భారతీయ సంస్కృతికి వేదం మూలం. అనాదిగా పరిఢవిల్లుతున్న సనాతన ధర్మానికి పునాదులు వేదాలే! పూర్వం రాజులు వేద విద్యను ప్రోత్సహించారు. గురుకులాలు ఏర్పాటు చేసి భావితరాలకు వేద విద్యను అందించారు మన రుషులు. కాలక్రమంలో వేద విద్యాభ్యాసం అంటే.. భారంగా భావించే రోజులు దాపురించాయి. సంప్రదాయ కుటుంబీకులు కూడా తమ వారసులను వేదాధ్యయనం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏదీ లేదన్న నిశ్చయానికి వచ్చారు.
అలాంటి పరిస్థితుల్లో…. ప్రభవించిన వెలుగు రేఖ శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్మృతి ట్రస్ట్! ప్రాతః స్మరణీయులు, నడిచే దేవుడిగా పేరొందిన కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామివారి సంకల్పంతో వేద విద్వన్మణి శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి వారు వేద విద్యకు సమున్నత పట్టం కట్టారు. ఈ తరాన్ని వేదం వైపు మళ్లించడానికి అహరహం కృషి చేస్తున్నదీ సంస్థ. వేదాధ్యయనం చేసిన విద్యార్థులకు పట్టా అందించి పండితులుగా తీర్చిదిద్దుతున్నది. ఈ సంస్థ ఆవిర్భవించి పాతికేండ్లు అవుతున్న రజతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని.. అపూర్వ ప్రస్థానాన్ని స్మరించుకుందాం!
వేద నాదం ప్రవహించే చోట ఈతిబాధలు ఉండవని శాస్త్రవచనం. యుగాలుగా ప్రవహిస్తున్న అనంత వేద ధార.. ఆధునిక కాలంలో ఆటుపోట్లకు గురవుతున్న మాట వాస్తవం. ఈ లోటుపాట్లను సవరించడానికి, వేదాల వైభవాన్ని పునరుద్ధరించడానికి ఎందరో మహనీయులు పాటుపడుతున్నారు. ఆధ్యాత్మిక పీఠాలు వేద విద్య పరివ్యాప్తికి అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర మహా సరస్వతీ స్వామివారి నిర్దేశంతో.. శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామివారు 2001లో శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వేద విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సంస్థ సేవలు అందిస్తున్నది.
ఈ ట్రస్ట్ ఏర్పాటు వెనుక స్వామివారి వ్యాకులత ప్రధాన కారణం. పూర్వాశ్రమంలో కుప్పా లక్ష్మణావధానిగా పేరున్న వేదపండితులు వారు. కంచి పరమాచార్యతో కలిసి వీరూ కాలినడకన ఎన్నో ప్రాంతాలు పర్యటించారు. కంచి పీఠం ఆధ్వర్యంలో జరిగే వేద సదస్సులను సమర్థంగా నిర్వహించేవారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సలహాదారుగానూ సేవలు అందించారు. స్వామివారి ఆదేశానుసారం వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ, సమర్థులైన పండితులను తీర్చిదిద్దారు. పరమాచార్య సమక్షంలో తురీయ ఆశ్రమాన్ని స్వీకరించిన స్వామి… తర్వాతి కాలంలో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు పర్యటించే సమయంలో ఒక వెలితి ఆయన్ను కలిచివేసింది.
ఒకనాడు వేద విద్యకు ఆలవాలంగా పేరొందిన మంథని, ధర్మపురి, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వేదాధ్యయనం కుంటుపడిందని గమనించారు. వందలాది మంది వేద విద్వాంసులు, తర్క మీమాంస పండితులు కొలువై ఉన్న నెలవులో.. వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది విద్వాంసులే ఉండటం జనార్దనానంద సరస్వతీ స్వామివారిని నిరుత్సాహపరిచింది. ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో 2001లో సంస్మృతి ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి వేద విద్య పరివ్యాప్తికి అనేకానేక ప్రణాళికలు రూపొందించి, తెలుగునాట వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తూ… వారి విద్యకు సార్థకత చేకూరేలా సంస్థ పనిచేస్తున్నది.
శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ ఏర్పడక ముందు.. తెలంగాణ ప్రాంతంలో వేదాధ్యయం చేసిన విద్యార్థులు తమ గరిమను చాటుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్లి పరీక్షల్లో పాల్గొనాల్సి వచ్చేది. నేడు మన ప్రాంతంలో పండిత ప్రకాండులుగా పేరుమోసిన విద్వాంసులు చాలామంది ఎక్కడెక్కడికో వెళ్లి పరీక్షలు ఇచ్చినవారే. సంస్మృతి ట్రస్ట్ రాకతో.. దూరవ్యయ భారాలు తగ్గాయి. మన రుషులు సూచించిన విధంగా వేద పాఠ్య ప్రణాళికలు నిర్దేశించి, ఆమేరకు వేదాధ్యయనం చేసిన విద్యార్థులకు ఏటా పరీక్షలు నిర్వహిస్తూ.. స్నాతకోత్సవం ఏర్పాటుచేసి పట్టాలు ఇవ్వడం మొదలైంది. ఆ పట్టా అందుకున్న వారు ఎందరో.. దేవాదాయ శాఖలో వేదపారాయణ పండితులుగా ఉపాధి సాధించగలిగారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ కొలువు సంపాదించగలిగారు. మరికొందరు వేదిక్ యూనివర్సిటీలో ఆచార్యులుగానూ ఉపాధి పొందారు.
2001లో ఆరుగురు విద్యార్థులతో ప్రారంభమైన ట్రస్ట్ సేవలు ఏటికేడూ విస్తృతమయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలోనే దాదాపు 1500 మంది విద్యార్థులు వేదాధ్యయనం చేసి వివిధ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఎక్కడ వేదాధ్యయనం చేసిన విద్యార్థులైనా.. శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్ నిర్వహించే పరీక్షల్లో పాల్గొనవచ్చు. సంస్థ అందిస్తున్న సేవలు, పరీక్షలు నిర్వహిస్తున్న తీరుకు ఐఎస్ఓ 9001: 2001 గుర్తింపు కూడా లభించడం గమనార్హం.
మరోవైపు భాగ్యనగరంలో అరవై మంది విద్యార్థులతో ‘శ్రీవేదవ్యాస పాఠశాల’ నిర్వహిస్తూ, ఇప్పటికే 12 మంది ఘన, 15 మంది క్రమపాఠిలను అందించిందీ సంస్థ. మొత్తంగా తెలంగాణ ప్రాంతంలో 140 మంది క్రమ, ఘనపాఠిలను తీర్చిదిద్ది.. వేదమాత రుణం తీర్చుకున్నది. కొండెక్కుతున్న వేదదీప్తికి అనితరమైన సేవలు అందిస్తూ కొండంత అండగా నిలిచింది శ్రీ జనార్దనానంద సరస్వతీ స్వామి సంస్మృతి ట్రస్ట్. రజతోత్సవ వత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సంస్థ వేదాలకు మరింత విస్తృత ప్రచారం కల్పించడమే తమ లక్ష్యం అని చెబుతున్నది. సనాతన ధర్మ పరిరక్షణే తమ ధ్యేయమని పేర్కొంటున్నది.
ఈ నెల 8వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు జరిగే రజతోత్సవ వేడుకల్లో వేద విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. దీంతోపాటు వేద సదస్సులు, శాస్త్ర చర్చలు, పారాయణాలు, హవనాలు తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని స్కందగిరి ఆలయం ఈ రజతోత్సవ
సంరంభానికి వేదిక కానుంది.
సంస్థ తరఫున ఏటా వేసవిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు సంధ్యావందనం, పంచసూక్తాలు, నమకం, చమకం, ఇతర స్తోత్రాలు నేర్పుతున్నారు. ఉద్యోగుల కోసం ప్రతి శని, ఆదివారం శాస్త్ర విజ్ఞానం అందిస్తున్నారు. ఉచితంగా సేవలు అందిస్తూ.. సనాతన ధర్మాన్ని కాపుకాస్తున్నారు ట్రస్ట్ నిర్వాహకులు. ఏటా వివిధ పట్టణాల్లో సదస్సులు నిర్వహిస్తూ.. వేదం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తున్నారు.