 రామాలయాలకు సభక్తికంగా ఆమె తలంబ్రాలను సమర్పించారు. విష్ణువందన ఈ ఏడాది 1,75,000 గింజలపై రామనామం రాసి, వాటిని 60కి పైగా రామాలయాలకు పంపించారు. భద్రాచలంతోపాటు తుంగతుర్తి, జగిత్యాల, భువనగిరి, వరంగల్, నల్లకుంట, బీరంగూడ, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న రామాలయాలతోపాటు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పశ్చిమ్‌బెంగాల్ రాష్ర్టాల్లోని రామాలయాలకూ ఈ తలంబ్రాలను పంపించారు. శ్రీరామనవమికి ఎనిమిది నెలల ముందుగానే ఆమె ఈ మహత్కార్యాన్ని ప్రారంభిస్తారు. నిత్యం రామనామాన్ని స్మరిస్తూ… బియ్యంపై ‘శ్రీరామ’ అని రాస్తూ.. సత్కాలక్షేపం చేస్తారు. భవిష్యత్తులో శ్రీరామనవమికి 108 ఆలయాలకు రామ నామాంకితమైన తలంబ్రాలను పంపడమే తన లక్ష్యం అంటున్న విష్ణువందన భక్తి తత్పరతకు మనమూ వందనం సమర్పించుకుందాం!